ఆ పూల రంగు.. మనసు నిండు

20 Oct, 2015 19:58 IST|Sakshi
ఆ పూల రంగు.. మనసు నిండు

‘సల్లంగ జూడు బతుకమ్మా.. పోయి రావమ్మా బతుకమ్మా..’ అంటూ తెలంగాణ ఆడపడుచులంతా ట్యాంక్ బండ్ వైపు సాగుతున్నారు. ఎల్బీ స్టేడియం నుంచి దాదాపు 10 వేల బతుకమ్మలతో బయలుదేరిన ర్యాలీ.. కన్నుల పండువగా కొనసాగుతున్నది. బతుకమ్మకు ఘనంగా వీడ్కోలు పలికేందుకు వివిధ జిల్లాల నుంచే కాక నగరం నలుమూలల నుంచి మహిళలు పెద్ద ఎత్తున చేరుకున్నారు. తంగేడు, రంగులద్దిన గునుగు తదితర పూలతో పెద్ద పెద్ద బతుకమ్మలను పేర్చి గంగమ్మ వైపు పయనమయ్యారు. హుస్సేన్‌సాగర్ తీరంలో ‘సద్దుల బతుకమ్మ’ ఉత్సవానికి ప్రభుత్వం  భారీగా ఏర్పాట్లు చేసిసిన సంగతి తెలిసిందే.

మహిళలు బతుకమ్మలను ఎత్తుకుని నడుస్తూ..తెలంగాణ కళారూపాలు, విన్యాసాల నడుమ ప్రదర్శనగా ట్యాంక్‌బండ్‌కు చేరుకుంటారు. అక్కడ గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు, మంత్రులు, ప్రజాప్రతినిధులు ఉన్నతాధికారులు ర్యాలీగా వచ్చిన మహిళలకు స్వాగతం పలుకుతున్నారు. జిల్లాల వారీగా శకటాల ప్రదర్శన, వాటిని అనుసరిస్తూ మహిళల బతుకమ్మ ఆట, కళారూపాల విన్యాసాలు క్రమపద్ధతిలో జరిగేలా ఏర్పాట్లు చేశారు. మరికొద్ది గంటల్లో బతుకమ్మను నిమజ్జనం చేస్తారు.

  • 10 వేల మంది ఎల్బీ స్టేడియం నుంచి బతుకమ్మలతో ట్యాంక్‌బండ్ ప్రధాన ఉత్సవ వేదిక దాకా ర్యాలీగా సాగుతున్నారు.
  • 10 వేల బతుకమ్మలను పేర్చారు.
  • ఇందుకోసం 65 వేల టన్నుల పూలను ఏర్పాటుచేశారు.
  • మంగళవారం ఉదయం నుంచి బతుకమ్మను పేర్చేందుకు ఏర్పాట్లు జరిగాయి
  • సాయంత్రం 4:30 గంటలకు ఎల్బీ స్టేడియం నుంచి బతుకమ్మ ర్యాలీ ప్రారంభం కావాల్సి ఉండగా కాస్త ఆలస్యంగా 6 గంటలకు ప్రారంభమైంది.

>
మరిన్ని వార్తలు