వీడు మారడంతే..!

3 Apr, 2016 09:08 IST|Sakshi
వీడు మారడంతే..!

అమ్మాయిల పేరుతో నకిలీ ఫేస్‌బుక్ ఖాతాలు
స్నేహమంటూ సంపన్న వర్గాల విద్యార్థినులకు వల
మాయ మాటలతో నయవంచన
నగ్న చిత్రాలు అప్‌లోడ్ చేస్తానంటూ బెదిరింపులు
ఏడు నెలల్లో రెండోసారి కటకటాల్లోకి చేరిన మాజిద్

సాక్షి, సిటీబ్యూరో:  అమ్మాయిల పేర్లతో ఫేస్‌బుక్ ఖాతాలు తెరవడం, సంపన్న వర్గాలకు చెందిన విద్యార్థినులను టార్గెట్‌గా చేసుకుని స్నేహం పేరుతో వల వేసి నయవంచన కు పాల్పడటం... ఆనక నగ్న చిత్రాల పేరుతో బ్లాక్‌మెయిల్ చేస్తూ సైబర్ నేరాలకు పాల్పడుతున్న బీటెక్ విద్యార్థి అబ్దుల్ మాజిద్ మరోసారి అరెస్టయ్యాడు. ఇదే తరహాలో 80 మందిని మోసం చేసిన ఆరోపణలపై ఏడు నెలల క్రితం సైబరాబాద్ పోలీసులకు చిక్కాడు. జైలు నుంచి వచ్చినా బుద్ధిమార్చుకోకుండా పాత పం థానే కొనసాగిస్తూ శనివారం మరోమారు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు చిక్కాడు. ఇతడిపై ఇప్పటికి ఒక ఫిర్యాదే వచ్చిందని, బాధితులు ముందుకు వచ్చి ఫిర్యాదు చేస్తే పీడీ యాక్ట్ ప్రయోగిస్తామని సంయుక్త పోలీసు కమిషనర్ (నేరాలు) డాక్టర్ టి.ప్రభాకరరావు తెలిపారు.

 స్నేహం పేరుతో ఎర..
బంజారాహిల్స్ రోడ్ నెం.10 ప్రాంతానికి చెందిన అబ్దుల్ మాజిద్ నగరంలోని ఓ కళాశాలలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. వక్రబుద్ధితో నయవంచకుడిగా మారిన అతను రెండేళ్లుగా ఫేస్‌బుక్ కేంద్రంగా రెచ్చిపోతున్నాడు. అమ్మాయిల పేర్లతో నకిలీ ఖాతాలను తెరిచి సంపన్న వర్గాలకు చెందిన విద్యార్థినుల ప్రొఫైల్స్‌ను గుర్తించి, వారికి ‘ఫ్రెండ్ రిక్వెస్ట్’ పంపిస్తాడు.

 అవతలి వారు కూడా అమ్మాయిలే కదా అనే ఉద్దేశంతో విద్యార్థినులు ‘యాక్సెప్ట్’ చేయడంతో అసలు కథ మొదలెడతాడు. వారితో స్నేహపూరితంగానే ఛాటింగ్ చేస్తూనే వ్యక్తిగత విషయాలు రాబడతాడు, ఇలా స్నేహం పెరిగిన తర్వాత వారి ఆంతరంగిక విషయాల్లోకి తలదూరుస్తాడు.

 నయవంచన.. బ్లాక్‌మెయిలింగ్...
అవతలివారు పూర్తిగా తన ముగ్గులోకి దిగారని నిర్థారించుకున్న తర్వాత మాజిద్ అసలు కథ ప్రారంభి స్తాడు. విద్యార్థినుల్ని వంచించి వారి నగ్న చిత్రాలు, వీడియోలు సంగ్రహిస్తాడు. ప్రైవేట్ ఛాటింగ్ ద్వారా అసభ్యకరమైన సంభాషణలు కొనసాగిస్తాడు. ఆ తర్వాత వారి నే సంప్రదిస్తూ తన వద్ద ఉన్న ఫొటోలు, వీడియోలు సోషల్‌మీడియాలో పెట్టడంతో పాటు తల్లిదండ్రులకు పంపుతానని బ్లాక్‌మెయిల్ చేసి వారి నుంచి అందినకాడికి దండుకుంటాడు. కొన్ని సందర్భాల్లో అమ్మాయిల్ని వ్యక్తిగతంగానూ కలిసేవాడు. ఓసారి డబ్బు చెల్లించిన వాళ్లనూ విడిచిపెట్టకుండా పదేపదే బ్లాక్‌మెయిల్ చేసేవాడు. ఇతని ఆగడాలపై బంజారాహిల్స్ ప్రాంతానికి విద్యార్థిని, ఆమె తల్లి గత ఏడాది సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

 డిసెంబర్ నుంచి మళ్లీ మొదలు...
దీంతో కేసు నమోదు చేసుకున్న అధికారులు మాజిద్‌ను గుర్తించి గత ఏడాది సెప్టెంబర్ 11న అరెస్టు చేశారు. అప్పట్లో ఇతడు దాదాపు 80 మందిని వంచించినట్లు ఆరోపణలున్నాయి. మాజిద్ సృష్టించిన నకిలీ ఫేస్‌బుక్ ఖాతాను పరిశీలించగా, ఛాటింగ్స్‌లో ‘ఇప్పటికే రూ.86 వేలు ఇచ్చాను కదా! మళ్లీ బ్లాక్‌మెయిలింగ్ ఏమిటి?’ అంటూ ఓ విద్యార్థిని పంపిన సందేశం కూడా ఉంది. ఈ కేసులో న్యాయస్థానం నుంచి బెయిల్ పొందిన మజీద్ నవంబర్‌లో విడుదలయ్యాడు. డిసెంబర్ నుంచి మళ్లీ పాత పంథానే అనుసరిస్తూ వ్రిస్తీ శామల్, నేహా విరానీ పేర్లతో ఫేస్‌బుక్ ఖాతాలు తెరిచాడు. దాదాపు ఆరుగురిని వంచించిన ఇతడు కొందరి నుంచి డబ్బు సైతం కాజేశాడు. ఓ స్కూలు విద్యార్థిని సోదరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రైమ్ ఇన్‌స్పెక్టర్ పి.రాజు దర్యాప్తు చేపట్టారు. సాంకేతిక ఆధారాలను బట్టి మజీద్‌ను నిందితుడిగా గుర్తించి శనివారం అరెస్టు చేశారు.

 ఏళ్లుగా ఇదే వైఖరి..
పేద కుటుంబంలో పుట్టిన మజీద్ వ్యవహారశైలి ఆది నుంచీ ఇలానే ఉండేదని పోలీసులు పేర్కొంటున్నారు. ఇతడి తండ్రి మహ్మద్ సలీమ్ పాన్‌షాపులకు తమలపాకులు సరఫరా చేస్తుంటారు. తల్లి  కూరగాయలు విక్రయించేది. ఇలా వచ్చిన డబ్బుతోనే మజీద్‌ను బీటెక్ చదివిస్తున్నారు. ఆకతాయిగా మారిన మజీద్ ఇంటర్ నుంచే ప్రేమ పేరుతో అమ్మాయిల వెంటపడేవాడు. బీటెక్‌కు వచ్చాక ఈ ధోరణి మరింత విశృంఖలంగా మారింది. అమ్మాయిల పేర్లతో ఫేస్‌బుక్ ఖాతాలు తెరిచి ఛాటింగ్స్ చేస్తున్న వారిని చూసి ‘స్ఫూర్తి’ పొందిన మాజిద్ అదే పంథాను అమలు చేస్తూ మరో అడుగు ముందుకు వేశాడు. కొన్ని సందర్భాల్లో పోలీసు అధికారుల కుమార్తెగా ఫేస్‌బుక్‌లో పరిచయం చేసుకుని బ్లాక్‌మెయిల్స్‌కు పాల్పడే వాడని పోలీసులు పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు