వంచించి..వేధించాడు

18 Nov, 2015 22:35 IST|Sakshi
వంచించి..వేధించాడు

సాక్షి, సిటీబ్యూరో: క్లాస్‌మేట్ అయిన స్నేహితురాలిని వంచించడంతో పాటు బ్లాక్‌మెయిల్ చేస్తూ వేధిస్తున్న యువకున్ని సీసీఎస్ నేతత్వంలోని 'షీ-టీమ్స్' బుధవారం అరెస్టు చేశాయి. నిందితుడిపై ఐటీ యాక్ట్‌తో పాటు నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు అదనపు సీపీ స్వాతి లక్రా వెల్లడించారు. ఖమ్మం జిల్లా కొత్తగూడానికి చెందిన బి.తిలక్ అలియాస్ తిలక్ చౌదరి చెన్నైలోని ఓ సంస్థలో బయో ఇన్ఫర్మాటిక్స్ విభాగంలో బీటెక్ పూర్తి చేశాడు. ఉద్యోగం కోసం సిటీకి వచ్చి బేగంపేటలో నివసిస్తున్నాడు. కొంతకాలం పాటు జూబ్లీహిల్స్‌లోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం చేశాడు.

తిలక్ క్లాస్‌మేట్, స్నేహితురాలు అయిన ఓ యువతి ఉద్యోగం కోసం గత ఏడాది జూలైలో సిటీకి వచ్చి మాదాపూర్‌లోని ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్నారు. దాదాపు రెండేళ్లుగా ఆమెతో సన్నిహితంగా మెలిగిన తిలక్ ఆమె నమ్మకం సంపాదించాడు. గత ఏడాది సెప్టెంబర్‌లో ఓ ముఖ్యవిషయం మాట్లాడాలంటూ గదికి పిలిచాడు. కూల్‌డ్రింక్‌లో మత్తుమందు కలిపి యువతికి ఇచ్చిన తిలక్ ఆమెపై అత్యాచారం చేయడంతో పాటు నగ్న చిత్రాలను తీసుకున్నాడు.

 

అప్పటి నుంచి తరచు యువతిని వేధిస్తున్న తిలక్ తన మాట వినకుంటే ఆమె పేరుతోనే ఫేస్‌బుక్ ఖాతా తెరిచి, అందులో అప్‌లోడ్ చేస్తానంటూ బెదిరిస్తున్నాడు. ఓ సందర్భంలో తన వాట్సాప్ ప్రొఫైల్ పిక్చర్‌గా ఆ ఫొటోనే పెట్టడంతో పాటు స్నేహితులకూ ఫార్వర్డ్ చేశాడు. ఆమె ఉంటున్న హాస్టల్‌కు వెళ్ళి దురుసుగా ప్రవర్తించడంతో పాటు వాట్సాప్‌కు అసభ్య సందేశాలు పంపేవాడు. ఈ వేధింపులు మితిమీరడంతో బాధితురాలు 'షీ-టీమ్స్'కు ఫిర్యాదు చేసింది. దర్యాప్తు చేసిన అధికారులు బుధవారం నిందితుడిని అరెస్టు చేయడంతో పాటు ల్యాప్‌టాప్, సెల్‌ఫోన్, ఫొటోలు స్వాధీనం చేసుకున్నారు. తిలక్‌ను కోర్టులో హాజరుపరిచిన సైబర్ క్రైమ్ పోలీసులు జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు.

Read latest Hyderabad News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు