సబ్‌ప్లాన్‌ నిధులను ఎందుకు ఖర్చు చేయలేదు!

29 Jan, 2017 02:59 IST|Sakshi
సబ్‌ప్లాన్‌ నిధులను ఎందుకు ఖర్చు చేయలేదు!

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌
సాక్షి, హైదరాబాద్‌: గత మూడేళ్లుగా ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ నిధులను ఆయా వర్గాల సంక్షేమానికి ఎందుకు ఖర్చు చేయలేదో వెల్లడించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ డిమాండ్‌ చేశారు. శనివారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ.. సబ్‌ప్లాన్‌ నిధులను ఖర్చు చేసే విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నారు. ఎస్సీ సబ్‌ప్లాన్‌ నిధుల వ్యయానికి అన్ని పార్టీల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాసంఘాలు, స్వచ్ఛంద సంస్థలతో జిల్లా స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు పర్యవేక్షణ కమిటీలు వేయాలని డిమాండ్‌ చేశారు. బీసీ సబ్‌ప్లాన్‌ను ఏర్పాటు చేయాలని, మహిళలకు 50 శాతం నిధులను కేటాయించాలన్నారు.పార్టీ నాయకులు ఎస్‌.మల్లారెడ్డి, జాజుల గౌరి తదితరులతో కలసి బీజేపీ రాష్ట్ర డైరీ– 2017ని ఆయన ఆవిష్కరించారు.

ఎస్సీ, ఎస్టీల పట్ల కేసీఆర్‌కు చిత్తశుద్ధి లేదు...
దళితులు, గిరిజనుల పట్ల సీఎం కేసీఆర్‌కు చిత్తశుద్ధి లేదని, మొసలి కన్నీరు కార్చేందుకే ఎస్సీ, ఎస్టీ ప్రజా ప్రజానిధులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ధ్వజమెత్తారు. భద్రాచలంలో జరిగిన బీజేపీ సమా వేశంలో ఎస్సీ వర్గీకరణ చేయాలని, అఖిలపక్షంతో ఢిల్లీకి వెళ్లాలని తీర్మానం చేసినందుకు శనివారం పార్టీ కార్యాల యంలో లక్ష్మణ్‌కు మందకృష్ణ అభినందనలు తెలిపారు. రెండు దశాబ్దాల కంటే రెండున్నరేళ్ల కేసీఆర్‌ పాలనలోనే దళితులు ఎక్కువగా మోసపోయారన్నారు. దళితులను అణిచివేయాలనే కుట్రే కనబడుతోందన్నారు.

>
మరిన్ని వార్తలు