దోమలపై యుద్ధం!

5 Nov, 2014 03:09 IST|Sakshi
దోమలపై యుద్ధం!

* నేటి నుంచి జీహెచ్‌ఎంసీ స్పెషల్ డ్రైవ్
* ఇంటింటికీ వెళ్లి తనిఖీలు..దోమల నివారణ చర్యలు
* కరపత్రాల ద్వారా ప్రచారం
* మూడు షిఫ్టుల్లో 60 మందితో కార్యక్రమం...
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో సీజనల్ వ్యాధులు తీవ్రమవుతుండడం, డిఫ్తీరియా, డెంగీ కేసులు పెరుగుతుండడంతో జీహెచ్‌ఎంసీ అప్రమత్తమవుతోంది. మలేరియా, డెంగీ, దోమల ద్వారా వ్యాప్తి చెందే వ్యాధుల  నిరోధానికి స్పెషల్ డ్రైవ్ చేపడుతోంది. దోమల నివారణకు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ప్రజల నుంచి ఆరోపణలు వెల్లువెత్తుతుండటంతో ఇప్పటివరకు అనుసరించిన విధానాలకు భిన్నంగా సరికొత్త వ్యూహంతో పదిరోజుల పాటు స్పెషల్ డ్రైవ్‌ను నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు.  ఇందులో భాగంగా బుధవారంనుంచి  రోజుకొక డివిజన్ చొప్పున మలేరియా సిబ్బంది ఇంటింటికీ వెళతారు. కేటాయించిన డివిజన్‌లోని ఏ ఒక్క ఇంటిని కూడా విడిచిపెట్టకుండా వెళ్లి దోమలు వృద్ధి చెందకుండా అవసరమైన మందులు చల్లుతారు.

నిలువనీరు లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా ఇళ్ల యజమానులకు సూచిస్తారు. దోమల నివారణపై అవగాహన  కల్పిస్తారు. ఒకవేళ ఎవరైనా మలేరియా సిబ్బందిని ఇంట్లోకి రాకుండా నిరోధిస్తే సదరు ఇంటినెంబరు, చిరునామా రాసుకొని స్థానిక కార్పొరేటర్‌కు తెలియజేస్తారు. కార్పొరేటర్ సమన్వయంతో ప్రజలకు నచ్చచెబుతారు. తద్వారా ఏ ఒక్క ఇంటిని కూడా మిన హాయించకుండా దోమల నివారణ చేపట్టవచ్చునని భావిస్తున్నారు. ముఖ్యంగా పాతబస్తీ పరిధిలో దోమల వ్యాప్తి ఎక్కువగా ఉండటాన్ని దృష్టిలో ఉంచుకొని తొలిదశలో పాతబస్తీ పరిధిలోని నాలుగు సర్కిళ్లలోని 59 డివిజన్లలో ఈ కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

వీటితోపాటు కోర్ సిటీలో వ్యాధుల జాడ ఎక్కువగా ఉన్న భోలక్‌పూర్ వంటి డివిజన్లలోనూ   స్పెషల్  డ్రైవ్ నిర్వహించనున్నట్లు జీహెచ్‌ఎంసీ చీఫ్ ఎంటమాలజిస్ట్ వెంకటేశ్ తెలిపారు. ఈ స్పెషల్‌డ్రైవ్‌లో భాగంగా వ్యాధుల జాడలున్న ప్రాంతాలకు జిల్లా వైద్యాధికారి సహకారంతో సదరు ప్రాంతాల్లో బ్లడ్‌శాంపిల్స్ సేకరిస్తారు. అవసరాన్ని బట్టి వైద్యశిబిరాలూ ఏర్పాటు చేస్తారు. మలేరియా సిబ్బంది తనిఖీలు చేసిన ఇళ్లకు వారు సందర్శించినట్లు తెలియజేసే స్టిక్కర్లు అంటిస్తారు.
 
దోమల నివారణకు సంబంధించిన సూచనలతో కూడిన కరపత్రాలను అందజేస్తారు. ఇందులో భాగంగా ఒక డివిజన్‌లోని ఇళ్లన్నింటినీ ఒకేరోజు పూర్తి చేస్తారు. ఇందుకుగాను 60 మంది సిబ్బందిని మూడు షిప్టుల్లో నియమిస్తారు. అదనపు సిబ్బంది అవసరమైతే నియమిస్తారు. ఎటొచ్చీ ఒక డివిజన్‌లోని ఇళ్లన్నింటినీ ఒకేరోజు పూర్తి చేస్తారు. రోజుకు దాదాపు ఆరు డివిజన్ల చొప్పు పదిరోజుల్లో  ఈ స్పెషల్‌డ్రైవ్ పూర్తిచేస్తారు. మలిదశల్లో మిగతా సర్కిళ్లలోనూ ఈ స్పెషల్ డ్రైవ్ నిర్వహించ నున్నట్లు వెంకటేశ్ తెలిపారు.

మరిన్ని వార్తలు