ఇంటి వద్దే బ్యూటీఫుల్!

19 Feb, 2016 07:06 IST|Sakshi
ఇంటి వద్దే బ్యూటీఫుల్!

సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో త్వరలోనే మొబైల్ బ్యూటీపార్లర్లు అందుబాటులోకి రానున్నాయి. పట్టణ ప్రాంతాలకే పరిమితం కాకుండా సెమీ అర్బన్, జిల్లా కేంద్రాలు, వాటికి సమీప ప్రాంతాల్లో ఇళ్ల వద్దే సౌందర్య సేవలు లభించనున్నాయి. యువతులకు ఉపాధి కల్పించేలా అధికారులు ప్రణాళిక రచిస్తున్నారు. ఇటీవలి కాలంలో అందంపై అతివల అభిరుచి పెరగిన నేపథ్యంలో.. ఇటువంటి సేవలు కోరుకునే మహిళల ఇళ్ల వద్దకే వెళ్లి బ్యూటీపార్లర్లలో లభించే  సేవలను అందుబాటులోకి తేవాలని బీసీ సంక్షేమ శాఖ కసరత్తు చేస్తోంది. బీసీ వర్గాలకు చెందిన యువతులకు దీనిని ఒక ఉపాధి అవకాశంగా మలచాలని బీసీ సంక్షేమశాఖ నడుం బిగించింది.

దాదాపు వెయ్యి మంది యువతుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించి బ్యూటీషియన్ కోర్సు లో శిక్షణ ఇవ్వనుంది. కోర్సును విజయవంతంగా పూర్తి చేసిన వారికి స్కూటర్ లేదా మోపెడ్, మొబైల్ బ్యూటీ కిట్, యాప్రాన్, ఫోన్‌ను ఉచితంగా అందించనుంది. అతివలు ఇళ్ల వద్దే ఈ సేవలు వినియోగించుకునేందుకు వీలుగా మొబైల్ యాప్‌ను రూపొందించనుంది. వచ్చే నెల నుంచే దీనిని ప్రారంభించేం దుకు సన్నాహాలు చే స్తున్నారు. బీసీ కార్పొరేషన్లు, ఫెడరేషన్ల ద్వారా ఈ ప్రక్రియను పూర్తి చేయనున్నారు. బీసీ సంక్షేమశాఖ ఇన్‌చార్జి ముఖ్య కార్యదర్శి సోమేశ్‌కుమార్ ఆధ్వర్యంలో ఈ పథకానికి తుదిమెరుగులు దిద్దుతున్నారు.

సంచారజాతులకు ఫెడరేషన్..
సంచారజాతుల వారికోసం ప్రభుత్వం  విడిగా ఫెడరేషన్ ఏర్పాటు చేయనుంది. రానున్న బడ్జెట్‌లో (2016-17) నిధులు కేటాయించనుంది. జిల్లాలవారీగా సంచారజాతుల వారిని గుర్తించి, స్వయం ఉపాధి, నైపుణ్యాల మెరుగుదలకు తోడ్పాటు అందించనుంది. జిల్లా కేంద్రాలకు దగ్గరలో వారికి డబుల్ బెడ్‌రూం ఇళ్లు ఇవ్వడంతోపాటు ఇతర పథకాలను వారికి చేరువ చేయాలనే అభిప్రాయంతో బీసీ సంక్షేమశాఖ ఉంది.
 

మరిన్ని వార్తలు