బా.బ్బా.బ్బాబు!

23 Jun, 2017 23:45 IST|Sakshi
బా.బ్బా.బ్బాబు!

గ్రేటర్‌లో నీరుగారిన ‘బెగ్గర్‌ ఫ్రీ’ పథకం
నగరంలో దాదాపు 20 వేల మంది సంచారం
వీరి సంపాదన ఏటా రూ. 270 కోట్లు
పలు సర్వేల్లో ఆసక్తికర అంశాలు


నగరాన్ని ‘బెగ్గర్‌ ఫ్రీ’గా చేయాలన్న జీహెచ్‌ఎంసీ ఆశయానికి గండి పడింది. ఏడాదిగా ఎంత ప్రయత్నించినా సిటీలో యాచకుల సంఖ్య తగ్గలేదు. ఇప్పటికీ ఎక్కడ పడితే అక్కడ బిచ్చగాళ్లు కనబడుతూనే ఉన్నారు. గతేడాది ‘బెగ్గర్‌ ఫ్రీ సిటీ’ ప్రణాళికలో భాగంగా దాదాపు 500 మంది యాచకులను గుర్తించారు. వీరిని పునరావాస కేంద్రాలకు తరలించారు. కానీ ఫలితం శూన్యం. సిటీలో ఇప్పటికీ 20 వేల మంది యాచకులు ఉన్నట్లు... వీరు ఏటా రూ.270 కోట్ల వరకు సంపాదిస్తున్నట్లు కొన్ని సంస్థల సర్వేల్లో తేలింది. – సాక్షి, సిటీబ్యూరో     

సిటీబ్యూరో: విశ్వనగరంగా ఎదుగుతోన్న హైదరాబాద్‌ నగరాన్ని ‘బెగ్గర్‌ ఫ్రీ సిటీ’గా మార్చేందుకు  గత సంవత్సరం జూన్‌లో జీహెచ్‌ఎంసీ శ్రీకారం చుట్టింది. కానీ..ఏడాది గడిచినా బెగ్గర్‌ ఫ్రీ సిటీగా మారలేదు. ఎక్కడ పడితే అక్కడ బిచ్చగాళ్లు కనబడుతూనే ఉన్నారు. వివిధ స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వ శాఖలు, పోలీసు విభాగంతో కలిసి గత సంవత్సరం దాదాపు 500 మంది యాచకులను గుర్తించారు. వీరందరినీ పునరావాస కేంద్రాలకు పంపించి, వారిలో పనిచేయగలిగిన వారికి పనులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. దాదాపు 200 మందిని గత సంవత్సరం నవంబర్‌ వరకు  రెండు, మూడు దశల్లో నగర శివార్లలోని అమ్మానాన్న అనాథాశ్రమానికి తరలించారు. ఈ చర్యలతో సిగ్నళ్ల వద్ద బిక్షాటన దాదాపు తగ్గింది. అధికారులు వచ్చి ఆశ్రమాలకు తరలిస్తారని భయపడి చాలామంది కొంతకాలం వరకు సిగ్నల్‌ లైట్ల వద్దకు రాలేదు.

ఆ తర్వాత ఈ కార్యక్రమాన్ని గురించి పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. దాంతో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. ఇళ్లకు వెళ్లిన వందమందే కాక అంతకు ఎన్నో రెట్ల మంది పెరిగిపోయారు. ట్రాఫిక్‌ సిగ్నళ్లతోపాటు  బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, ప్రార్థనాస్థలాలు, తదితర ప్రాంతాల్లో వీరు కనిపిస్తున్నారు. వీరిలో పసిబిడ్డల నుంచి వృద్ధుల వరకు ఉన్నారు. పసికందులను చంకలో ఉంచుకొని యాచన చేయడం ఎక్కువ లాభసాటిగా కనిపిస్తుండటంతో ఇలాంటి మహిళలూ ఎక్కువ సంఖ్యలోనే ఉన్నారు.  ఈమేరకు కామన్‌ఫోరం, ఫ్యూచర్‌ లీడింగ్‌ మిషన్, యూత్‌ఫర్‌ సేవ, ఇందిరా ప్రియదర్శిని రూరల్‌ ఏరియా డెవలప్‌మెంట్‌ సర్వీస్‌ సొసైటీ, ఫెడరేషన్‌ ఆఫ్‌ ఎన్‌జీవోస్‌ ఫర్‌ బెగ్గర్‌ ఫ్రీ సొసైటీలోని వివిధ సంస్థలు నగరంలోని యాచకులపై నిర్వహించిన సర్వేల సగటు వివరాల్లో పలు ఆసక్తికర అంశాలున్నాయి.

యాచన వృత్తిలో 20 వేలమంది..
వివిధ సంస్థల సర్వేల మేరకు జీహెచ్‌ఎంసీ పరిధిలో దాదాపు 20 వేల మంది ఈ పనుల్లో ఉన్నారు. వీరిలో దాదాపు 90 శాతం మందికి పనిచేయగలిగే శక్తిసామరŠాధ్యలున్నా యాచక వృత్తినే ఆశ్రయించారు.

ఏటా రూ. 270 కోట్లు ..
గ్రేటర్‌లోని యాచకులు సంపాదిస్తున్నది రోజుకు దాదాపు రూ.75 లక్షలు. ఈ లెక్కన నెలకు వీరు రూ.22.50 కోట్లు. సంవత్సరానికి లెక్కిస్తే దాదాపు రూ.270 కోట్లు ఆర్జిస్తున్నారు.

పనితీరు ఇలా..
వ్యవస్థీకృతంగా ఉన్న ఈ వృత్తిలో దళారులకు కొదవ లేదు. అలాంటి వారు దాదాపు 200 మంది ఉన్నట్లు అంచనా. అంధులు, అంగవికలురను తమ వ్యాపారానికి ఎక్కువగా వినియోగించుకుంటున్నారు. నగరం, రాష్ట్ర ప్రజలకంటే బిహార్, మధ్యప్రదేశ్‌లతో సహా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్లు ఈ బిచ్చగాళ్లలో ఎక్కువగా ఉన్నారు. కొందరు పార్ట్‌టైమ్‌ పనిగా దీన్ని చేస్తుండగా,  పండుగల వంటి సందర్భాల్లో మాత్రమే ఈ పని చేసేవారు గణనీయంగానే ఉన్నారు.

వ్యసనాలు అధికం..
ఈ వృత్తిలోని వారికి లేని వ్యసనాలు లేవు, మద్యం, మత్తుపదార్థాలు, అక్రమ సంబంధాలు వంటివి ఉన్నాయి. దినవారీ సంపాదనలో దాదాపు సగం సొమ్ము ఇందుకోసమే ఖర్చు చేసేవారు ఎక్కువగా ఉన్నారు. ఈ ఊబిలో బందీలుగా ఉన్న బాలలు రోజుకు సగటున  రూ. 500 వరకు సంపాదిస్తుండగా, కొందరు మహిళలు పగలు అడుక్కుంటూ, రాత్రివేళ సెక్స్‌ వర్కర్లుగా పనిచేస్తున్నారు. వీరిలో 90 శాతం మంది పునరావాసం కల్పిస్తామన్నా,  ఆశ్రమాలు/ అనాథ శరణాలయాల్లో  చేరుస్తామన్నా ముందుకు రావడం లేదు.

మరిన్ని వార్తలు