-

దేహానికి సమ్మర్ గార్డ్స్

1 Jun, 2015 00:37 IST|Sakshi
దేహానికి సమ్మర్ గార్డ్స్

మండే ఎండల్ని ఇచ్చే ప్రకృతే వాటి నుంచి కాపు ‘కాచే’ కాయల్నీ మనకు ఇచ్చింది. అందుకేనేమో... వాటికి తమ పేరుకు (ఆంగ్లంలో) ‘గార్డ్స్’ను జత చేసుకున్నాయి. నగరంలో మండుతున్న వేసవి నుంచి సిటీజనుల్ని రక్షించేందుకు అందుబాటులోనే ఉన్న కొన్ని కూరగాయలు తీసుకుంటే చాలంటున్నారు వైద్యులు. కూల్ డ్రింక్స్‌నో, మరో  కృత్రిమ పానియాలనో ఆశ్రయిస్తూ ఎండ నుంచి తాత్కాలిక ఉపశమనాన్ని, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల్ని కొని తెచ్చుకుంటున్నాం. వాటికి బదులు కొన్ని రకాల కూరగాయల్ని ఆహారంలో భాగం చేయడం ద్వారా మండే ఎండల్నీ చల్లగా సాగనంపవచ్చని నగరానికి చెందిన పలువురు పోషకాహార నిపుణులు చెబుతున్నారు.            - సాక్షి, లైఫ్‌స్టైల్ ప్రతినిధి
 

 బిట్టర్ గార్డ్
ఇది సమ్మర్ నుంచి రక్షించే ‘బెటర్ గార్డ్’. కాకర కాయగా మనకు అత్యంత చిరపరిచితమైన ఈ కూరగాయ వేసవికి తోడు పని ఒత్తిడి కారణంగా తలెత్తే హైపర్ టెన్షన్‌ను నివారిస్తుంది. సీజనల్‌గా ఏర్పడే పుండ్లు, దద్దుర్లు, ఫంగల్ ఇన్ఫెక్షన్, రింగ్ వార్మ్ వంటి వాటిని అదుపు చేయడంలో సహకరిస్తుంది. డయాబెటిస్ నియంత్రణకు ఇది చక్కని ఆహారం.
 
 స్నేక్ గార్డ్
 పేరులో పామున్నా.. స్నేక్ గార్డ్.. తెలుగులో పొట్లకాయగా మనకు చిరపరిచితమే. ఇది దేహానికి కూలింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది. వేడిమి కారణంగా పేరుకుంటున్న పొడి తత్వాన్ని దూరం చేసి శరీరంలో ఫ్లూయిడ్స్ ఉత్పత్తిని పెంచుతుంది. శరీర విధి నిర్వహణ సాధారణంగా జరిగేలా దోహదపడుతుంది.
 
 యాష్ గార్డ్
  పేరులో బూడిద ఉన్నా తీరులో బంగారం అనిపిస్తుంది యాష్‌గార్డ్.. అదే బూడిద గుమ్మడికాయ. దేహాన్ని చల్లగా ఉంచి వడదెబ్బ నుంచి కాపాడుతుంది. ఇది దాదాపు 96 శాతం నీటిని కలిగి ఉంటుంది.  విటమిన్- బి,ఎ (థయామిన్), బి3 (నియాసిన్)ను పుష్కలంగా అందిస్తుంది. దీనిలోని హై పొటాషియం రక్తపోటు సరైన క్రమంలో ఉండేలా చూస్తుంది. కిడ్నీలో రాళ్లు వంటి సమస్యల నివారణకు మంచి మందు.
 
 రిడ్జెడ్ గార్డ్
  బీరకాయనే ఆంగ్లంలో రిడ్జెడ్ గార్డ్ అంటారు. ఇది రక్తాన్ని శుద్ధి చేసి రక్తంలోని చక్కెర శాతాన్ని నియంత్రిస్తుంది. వేసవి కారణంగా తలెత్తే జీర్ణకోశ వ్యాధులకు చక్కని పరిష్కారం చూపుతుంది.
 
 బాటిల్ గార్డ్
 అత్యధికంగా నీటి శాతాన్ని కలిగి ఉన్న బాటిల్ గార్డ్.. సొరకాయగా తెలుసు. ఇది మినరల్ వాటర్ బాటిల్స్‌ను మించిన పోషకాలను అందిస్తూ దేహానికి రక్షణగా నిలుస్తుంది. ఎండ కారణంగా కడుపులో తలెత్తే ఎసిడిటీ సమస్యకు సొరకాయ మేలైన పరిష్కారం చూపుతుంది. విపరీతమైన చెమట కారణంగా కోల్పోయే సోడియంను శరవేగంగా భర్తీ చేస్తుంది. అతి దాహాన్ని, అలసటను దూరం చేస్తుంది.

మరిన్ని వార్తలు