ఈపాస్‌లో ‘విద్యార్థి సేవ’లకు బ్రేక్!

22 Oct, 2016 01:17 IST|Sakshi

నిలచిన ఉపకార, రీయింబర్స్‌మెంట్ దరఖాస్తు ప్రక్రియ.. కొత్త జిల్లాల నేపథ్యంలో వెబ్‌సైట్ పునరుద్ధరణ
సాక్షి, హైదరాబాద్: పోస్టుమెట్రిక్ ఉపకార వేతనాలు, రీయింబర్స్‌మెంట్‌కు సంబంధించి ఏర్పాటు చేసిన ఈపాస్ వెబ్‌సైట్‌లో ‘విద్యార్థి సేవల (స్టూడెంట్ సర్వీస్)’కు బ్రేక్ పడింది. ఫ్రెషర్స్‌తోపాటు రెన్యువల్ విద్యార్థులు తాజా విద్యా సంవత్సరానికి సంబంధించి దరఖాస్తులు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలి. అయితే కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలు అందుబాటులోకి రావడంతో వెబ్‌సైట్‌లో ఈ సర్వీసులు నిలచిపోయాయి. కొత్త జిల్లాలు, మండలాల సమాచారాన్ని పాతవాటి నుంచి విడదీసి నూతన వివరాలను అప్‌లోడ్ చేయాలి. ఈ ప్రక్రియ పూర్తయితేనే దరఖాస్తుదారుడికి వివరాలు వెబ్‌పేజీలో ప్రత్యక్షమవుతాయి.

అయితే వెబ్‌సైట్‌లో వివరాలు నమోదు చేయడంలో జాప్యం జరిగింది. దీంతో పాత వివరాల ప్రకారం దరఖాస్తు చేసుకునే వీలు లేనందున వెబ్‌సైట్‌లో విద్యార్థి సేవలను తాత్కాలికంగా నిలిపివేసింది. ఆరు రోజులుగా సర్వీసులకు బ్రేక్ వేయడంతో విద్యార్థులు సందిగ్ధంలో పడ్డారు. వచ్చే నెలాఖరుతో దరఖాస్తు గడువు ముగియనుంది. వెబ్‌సైట్‌లో సర్వీసులు నిలిచిపోవడం, ఎన్ని రోజుల్లో అందుబాటులోకి వస్తాయనే దానిపై స్పష్టత లేకపోవడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. కల్యాణలక్ష్మి పథకానికి సంబంధించిన సర్వీసులు సైతం నిలిచిపోయాయి. కాగా, విద్యార్థి సేవలు, కల్యాణలక్ష్మి సర్వీసులు తిరిగి ప్రారంభం కావాలంటే మరో వారం ఆగాల్సిందే.

కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల సమాచారాన్ని వెబ్‌సైట్‌లో నిక్షిప్తం చేసి.. వాటి పరిధిలోకి వచ్చే కళాశాలలు, హాస్టళ్ల సమాచారాన్ని విభజించి, జిల్లా అధికారులకు కొత్త లాగిన్ ఐడీ ఇవ్వాలి. ఇప్పటికే ఉన్న సమాచారాన్ని భద్రపర్చడంతోపాటు కొత్త జిల్లాల వారీగా విభజించాలి. ఈ ప్రక్రియ అంత సులువుగా జరిగేది కాదని, దీనికి కనిష్టంగా వారం సమయం పడుతుందని అధికారులు చెపుతున్నారు.

మరిన్ని వార్తలు