గన్ పెట్టి బెదిరించాడు

30 Jun, 2014 00:33 IST|Sakshi
గన్ పెట్టి బెదిరించాడు

ఎంతో పేరొచ్చింది

డీజే వృత్తిలో ప్రవేశించి ఎనిమిదేళ్లు దాటింది. నాలుగు వేలకు పైగా షోలు చేశా. దోహా, ఖతార్, ఢిల్లీ, చెన్నై, బెంగళూరు, కోల్‌కతాల్లో డీజేగా చేశా. బాలీ వుడ్ నటులు నా ప్రతిభను మెచ్చుకున్నారు. అహ్మదాబాద్ ఉడాన్ సంస్థ నుంచి  ‘ఔట్‌స్టాండింగ్ ఫిమేల్ డీజే’, మోస్ట్ గ్లామరస్ గుజరాతీ డీజే అవార్డులు అందుకున్నా. ఒకప్పుడు ఇది మన సంప్రదాయం కాదన్నవారే ఇప్పుడు రూపాలీ మాకు గర్వకారణమంటున్నారు. మ్యూజిక్‌లో ఎన్నో ప్రయోగాలు చేయాలని ఉంది. గుజరాతీ, పంజాబీ, బాలీవుడ్ సంగీతాన్ని నాదైన శైలిలో ప్లే చేయగలను. ఒక వృద్ధాశ్రమం పెట్టి సేవచేయాలన్నది నా కోరిక.

ఎవరైనా రాణించొచ్చు:  పురుషుల కంటే మహిళలకు మ్యూజిక్ సెన్స్ ఎక్కువ. మరి అలాంటిది వారు మ్యూజిక్ రంగంలోకి ఎందుకు రాకూడదు. నిబద్ధత, శ్రమ ఉండాలేకానీ యువతులు కూడా ఇందులో రాణించవచ్చు. ఆదాయం ఎక్కువ.
 
మాది గుజరాత్ రాజధాని గాంధీనగర్ సమీపంలోని బరూచ్. నాన్న ఎస్‌బీఐలో పనిచేసి రిటైరయ్యారు. మేం ముగ్గురం అక్కాచెల్లెళ్లం. చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్‌తో పార్టీలు, ఫంక్షన్లకు వెళ్తుండడంతో అక్కడ ప్లే చేసే డీజే మ్యూజిక్‌పై ఇష్టం ఏర్పడింది. ఎలాగైనా డీజే మ్యూజిక్ నేర్చుకోవాలన్న కోరిక కలిగింది. ఇంట్లో చెబితే అమ్మానాన్న ససేమిరా అన్నారు. మన సంప్రదాయం మరిచి డీజేగా పనిచేయడమనే ఆలోచనే వారికి నచ్చలేదు. డీజే అంటే పబ్‌లు, క్లబ్‌లు అర్ధరాత్రి వరకూ తాగి చిందులేయడాలు.. అలాంటివి అవసరమేలేదన్నారు. వారికున్న ఈ దురాభిప్రాయాన్ని మార్చడానికి చాలా కష్టపడ్డా. ఫ్రెండ్స్, బంధువులు కూడా నిరుత్సాహపరిచిన వారే.
 
ఆయనే ఆదిగురువు..
నా భర్త రాహుల్ లేకుంటే నేను లేను. ఆయన అహ్మదాబాద్‌లో సౌండ్ ఇంజనీర్‌గా పనిచేసేవారు. డీజే మ్యూజిక్ చాలా బాగా ప్లే చేసేవారు. ఆయన వద్దనే ఈ విద్య నేర్చుకున్నా. తొలుత చిన్నచిన్న పార్టీల్లో ప్లే చేశా. క్రమేణా మా సాన్నిహిత్యం పెరిగి ఇరువురి మధ్య ప్రేమ చిగురించింది. పెళ్లిచేసుకున్నాం. నన్నెంతో అర్థం చేసుకున్న వ్యక్తి నా భర్తే. ఏ టైమ్‌లో ఇంటికెళ్లినా ఆయనే వంట చేసి భోజనం వడ్డిస్తారు. విచ్చలవిడి సంస్కృతిలో గడిపినా నేను మద్యం, ధూమపానం అలవాటు చేసుకోలేదు.  
 
డీజే వృత్తి అంటేనే సబ్‌కాన్షియస్‌లో ఉన్న మనుషుల మధ్య గడపడం. మహిళగా నేనూ ప్రారంభంలో చాలా భయానక పరిస్థితులెదుర్కున్నా. అహ్మదాబాద్‌లోని ఓ ఫాంహౌస్‌లో న్యూ ఇయర్ పార్టీలో డీజే ప్లే చేస్తుంటే తాగిన ఓ యువకుడు పదేపదే కజ్‌రారే.. కజ్‌రారే పాటను ప్లే చేయమన్నాడు. అప్పటికే పదిసార్లు ఆ పాట వినిపించడంతో ఇక కుదరదన్నా. అంతే జేబులో నుంచి గన్‌తీసి నుదుటకు పెట్టి ప్లే చేస్తావా?లేదా? అని బెదిరించాడు. నాకు ప్రాణం పోయినంత పనైంది. వెంటనే ఫంక్షన్ ఆర్గనైజర్లు అతన్ని తీసుకెళ్లారు. నా కెరీర్‌లో అత్యంత భయానక స్థితి అదే.

మరిన్ని వార్తలు