ఫిబ్రవరిలో బయో ఆసియా సదస్సు

27 Aug, 2016 01:38 IST|Sakshi
ఫిబ్రవరిలో బయో ఆసియా సదస్సు

వెబ్‌సైట్‌ను ఆవిష్కరించిన మంత్రి కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఏడాది ఫిబ్రవరి 6 నుంచి 8 వరకు హైదరాబాద్‌లో 14వ బయో ఆసియా సదస్సును నిర్వహించనున్నట్లు రాష్ట్ర మంత్రి కె.తారక రామారావు వెల్లడించారు. ‘బయో ఆసియా 2017’ వెబ్‌సైట్‌ను శుక్రవారం సచివాలయంలో ఆయన ప్రారంభించారు. ఔషధ ఎగుమతుల ప్రోత్సాహక మండలి, ఆసియన్ బయోటెక్ అసోసియేషన్స్ సమాఖ్యతో కలసి సదస్సును ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తామన్నారు. 50 దేశాలకు చెందిన వ్యాపారవేత్తలు, విధాన నిర్ణేతలు, పెట్టుబడిదారులు, శాస్త్రవేత్తలు ఒకే వేదికపై తమ అనుభవాలు, వ్యాపార నిర్వహణ మెలకువలను పంచుకుంటారని కేటీఆర్ తెలిపారు. ‘శక్తిమంతమైన గతం.. బలమైన భవిష్యత్తు’ నినాదంతో నిర్వహించే ఈ సదస్సు భారతీయ లైఫ్ సెన్సైస్ రంగం ప్రస్తుత పరిస్థితికి అద్దం పడుతుందన్నారు.

లైఫ్ సెన్సైస్ రంగంలో రాష్ట్రం ఇప్పటికే గణనీయమైన పురోగతి సాధించినా ఈ రంగాన్ని మరింత అభివృద్ధి చేయాల్సిన అవసరముందని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. ఈ రంగంలో దేశంతోపాటు తెలంగాణలో నూతన శకం దిశగా కీలక సంబంధాలు, భాగస్వామ్యాలను ఏర్పాటు చేసేందుకు సదస్సు దోహదపడుతుందన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల నుంచి వస్తున్న పెట్టుబడులతో ఔషధ, ఆరోగ్య ఉత్పత్తులు, సేవలు తదితరాలతో కూడిన లైఫ్ సెన్సైస్ రంగంలో దేశం గణనీయ పురోగతి సాధిస్తోందన్నారు. ప్రపంచ దేశాల్లోని ప్రజలకు నాణ్యమైన ఆరోగ్య, ఔషధ ఉత్పత్తులు భారత్ నుంచి అందేలా మరింత కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్, టీఎస్‌ఐఐసీ ఎండీ నర్సింహారెడ్డి పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు