అంతా మా ఇష్టం!

11 Apr, 2016 00:54 IST|Sakshi
అంతా మా ఇష్టం!

అవసరానికి మించి పోలియో వ్యాక్సిన్ కొనుగోలు
ఈ నెల 25తో ముగియనున్న వ్యాక్సిన్ గడువు
గ్రేటర్‌లో మూడో విడత పల్స్‌పోలియో?
ఇప్పుడెలా సాధ్యమంటున్న  వైద్య నిపుణులు



సిటీబ్యూరో: డిమాండ్‌కు సరిపడా సరఫరా చేయడం వ్యాపారసూత్రం.. ఎంత అవసరమో అంత కొనడం ఓ పద్ధతి.. అయితే అధికారులు మాత్రం అందుకు విరుద్ధంగా ప్రవర్తించారు. అవసరం లేకపోయినా 27వేల డోసుల పోలియో వ్యాక్సిన్‌ను అధికారులు కొనుగోలు చేసి వృథా చేశారు. ఈ ఒక్క ఉదంతం చాలు అధికారులకు పాలనపై ఎంతశ్రద్ధ ఉందో. అవసరం లేకపోయినా వాక్సిన్ కొనుగోలు చేయడం, ఆ తర్వాత దాన్ని గుట్టుచప్పుడు కాకుండా వదిలించుకునేందుకు పథకం పన్నడం మామూలైపోయింది. ఒక్క హైదరాబాద్ జిల్లాలోనే 27 వేల డోసుల పోలియో వాక్సిన్ మిగిలిపోయింది. ఈ విషయం గమనిస్తే చుక్కల మందు వేసే కార ్యక్రమం  ఎంత శ్రద్ధగా జరుగుతుందో ఇట్టే అర్థం చేసుకో వచ్చు. ఒక్కోడోసుకు రూ.110 ఖర్చవుతుంది. అంటే రూ. 29.70 లక్షల విలువైన వ్యాక్సిన్ మిగిలిపోతుందన్నమాట. ఈ నెల 25లోగా దీన్ని వినియోగించపోతే వ్యాక్సిన్ మొత్తం పనికిరాకుండా పోయే ప్రమాదం ఉంది. గ్రేటర్ హైదరాబాద్‌లో ఐదేళ్లలోపు చిన్నారులు 9.9 లక్షల మంది ఉండగా, వీరిలో హైదరాబాద్ జిల్లాలో 5.84 లక్షల మంది, రంగారెడ్డి అర్బన్‌లో 4.95 లక్షల మంది చిన్నారులు ఉన్నారు. జాతీయ పల్స్‌పోలియో కార్యక్రమంలో భాగంగా ఏటా రెండుసార్లు పిల్లలకు వాక్సిన్ వేస్తారు. తొలివిడత కార్యక్రమంలో భాగంగా జనవరి 17 నుంచి 20 వరకు, రెండో విడత కార్యక్రమంలో భాగంగా ఫిబ్రవరి 20-23 వరకు పోలియో చుక్కల మందు పంపిణీ కార్యక్రమం చేపట్టారు. కానీ పిల్లల నిష్పత్తికి మించి వాక్సిన్ కొనుగోలు చేయడమే కాకుండా మిగిలిన దాన్ని వదిలించుకునేందుకు హైదరాబాద్ జిల్లాలో మూడోసారి పోలియో చుక్కలు కార్యక్రమం నిర్వహించాలని అధికారులు చూస్తుండటం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

 
యూపీహెచ్‌సీల కేటాయింపులోనూ..

హైదరాబాద్ జిల్లాలో 85 యూపీహెచ్‌సీలు ఉండగా ఒక్కో ఆరోగ్య కేంద్రం పరిధిలో 40-55 పోలియో బూత్‌లు ఏర్పాటు చేశారు. నిబంధనల ప్రకారం ఒక్కో మెడికల్ ఆఫీసర్‌కు ఒక యూపీహెచ్‌సీ కేటాయించాలి. కానీ జిల్లాలో ఒక్కో అధికారికి రెండు మూడు కేంద్రాలు కేటాయించడం వివాదాస్పదమైంది. అంతేకాదు పోలియో కార్యక్రమ ప్రచారం కోసం ఒక్కో ఆరోగ్య కేంద్రం పరిధిలో మూడు నుంచి ఐదు ఆటోలు ఏర్పాటు చేసి వీటికి మైక్‌లు అమర్చి పోలియో చుక్కలు వేయించుకోవాల్సిన అవసరం ఏమిటి? ఏ రోజు వేస్తున్నారు? ఎక్కడ వేస్తున్నారో వివరించాలి. ఇందు కోసం ఒక్కో వాహనానికి రోజు కు రూ.1200 చొప్పున అద్దె చెల్లిస్తుంది. కొంత మంది మెడికల్ ఆఫీసర్లు ప్రచార వాహనాలు ఏర్పాటు చేయకుండానే బిల్లులు బొక్కేశారు. అంతేకాదు వ్యాక్సినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న నర్సింగ్ స్టూడెంట్స్‌కు నిర్దేశించిన దానికంటే అతితక్కువ ఇన్‌సెంటివ్స్ ఇచ్చి పంపినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

 
ఇప్పుడెలా సాధ్యం

పిల్లల నిష్పత్తికి తగిన మోతాదులో వ్యాక్సిన్ కొనుగోలు చేయాల్సి ఉండగా, అధికారులు పిల్లల సంఖ్య కంటే ఎక్కువ వ్యాక్సిన్ కొనుగోలు చేశారు. దీంతో హైదరాబాద్ సహా రంగారెడ్డి జిల్లాలోనూ వ్యాక్సిన్ భారీగా మిగిలిపోయింది. మిగిలిన వాక్సిన్లతో పోలిస్తే పోలి యోవాక్సిన్ హీట్‌సెన్సీవ్ మెడిసిన్. మైనస్ 15-25 డిగ్రీల వ ద్ధ భద్రపరచాల్సి ఉంది. ప్రస్తుతం నగరంలో పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటింది. మిగిలిన వాక్సిన్‌ను వదిలించుకునేందుకు ఇలాంటి పరిస్థితుల్లో మూడో విడత వాక్సినేషన్ చేపట్టాలనుకోవడం ఎంత వరకు సమంజసమని వైద్యులు ప్రశ్నిస్తున్నారు. జాతీయ పల్స్‌పోలియో కార్యక్రమ నిబంధనల ప్రకారం ఏటా రెండు సార్లు మాత్రమే వాక్సినేషన్ కార్యక్రమం చేపట్టాలి. కానీ హైదరాబాద్‌లో గతంలో ఎన్నడూ లేని విధంగా మూడోసారి వాక్సినేషన్ చేపట్టాలను కోవడమంటే మిగిలిన వాక్సిన్‌ను వదిలించుకునేందుకు చేస్తున్న ప్రయత్నమేనని పలువురు సీనియర్ వైద్యులు స్పష్టం చేస్తునా ్నరు.

 

మరిన్ని వార్తలు