అరాచక శక్తుల్ని పెంచి పోషించింది బాబే

21 Sep, 2016 03:37 IST|Sakshi
అరాచక శక్తుల్ని పెంచి పోషించింది బాబే

* నయీం, జడల నాగరాజులను ప్రోత్సహించిందీ ఆయనే
* ‘అనంత’లో జరిగిన 400 హత్యలకు బాబే కారణం
* సీఐడీ విచారణ అనంతరం విలేకర్లతో భూమన

సాక్షి, గుంటూరు/గుంటూరు రూరల్: సీఎం చంద్రబాబు అరాచక శక్తులకు అక్షయపాత్ర అని, అరాచక, అసాంఘిక శక్తులను పెంచిపోషించింది చంద్రబాబేనని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి ధ్వజమెత్తారు. నయీం అనే విషపురుగును, జడల నాగరాజు అనే సంఘవిద్రోహశక్తిని సృష్టించింది చంద్రబాబేనన్నారు. 1984లో నాదెండ్ల భాస్కరరావు ద్వారా ఎన్టీఆర్ పదవీచ్యుతుడైనప్పుడు వాహనాల దహనానికి, అలజడులకు చంద్రబాబే కారణమన్నారు.

తన పదేళ్లపాలనలో అనంతపురంలో జరిగిన నమోదు కాని 400 హత్యలకు, పరిటాల రవి చనిపోయినప్పుడు జరిగిన దహనకాండకు ఆయనే కారణమన్నారు. తుని ఘటనకు సంబంధించి సీఐడీ అధికారుల నోటీసుతో మంగళవారం గుంటూరులోని సీఐడీ రీజనల్ కార్యాలయంలో జరిగిన విచారణకు భూమన హాజరయ్యారు. ఉదయం 11.15 గంటలకు వచ్చిన భూమనను సీఐడీ అధికారులు ఏడున్నర గంటలపాటు విచారించారు. సాయంత్రం 6,45 గంటలకు బయటికొచ్చిన భూమన విలేకరులతో మాట్లాడారు. తుని ఘటనకు కారకుల్ని పట్టుకోకుండా తనను వ్యతిరేకించే ప్రత్యర్థి రాజకీయనాయకుల్ని ఈ కుట్రలో భాగస్వాములను చేయాలనే బాబు కుతంత్రం కనిపిస్తోందని మండిపడ్డారు.

తుని ఘటనకు జగన్‌మోహన్‌రెడ్డి, భూమన కారణమంటూ సంఘటన జరిగినరోజే చంద్రబాబు ప్రకటించారని.. ఆయనకు ఈ సమాచారం ఎలా తెలిసిందో అడగడానికిగాను విచారణ అధికారులు నోటీసులివ్వాలన్నారు. సీఎంకు, తనపై ఆరోపణలు చేసిన హోంమంత్రి చినరాజప్పకు నోటీసులిచ్చి పోలీసులు నిష్పాక్షికతను చాటుకోవాలన్నారు. తనకే సంబంధం లేకపోయినా,   ఎటువంటి ఆధారాల్లేనప్పటికీ కేసులో ఇరికించేందుకు ఉద్దేశపూర్వకంగా తనను విచారణకు పిలుస్తున్నారని మండిపడ్డారు. విచారణకు హాజరయ్యేముందు కూడా భూమన వైఎస్సార్‌సీపీ జిల్లాకార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. అమావాస్యకు అబ్దుల్ ఖాదర్‌కు.. కోడిగుడ్డుకు గానుగెద్దుకు ఎంత సంబంధం ఉంటుందో.. తునిలో జరిగిన ఘటనకు, తనకు అంతే సంబంధముందన్నారు.

ఎవరో దుండగులు రైలును దహనం చేస్తే దాన్ని వైఎస్సార్‌సీపీకి ఆపాదించి పార్టీని సమూలంగా దహనం చేయాలనే కుటిలప్రయత్నాల్ని చంద్రబాబు చేస్తున్నారన్నారు. ముద్రగడ చేస్తున్న ఉద్యమానికి వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు జగన్ నైతిక మద్దతు తెలపడాన్ని భరించలేక చంద్రబాబు తనను అరెస్టు చేయించాలని కుటిలయత్నాలకు పాల్పడుతున్నారన్నారు.  కాగా,  భూమనను అరెస్టు చేస్తారనే ప్రచారం జోరుగా సాగింది. దీనికి తగ్గట్టుగా విచారణ  ఏడున్నర గంటలపాటు సాగడంతో సీఐడీ కార్యాలయం వద్ద తీవ్ర  ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే భూమనను అరెస్టు చేయలేదు. భూమన వెంట వైఎస్సార్‌సీపీ నేతలు అంబటి రాంబాబు, చెవిరెడ్డి భాస్కరరెడ్డి, మర్రి రాజశేఖర్, లేళ్ల అప్పిరెడ్డి తదితరులున్నారు.
 
ఎమ్మెల్యే చెవిరెడ్డి ధర్నా..
తుని ఘటనతో సంబంధం లేని భూమనను విచారణ పేరుతో వేధిస్తున్నారంటూ  ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పార్టీ నేతలతో కలసి గుంటూరు సీఐడీ రీజనల్ కార్యాలయం ఆవరణలో ధర్నాకు దిగారు. దీంతో గుంటూరు అర్బన్ ఏఎస్పీ సుబ్బరాయుడు ఆధ్వర్యంలో పోలీసులు బలవంతంగా అరెస్ట్‌చేసి నగరంపాలెం పోలీసుస్టేషన్‌కు తరలించారు. ఆయనతోపాటు ధర్నాలో పాల్గొన్న మరో 14 మంది వైఎస్సార్‌సీపీ నేతల్ని ఈడ్చుకుంటూ తీసుకెళ్లి వ్యానుల్లో ఎక్కించి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

మరిన్ని వార్తలు