సోషల్ మీడియా.. అప్రమత్తతే రక్ష!

28 Sep, 2014 00:05 IST|Sakshi
సోషల్ మీడియా.. అప్రమత్తతే రక్ష!

జాబ్ స్కిల్స్

సామాజిక మాధ్యమాలు... ప్రపంచవ్యాప్తంగా మనుషుల మధ్య దూరాన్ని చెరిపేస్తున్న ఆధునిక వేదికలు. ఈ మాధ్యమాలతో ఎన్నో ప్రయోజనాలున్నాయి, అదేస్థాయిలో నష్టాలూ ఉన్నాయి. సోషల్ మీడియాను సరిగ్గా ఉపయోగించుకోవడం తెలిస్తే ఆశించిన ప్రయోజనం పొందొచ్చు. తెలియకపోతే నష్టపోవడం ఖాయం. జాబ్ సెర్చ్, రిక్రూట్‌మెంట్ అనేవి సామాజిక మాధ్యమాల ద్వారా కొనసాగుతున్నాయి. ఉద్యోగాల కోసం అభ్యర్థులు, తమకు తగిన అభ్యర్థుల కోసం రిక్రూటర్లు సోషల్ మీడియాపై ఆధారపడుతున్నారు.

కొలువు వేట ప్రారంభించినవారు తమ ప్రొఫైల్‌ను, రెజ్యూమెను లింక్డ్‌ఇన్, ఫేస్‌బుక్, ట్విట్టర్, గూగుల్+ వంటి సైట్లలో పోస్టు చేస్తున్నారు. రిక్రూటర్లు వీటిని పరిశీలించి సంతృప్తి చెందిన తర్వాతే అభ్యర్థులను ఇంటర్వ్యూకు పిలుస్తున్నారు. అంతేకాకుండా అభ్యర్థుల గుణగణాలను తెలుసుకొనేందుకు ఆయా సైట్లలో వారి అకౌంట్లను నిశితంగా పరిశీలిస్తున్నారు. అకౌంట్లలో అవాంఛనీయ, అభ్యంతరకరమైన అంశాలుంటే వారిని తిరస్కరిస్తున్నారు. ఇప్పటికే తమ సంస్థలో కొలువులో ఉన్నవారి అకౌంట్లను కూడా యాజమాన్యాలు గమనిస్తున్నాయి. కాబట్టి ఈ సామాజిక మాధ్యమాల్లో ఏయే అంశాలను పోస్టు చేయాలి, వేటిని చేయకూడదు అనే విషయంలో అభ్యర్థులు అప్రమత్తంగా వ్యవహరించాలి.
 
ప్రొఫైల్‌కు ముస్తాబు

ఏదైనా విందుకు హాజరు కావాలంటే సాధ్యమైనంత వరకు చక్కగా ముస్తాబై వెళతాం. సోషల్ మీడియాలో ప్రొఫైల్‌ను పోస్టు చేసేముందు కూడా దాన్ని ఇలాగే ముస్తాబు చేయాలి. ప్రొఫైల్‌ను తప్పుల్లేకుండా ఆకర్షణీయంగా రూపొందించుకోవాలి. పోస్టు చేసిన తర్వాత తరచుగా పరిశీలిస్తూ అప్‌డేట్ చేస్తుండాలి. అర్హతలు, అనుభవం పెరిగితే వాటిని అందులో తప్పనిసరిగా చేర్చాలి. ప్రొఫైల్ అసంపూర్తిగా ఉండకూడదు. మీకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని పొందుపర్చాలి. మీకు ప్లస్ పాయింట్‌గా భావిస్తున్న ప్రతి అంశానికి అందులో చోటు కల్పించాలి. మీరిచ్చే సమాచారం పూర్తి సత్యమైనదై ఉండాలి. గొప్పల కోసం అసత్యాలు, అర్ధ సత్యాలను నమ్ముకుంటే మిగిలేది అప్రతిష్టే. మీ తాజా ఫొటోను కూడా అప్‌లోడ్ చేయండి. ఇందులో మీరు ప్రొఫెషనల్‌గా కనిపించాలి. స్నేహితులతో కలిసి సరదాగా తీసుకున్న ఫొటో ఇలాంటి చోట పనికిరాదు.
 
ప్రొఫెషనల్ అచీవ్‌మెంట్స్
మీరు ఇప్పటికే ఒక సంస్థలో పనిచేసి ఉంటే అక్కడ సాధించిన విజయాలను సోషల్ మీడియాలో పోస్టు చేయండి. ఇది మీకు అడ్వాంటేజ్‌గా మారుతుంది. ప్రొఫెషనల్ అచీవ్‌మెంట్స్‌ను హైలైట్ చేయడం వల్ల చాలా ప్రయోజనాలుంటాయి. రిక్రూటర్లు ఇలాంటి వాటికి అధికా ప్రాధాన్యత ఇస్తున్నారు. మీ పనితీరు, విజయాలు నచ్చితే వారి నుంచి పిలుపు రావొచ్చు.  
 
చెప్పడానికేమీ లేదా?
ఇప్పటికే ఉద్యోగంలో కొనసాగుతూ ఉంటే.. సోషల్ మీడియా అకౌంట్ల విషయంలో ఇంకా జాగ్రత్తగా ఉండాలి. సంస్థ, యాజమాన్యం, సహచరుల ప్రవర్తన, మీరు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి ప్రతికూలమైన వ్యాఖ్యలు చేయొద్దు. సంస్థ ప్రతినిధులు వీటిని గమనిస్తుంటారు. మీ కామెంట్లు సంస్థ పేరును దెబ్బతీసేలా ఉంటే.. మీకు ఉద్యోగం నుంచి ఉద్వాసన తప్పదు. పోస్టు చేయడానికి మంచి విషయం ఏదీ లేకపోతే మౌనంగా ఉండండి. అంతేతప్ప చెడు ప్రచారం మాత్రం చేయకండి. అది మీకే వ్యతిరేకంగా పనిచేస్తుంది. దీనివల్ల మరో కంపెనీలో కూడా కొలువు దొరకదు. మీరు మంచి ఉద్యోగి, మంచి వ్యక్తి అనే విషయం మీ సోషల్ మీడియా అకౌంట్లను చూస్తే తెలిసిపోవాలి. కొన్ని జోక్‌లు ఫ్రెండ్స్‌తో చెప్పుకొని నవ్వుకోవడానికి పనికొస్తాయి కానీ, ఫేస్‌బుక్‌లో, ట్విట్టర్‌లో పెట్టడానికి కాదు.
 
అబద్ధాలు వద్దు
కొందరు తమకు జ్వరమని చెప్పి, ఆఫీస్‌లో సెలవు తీసుకుంటారు. మరుసటి రోజు పార్కులోనో, పబ్బులోనో చిందులేస్తారు. ఆ ఫొటోలను, ఎంజాయ్‌మెంట్‌ను సోషల్ మీడియాలో గొప్పగా పోస్టు చేస్తారు. వాటిపై కామెంట్లను చూసుకొని ఆనందిస్తుంటారు. ఈ ఫొటోలను కంపెనీ యాజమాన్యం చూస్తే ఏం జరుగుతుందో కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఇలాచేసి మిమ్మల్ని మీరే మోసం చేసుకోకండి. బాస్‌తో అబద్ధాలు చెప్పకండి. ఒకవేళ చెప్పినా మీ నిర్వాకాన్ని బయటపెట్టే అవకాశం సోషల్ మీడియాకు ఇవ్వకండి.

మరిన్ని వార్తలు