ఏది జరిగినా జగన్‌కు ఆపాదించడమేనా?

3 Feb, 2016 02:11 IST|Sakshi
ఏది జరిగినా జగన్‌కు ఆపాదించడమేనా?

బాబు సర్కారుపై వైఎస్సార్‌సీపీ నేత బొత్స ధ్వజం
 
 సాక్షి, హైదరాబాద్: ప్రతిదానికీ రామ భజన చేసినట్టు.. రాష్ట్రంలో ఏ సంఘటన చోటుచేసుకున్నా చంద్రబాబు సర్కారు దానికి సంబంధించిన తప్పులన్నింటినీ తమ అధినేత జగన్‌మోహన్‌రెడ్డికి ఆపాదించడమే పనిగా పెట్టుకుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ దుయ్యబట్టారు. ఆయన మంగళవారం హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు. రాజధాని ప్రాంతంలో అధికారపార్టీకి చెందిన కొందరు వ్యక్తులు రైతుల పంటల్ని కాల్చివేస్తే, అదికూడా జగన్, వైఎస్సార్‌సీపీ చేయించినట్టు సీఎం ఆరోపించడాన్ని ఆయన గుర్తుచేశారు. ఆ ఆరోపణ చేసి ఏడాదవుతున్నదని.. కేసును మాత్రం తేల్చలేదని బొత్స తూర్పారపట్టారు.

‘కాపు గర్జన’ విజయవంతం అవుతుండడంతో గుబులుపుట్టి ప్రభుత్వ పెద్దలే అల్లరి మూకలద్వారా కార్యక్రమంలో అలజడి సృష్టించి.. నిందలు మాత్రం సంఘీభావం చెప్పడానికి వెళ్లిన పార్టీలు, నేతలపై వేస్తున్నారని మండిపడ్డారు. ‘‘ఎవరైనా సంఘీభావానికి వెళ్లితే, వాళ్లను నిందిస్తారా? 1994లో ముద్రగడగారు ఇదే అంశంపై కిర్లంపూడిలో నిరాహార దీక్ష చేస్తే, ఆరోజు చంద్రబాబు ప్రత్యక్షంగా అక్కడికెళ్లి సంఘీభావం తెలిపారు. మీరెళితే మంచి.. ఇంకొకరు వెళితే తప్పా... ఇదెక్కడి నీతి? ఇదెక్కడి చోద్యం?’’ అని బొత్స ప్రశ్నించారు.  

 ఆత్మహత్యపైనా రాజకీయాలేనా?
 కాపులను బీసీల్లో చేర్చాలన్న ఆకాంక్షను వ్యక్తం చేస్తూ వెంకటరమణ ఆత్మహత్యకు పాల్పడడం చాలా బాధాకరమని బొత్స అన్నారు. అతడి మృతికి పార్టీ తరఫున, వ్యక్తిగతంగాను సంతాపం తెలియజేస్తున్నట్టు చెప్పారు. అయితే ఈ ఆత్మహత్యపై ప్రభుత్వంలో ఉన్న పెద్దలు, టీడీపీ నేతలు స్పందించకపోవడం దారుణమన్నారు. వెంకటరమణ ఆత్మహత్యపైనా సీఎం హేళనగా మాట్లాడడం అత్యంత బాధాకరమన్నారు. దాన్ని కూడా రాజకీయంగా ఎవరికో ఒకరికి అంటగట్టడానికి ప్రయత్నించడం అధికారపార్టీ సంస్కృతిని తెలియజేస్తుందన్నారు.
 
 అమాయక కాపు యువతపై అక్రమ కేసులు పెడితే ఊరుకోం
 తునిలో జరిగిన సంఘటనలను అడ్డం పెట్టుకుని అమాయక కాపు యువతపై అక్రమ కేసులు బనాయించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని బొత్స ఆరోపించారు. అలాంటి పనులు చేసి, ఇంకా ఆ కులంలో ఆవేశాలు రేకెత్తించవద్దని సూచించారు. ఆధారాలుంటే తప్పుచేసిన వారిపై చర్య తీసుకోండిగానీ రాజకీయ లబ్ధికోసం చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని హితవు పలికారు.

మరిన్ని వార్తలు