పుస్తక ప్రియుల కిటకిట

22 Dec, 2014 00:18 IST|Sakshi
పుస్తక ప్రియుల కిటకిట

బుక్ ఫెయిర్‌కు పుస్తక ప్రియులు పోటెత్తారు. ఆదివారం సెలవు కావడంతో ఎన్టీయార్ స్టేడియంలో జరుగుతున్న ఈ ప్రదర్శనకు జంట నగరాల నుంచి సందర్శకులుతరలివచ్చారు. స్టాల్స్ అన్నీ కిటకిటలాడాయి. చిన్నా పెద్దా అందరూ సందడి చేశారు.
 
కవాడిగూడ:  పుస్తకాలు లేని ఇల్లు.. కిటికీలు లేని గదులతో సమానం. ‘చిరిగిన చొక్కా అయినా తొడుక్కో.. ఒక మంచి పుస్తకం కొనుక్కో’ అన్నారు మన పెద్దలు. కొనాల్సిన పుస్తకాలు అపరిమితం. డబ్బులు మాత్రం పరిమితం. అయితే ఓ ప్లాన్ ప్రకారం బుక్‌ఫెయిర్‌లో షాపింగ్ చేస్తే మంచి పుస్తకాలు కొనుక్కోవడంతోపాటు మనం అనుకున్న దానికన్నా ఒకటి రెండు ఎక్కువ కొనుక్కునే ఛాన్స్ కూడా ఉంది. హైదరాబాద్ మహానగరంలో గత మూడు దశాబ్దాలుగా జరుగుతున్న బుక్ ఫెయిర్‌కు ఈసారీ పుస్తక ప్రియుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. నగరం నలు మూలల నుంచి ప్రజలు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. ఆదివారం సెలవుదినం కావడం, సందర్శన వేళలు ఎక్కువగా ఉండడంతో పలు ప్రాంతాలనుంచి పుస్తకప్రియులు తరలివచ్చారు. ఎన్టీఆర్ స్టేడియం వద్ద భారీ క్యూ కన్పించింది.  కొంతమంది కుటుంబ సమేతంగా వచ్చి వారికికావాల్సిన పుస్తకాలు కొనుగోలు చేశారు. పుస్తక ప్రదర్శనను తిలకించేవారు, పుస్తకాలను కొనుగోలు చేసుకునే వారు, చాలా కాలంగా ఫలానా పుస్తకాన్నే కొనాలనుకునే వారు ప్రదర్శనకు విశేషంగా విచ్చేస్తున్నారు.

‘ప్లానింగ్’ ఉంటే మంచి పుస్తకాలు కొనొచ్చు...

 ప్రదర్శనలో కళ్లముందు దర్శనమిచ్చే ప్రతి పుస్తకంలో మనకు ఉపయోగపడే జ్ఞానం ఉంటుంది. మనం నేర్చుకోవాల్సిన, తెలుసుకోవాల్సిన పరిజ్ఞానం ఉంటుంది. మనలోని మానసిక పరిణితి స్థాయిని పెంచే విషయాలూ ఉంటాయి. వీటన్నింటినీ కొనుగోలు చేయాలంటే జేబు నిండా ఆర్థిక వనరు ఉండాలి. మన వద్ద జేబులో ఉన్న డబ్బులతో మనకు కన్పించే మంచి పుస్తకాలే ఖశ్చితంగా కొంటాము. కానీ, కొంచెం ముందుకెళ్లాక.. ఇంకా మంచి పుస్తకాలు, మన మనసుకు నచ్చిన, మనం ఎప్పటి నుంచో కొనాలని ఎదురు చూస్తున్న పుస్తకాలూ తారసపడొచ్చు. అప్పుడు కొంత బాధనిపిస్తుంది. ఇదంతా పుస్తకాల కొనుగోలు పట్ల సరైన ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడంతో వల్లే అని చెప్పవచ్చు. ఇందుకు కొన్ని సూత్రాలు పాటిస్తే ముందుగా మనం అనుకున్న బడ్జెట్‌లోనే మనకు ప్రీతిపాత్రమైన పుస్తకాలను కొనుగోలు చేసేందుకు వీలుంటుంది. బుక్‌ఫెయిర్‌లో మొత్తం 317 స్టాల్స్ ఉన్నాయి. ముందుగా స్టాల్స్ మొత్తాన్నీ ఒక రౌండ్ వేయాలి స్టాల్స్‌ను రౌండ్ వేస్తున్నప్పుడే మనకు నచ్చిన పుస్తకాలను, వాటి ధరలను, ఆ స్టాల్ నంబర్ ఒక కాగితంపై నోట్ చేసుకోవాలి.
 

మరిన్ని వార్తలు