వ్యాధులపై అప్రమత్తంగా ఉండండి

3 Jul, 2016 00:58 IST|Sakshi
వ్యాధులపై అప్రమత్తంగా ఉండండి

వైద్య, ఆరోగ్య శాఖకు అంచనాల కమిటీ ఆదేశం  
 

 సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతం సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని వైద్య, ఆరోగ్య శాఖ అధికారులను శాసనసభ అంచనాల కమిటీ ఆదేశించింది. ఏజెన్సీ ప్రాంతాలు, పట్టణాల్లోని మురికివాడల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. అంచనాల కమిటీ చైర్మన్ సోలిపేట రామలింగారెడ్డి అధ్యక్షతన శనివారం అసెంబ్లీ కమిటీ హాలులో వైద్య, ఆరోగ్య శాఖపై సమావేశం జరిగింది. గతంలో ఏ ప్రభుత్వం ఇవ్వని విధంగా ఈ శాఖకు బడ్జెట్‌లో నిధులు పెంచామని, వాటిని సద్వినియోగం చేయాలని అధికారులకు సోలిపేట సూచించారు. గత ఏడాది బడ్జెట్‌లో రూ.2,472 కోట్లు, ఈ ఏడాది రూ.3,504 కోట్లు కేటాయించామన్నారు.

నిధుల సక్రమ వినియోగ కోసమే కమిటీ పనిచేస్తోందన్నారు. సీజనల్ వ్యాధుల నివారణ, నిధుల ఖర్చుకు సబంధించి పూర్తి వివరాలతో కార్యాచరణ ప్రణాళికను వారంలోగా అందించాలని అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ గాంధీ, ఉస్మానియా, నిలోఫర్ తదితర ఆసుపత్రుల పనితీరునూ కమిటీ చైర్మన్ సమీక్షించారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో ప్రసవాలు పేదలకు భారంగా మారాయని, ఒక్కో ప్రసవానికి కనీసం రూ.50 వేల దాకా ఖర్చు చేయాల్సి వస్తోందన్నారు. ప్రభుత్వాసుపత్రుల్లో పారిశుద్ధ్యం మెరుగు పరచాలని, మందుల స్టాకు వివరాలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో పొందుపరచాలని ఆదేశించారు. ఆసుపత్రుల్లో రోగులకు, వారి సహాయకులకు అందించే ఆహారం కల్తీ కాకుండా చూడాన్నారు. నిధులు సక్రమంగా వాడకపోతే అధికారులపై చర్యలు తీసుకుం టామని హెచ్చరించారు. మరో వారంలో సమావేశం కావాలని, ఈసారి నేరుగా ఆస్పత్రులను సందర్శించాలని కమిటీ నిర్ణయిం చింది. సమావేశంలో ఎమ్మెల్యేలు డి.కె. అరుణ, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, ఎమ్మెల్సీ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు