బుక్ ఫెయిర్‌కు విశేష స్పందన

19 Dec, 2014 23:59 IST|Sakshi
బుక్ ఫెయిర్‌కు విశేష స్పందన

జన్మభూమి విజన్ డాక్యుమెంట్ కేసీఆర్ రాసిందే
భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు
పుస్తక పఠనంతోనే కేసీఆర్‌కు అపారమైన విజ్ఞానం

 
ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహిస్తోన్న 28వ హైదరాబాద్ బుక్ ఫెయిర్‌కు పుస్తక ప్రియుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. మూడో రోజైన శుక్రవారం పుస్తక ప్రదర్శనలోని స్టాళ్లు సందర్శకులతో కిక్కిరిసిపోయాయి. బాలసాహిత్యం, నవలలు, కమ్యూనిజం రచనలు, వ్యక్తిత్వ వికాసం, పోటీ పరీక్షలకు సంబంధించిన పుస్తకాలు, గణితం, సామాజిక అంశాలతో కూడిన అనేక రకాల పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. జాతీయ, అంతర్జాతీయ మహనీయుల జీవిత చరిత్రల పుస్తకాలు ప్రతి ఒక్కరిన్ని ఆకట్టుకుంటున్నాయి. ఇటీవల నోబుల్ బహుమతి అందుకున్న మలాల పుస్తకం ఈ ప్రదర్శనలో ప్రత్యేకంగా నిలిచింది.
 
కవాడిగూడ : పుస్తక పఠనం ద్వారానే ముఖ్యమంత్రి కేసీఆర్ అపారమైన విజ్ఞానాన్ని సముపార్జించారని భారీ నీటిపారుదల శాఖ మంత్రి, కేసీఆర్ మేనల్లుడు టి.హరీష్‌రావు అన్నారు. పుస్తక ప్రదర్శనలో భాగంగా ఎన్టీఆర్ స్టేడియంలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. వందేళ్ల జీవిత అనుభవాలు పుస్తక రూపంలో చదువుకోవచ్చన్నారు. కొన్ని విలువైన పుస్తకాలు తిరిగి ముద్రణకు నోచుకోకపోవడంతో కనుమరుగు అవుతున్నట్టు ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి ముఖ్యమైన పుస్తకాలను ముద్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తిగా సహకరిస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం నుంచి చెరువులపై ఓ పుస్తకాన్ని ముద్రించాల్సి ఉండగా, పని ఒత్తిడి కారణంగా జాప్యం జరుగుతుందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పుస్తకాాలతో ఉన్న అనుబంధాన్ని హరీష్‌రావు వివరించారు. ఎమ్మెల్యే కాక మునుపు అన్నం తినగానే పుస్తకాలను పట్టుకొని ఊర్లో మంచి వాతావరణం కలిగిన చెరువు గట్టుకు వెళ్లి పుస్తకాలు చదవడం పూర్తయిన తర్వాతనే వచ్చేవారని తెలిపారు. ఎమ్మెల్యే అయిన తర్వాత నాలుగైదు రోజులు నాగర్జున సాగర్‌కు వెళ్లి సుమారు 20 పుస్తకాలు చదవడం పూర్తయాకే వచ్చేవారన్నారు.

అంతటి పుస్తక పరిజ్ఞానంతోనే ముఖ్యమంత్రి కేసీఆర్ విశేషమైన, అపారమైన అనుభవాన్ని గడించారని తెలిపారు. ఉమ్మడి పాలనలో వచ్చిన జన్మభూమి విజన్ డాక్యుమెంట్ కేసీఆర్ రాసిందేనని వివరించారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం మిషన్ కాకతీయ ద్వారా 800 ఏళ్ల చరిత్ర కలిగిన చెరువులను పునరుద్ధరించేందుకు, కాపాడుకునేందుకు చేస్తున్న యజ్ఞంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై, సహకరించాలని కోరారు. కార్యక్రమంలో బుక్ ఫెయిర్ అధ్యక్షులు జూలూరు గౌరీ శంకర్, కార్యదర్శి చంద్రమోహన్, కవులు నందిని సిధారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు