అన్ని ఆలయాలకు బోనాల నిధులు

28 Jun, 2016 01:41 IST|Sakshi
అన్ని ఆలయాలకు బోనాల నిధులు

ఉత్సవాల ఏర్పాట్లపై మంత్రి నాయిని సమీక్ష
సాక్షి, హైదరాబాద్: బోనాల పండుగ నిర్వహణ కోసం హైదరాబాద్‌లోని అన్ని ఆలయాలకు ప్రభుత్వం తరఫున నిధులు ఇవ్వనున్నట్లు రాష్ట్ర హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి పేర్కొన్నారు. దేవాదాయ శాఖ పరిధిలోకి వచ్చే గుళ్లతో పాటు మిగతా వాటికి సైతం నిధులు ఇస్తామన్నారు. బోనాలను రాష్ట్ర పండుగగా నిర్వహించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారని, దీని కోసం రూ.5 కోట్ల నిధులను కేటాయించారన్నారు. అవసరమైతే ఇంకా నిధులను పెంచాలని కేసీఆర్‌ను కోరతామన్నారు.

బోనాల పండుగ ఏర్పాట్లపై సోమవారం సచివాలయంలో నాయిని ఆధ్వర్యంలోని మంత్రుల కమిటీ.. వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో సుదీర్ఘ సమీక్ష నిర్వహించింది. అనంతరం మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో కలసి హోంమంత్రి విలేకరులతో మాట్లాడారు. ఒకేసారి వచ్చిన రంజాన్, బోనాల పండుగలను కలసిమెలసి ప్రశాంతంగా జరుపుకోవాలని నగర ప్రజలకు విజ్ఞప్తి చేశారు  ఈ నెల 24, 25న సికింద్రాబాద్‌లో, 30, 31న పాతబస్తీలో, వచ్చే నెల 7న గోల్కొండలో బోనాల ఉత్సవాలు జరుగుతాయన్నారు.

గతంలో గుళ్ల పరిసర ప్రాంతాల్లో చందాలు వసూలు చేసి బోనాలు నిర్వహించేవారని, తెలంగాణ వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వమే నిధులను కేటాయిస్తోందని  మంత్రి తలసాని అన్నారు. ప్రభుత్వమిచ్చే రూ.5 కోట్ల నిధులను నగరంలోని గుడి స్థాయిని బట్టి రూ.10 వేల నుంచి రూ.3 లక్షల వరకు కేటాయిస్తామన్నారు. అలాగే జీహెచ్‌ఎంసీ, ఆర్‌అండ్‌బీ, పర్యాటక, దేవాదాయ తదితర శాఖల ఆధ్వర్యంలో బోనాల నిర్వహణకు రూ.80 కోట్లను ఖర్చు చేయనున్నామన్నారు. అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేసి బోనాల ఉత్సవాలను విజయవంతం చేయాలని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో జీహెచ్‌ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసియొద్దీన్, ఆర్థిక శాఖ కార్యదర్శి శివశంకర్ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు