ఇసుక దోచేస్తున్నారని అప్పుడే చెప్పాం: బొత్స

28 Feb, 2016 02:38 IST|Sakshi
ఇసుక దోచేస్తున్నారని అప్పుడే చెప్పాం: బొత్స

సాక్షి, హైదరాబాద్: ఇసుక ఉచితం పేరుతో అధికార తెలుగుదేశం పార్టీ నేతలు కొత్త తీరున దోపిడీలకు పాల్పడకుండా రెండు,మూడు రోజుల్లో పటిష్ట విధివిధానాలు ఖరారు చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. చంద్రబాబు తిరిగి ముఖ్యమంత్రి అయ్యాక ఇసుక ధరను అమాంతం పది రెట్లు పెంచి ప్రజ లను ఇబ్బంది పెడుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏడాదిన్నరగా చెబుతూ వ స్తోందని గుర్తు చేశారు. క్యూబిక్ మీటర్ రూ. 60 ఉండే ఇసుక ధరను.. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక రూ. 550కి పెంచి అధికార పార్టీ ఎమ్మెల్యేలు, నేతలు దోచుకున్నారన్నారు. ఇసుక అమ్మకాలపై సీఎం విడుదల చేసిన శ్వేత పత్రంలో, అమ్మకాల ద్వారా రాష్ట్రానికి రూ. 881 కోట్ల ఆదాయం వచ్చిందని చెప్పారని.. ఇప్పుడు మంత్రులు రూ. 220 కోట్లంటూ ప్రకటనలు చేయడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

 చంద్రబాబుకు ఎందుకు భయం: పార్టీలో చేర్చుకున్న ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి తాను చేసిన అభివృద్ధిని చెప్పుకొని వారినే తిరిగి ఎన్నికల్లో గెలిపించుకోవడానికి చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారని బొత్స ప్రశ్నించారు. అభివృద్ధిని చూసే పార్టీ మారామంటున్న ఎమ్మెల్యేలు ఆ పేరుతో ప్రజా తీర్పు కోరాలన్నారు.

మరిన్ని వార్తలు