15 అడుగుల గుంతలో పడ్డ బైక్‌: యువకుడి మృతి

5 Jun, 2017 10:59 IST|Sakshi
15 అడుగుల గుంతలో పడ్డ బైక్‌: యువకుడి మృతి

హైదరాబాద్‌: నగరంలోని చింతల్‌కుంట చెక్‌పోస్ట్‌ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతిచెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయలయ్యాయి. వేగంగా వెళ్తున్న ద్విచక్రవాహనం అదుపుతప్పి అండర్‌పాస్‌ కోసం తీసిన గుంతలో పడటంతో బైక్‌పై ఉన్న ముగ్గురిలో ఒకరు మృతిచెందగా.. మరో​ ఇద్దరికి గాయాలయ్యాయి.

వివరాలు.. మీర్‌పేట్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని బడంగిపేట గాంధీనగర్‌కు చెందిన కె. రాఘవేంద్ర(23), ఇ. అశోక్‌, ఎల్‌ సాయికిరణ్‌ ముగ్గురు స్నేహితులు. ఆదివారం అర్ధరాత్రి దాటాక వీరు ముగ్గురు కలిసి సీబీజడ్‌ బైక్‌పై సాగర్‌ రింగ్‌ రోడ్డు వైపు నుంచి చింతలకుంట వస్తున్నారు. చెక్‌పోస్ట్‌ వద్ద రోడ్డు మధ్యలో నూతనంగా ఏర్పాటు చేయనున్న అండర్‌పాస్‌ కోసం భారీ గుంత తవ్వారు. ఇది గుర్తించని వాహనదారులు గుంతకు రక్షణగా ఏర్పాటు చేసిన బారికేడ్లను ఢీకొట్టి 15 అడుగుల లోతు ఉన్న గుంతలో పడ్డారు.

ఈ ప్రమాదంలో బైక్‌ నడుపుతున్న రాఘవేంద్ర తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతిచెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను ఎల్బీనగర్‌లోని శ్రీకర్‌ ఆస్పత్రిలో చేర్చి.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో జరిగినట్లు తెలుస్తోంది. బైక్‌ ఓవర్‌ స్పీడ్‌లో ఉండటం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నారు.

మరిన్ని వార్తలు