రామజన్మభూమిపై పుస్కకావిష్కరణ

4 May, 2015 00:16 IST|Sakshi

శాలిబండ (హైదరాబాద్): అయోధ్యలోని రామ జన్మభూమిపై వాస్తవాల పేరుతో అబ్దుల్ రహీం ఖురేషీ రాసిన 'అయోధ్య కా తానాజీ రామ జన్మభూమి పాసానా హై అఖికత్ నహీ..' (రామ జన్మభూమికి చరిత్ర ఉంది కానీ ఆధారాలు లేవు) అనే పుస్తకాన్ని ఆదివారం రాత్రి పాతబస్తీ ఖిల్వత్‌లోని ఉర్దూ మస్కాన్‌లో ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, మాజీ మంత్రి షబ్బీర్ అలీలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ.. అయోధ్యలోని రామ జన్మభూమి, బాబ్రీ మసీదు స్థల వివాదంలో వాస్తవ విషయాలను తెలుసుకునేందుకు అబ్దుల్ రహీం ఖురేషీ ఎంతో కష్టపడి ఆధారాలు సేకరించి పుస్తకాన్ని రాశారన్నారు.


ఉర్దూ మాద్యమంలో ఉన్న ఈ పుస్తకాన్ని యువత చదివి ఇతరులతో చదివించాలని సూచించారు. అయోధ్యలో ఉన్న బాబ్రీ మసీదును కూల్చారని, అక్కడ 500 ఏళ్ల నుంచి మసీదు ఉందని ఆయన గుర్తు చేశారు. ఈ కేసు సుప్రీంకోర్టులో ఉన్నందున దీనిపై ఎలాంటి వ్యాఖ్యలు చేయరాదన్నారు. త్వరలోనే న్యాయం జరుగుతుందని ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. కార్యక్రమంలో ముస్లిం పర్సనల్ లా బోర్డు సభ్యులు రహీముద్దీన్ అన్సారీ, జామే నిజామియా వీసీ ముఫ్తీ ఖలీల్ అహ్మద్, జాఫర్ యాద్ జిలానీ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు