మోసం చేస్తున్నారు

29 Dec, 2016 01:33 IST|Sakshi
మోసం చేస్తున్నారు

బాబు, యనమలపై ధ్వజమెత్తిన బొత్స

సాక్షి, హైదరాబాద్‌ : ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే 12.33 శాతం వృద్ధి సాధించామని ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు చేసుకుంటున్న ప్రచారంలో ఎంత మాత్రం నిజం లేదని, వారు కాకి లెక్కలు చెబుతూ ప్రజలను మోసం చేస్తున్నారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు. ఆయన బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... గత ఏడాది 10.99, ఇటీవలి ఆరు నెలల్లో 12.33 శాతం అభివృద్ధి నమోదైందని అవాస్తవాలు చెబుతున్నారని ఆరోపించారు. నిజంగా వృద్ధి నమోదైతే దాని ప్రభావం రాబడి (రెవెన్యూ) మీద కనిపిస్తుందన్నారు.

గత ఏడాది  రెవెన్యూలో వృద్ధి 25.9 శాతమైతే, జీడీపీగా 7.3 శాతం నమోదైందని వెల్లడించారు. ఈ ఏడాది 12.33 శాతం వృద్ధి రేటు చూపించారని... ఆ ప్రకారం చూస్తే రెవెన్యూలో 40 శాతం పెరిగి ఉండాలని వివరించారు. కానీ రెవెన్యూలో 10 కంటే ఒక్క శాతం కూడా వృద్ధి కాలేదని తెలిపారు. తాను చెప్పేది సరి కాదంటే... ప్రతి నెలా ప్రభుత్వానికి వచ్చిన రెవెన్యూ ఆదాయాలను ప్రజల ముందు బహిర్గతం చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు.  రాష్ట్రంలో ఏఏ జిల్లాల్లో ఏ గ్రామాల్లో ఎలాంటి పరిశ్రమలు నెలకొల్పారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ఆదాయం పెరగలేదని.. సీఎం, మంత్రులు, టీడీపీ నేతల ఆదాయమే పెరిగిందన్నారు.

మరిన్ని వార్తలు