విషమంగానే సంజన ఆరోగ్యం

5 Oct, 2016 06:59 IST|Sakshi
ఆస్పత్రిలో చిన్నారి సంజన

ప్రమాద వార్త తెలిసి ఆమె తాతకు గుండె నొప్పి
హైదరాబాద్: ముగ్గురు యువకులు మద్యం మత్తులో కారుతో ఢీకొట్టిన ఘటనలో గాయపడిన చిన్నారి సంజన ప్రాణాలతో కొట్టుమిట్టాడుతోంది. హైదరాబాద్‌లోని పెద్దఅంబర్‌పేట వద్ద ఆదివారం రాత్రి ముగ్గురు యువకులు మద్యం మత్తులో నిర్లక్ష్యంగా కారు నడిపి రోడ్డు దాటుతున్న తల్లి శ్రీదేవి, కూతురు సంజనను ఢీకొట్టిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడి ఎల్‌బీ నగర్‌లోని కామినేని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంజన పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని వైద్యులు వెల్లడించారు. ఆమె తల్లి శ్రీదేవిని కూడా మెరుగైన చికిత్స కోసం కామినేని ఆస్పత్రికి తరలించారు.

మనవరాలిని, కుమార్తెను ఈ పరిస్థితిలో చూసి తట్టుకోలేక శ్రీదేవి తండ్రి నరేందర్ ఛాతీలో నొప్పితో ఆస్పత్రి పాలయ్యారు. ఇక సంజన పరిస్థితి గురించి ఇప్పుడే చెప్పలేమని, శ్రీదేవికి శస్త్రచికిత్స చేయాల్సిన అవసరం ఉందని వైద్యులు తెలిపినట్లు శ్రీదేవి భర్త శివానంద్ కన్నీళ్ల పర్యంతమయ్యారు. వీరిద్దరికీ ఉప్పల్ ఎమ్మెల్యే ప్రభాకర్ సహకారంతో సీఎం సహాయనిధి ద్వారా వైద్యులు చికిత్స అందిస్తున్నారని చెప్పారు. కాగా ఆక్సిడెంటుకు కారణమైన  నిందితులకు  పూచీకత్తుపై బెయిల్ లభించింది.

 
మరో ఇద్దరి అరెస్ట్: మద్యం మత్తులో రోడ్డు ప్రమాదానికి కారణమైన మరో ఇద్దరు నిందితులు యాదిరెడ్డి, శ్రీనివాస్‌లను మంగళవారం హయత్‌నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు వెంకటరమణను సోమవారం రాత్రి అరెస్టు చేశారు. మిగతా ఇద్దరూ వెంకటరమణను మద్యం తాగేందుకు ప్రేరేపించి ప్రమాదానికి కారణమయ్యారని కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

>
మరిన్ని వార్తలు