లారీకి బ్రేక్‌..

30 Mar, 2017 00:33 IST|Sakshi
లారీకి బ్రేక్‌..

- గురువారం ఉదయం 6 గంటల నుంచి లారీలు బంద్‌
- దక్షిణాది రాష్ట్రాల లారీ యజమానుల సంఘం సమ్మె ప్రభావం
- నగరానికి నిలిచిపోనున్న నిత్యావసర వస్తువుల సరఫరా
- పాలు, కూరగాయలు, మంచినీరు, మందులు, పెట్రోల్‌కు మినహాయింపు


సాక్షి, హైదరాబాద్‌: భారీగా పెంచిన బీమా ప్రీమియాన్ని తగ్గించాలనే ప్రధాన డిమాండ్‌తో దక్షిణాది రాష్ట్రాల లారీ యజమానుల సంఘం చేపట్టిన సమ్మెతో లారీలకు బ్రేక్‌ పడింది. సరుకు లోడింగ్, అన్‌లోడింగ్‌ వంటి పనులు బుధవారం అర్ధరాత్రి నుంచి నిలిచిపోయాయి. గురువారం ఉదయం 6 గంటల నుంచి లారీల బంద్‌ చేపట్టనున్నట్లు ఇప్పటికే పలు లారీ యాజమాన్య సంఘాలు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆటో గూడ్స్‌ వాహనాలు మినహా అన్ని రకాల తేలికపాటి, మధ్యతరహా, భారీ సరుకు రవాణా వాహనాలన్నీ బంద్‌లో పాల్గొంటాయని తెలంగాణ లారీ ఓనర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు భాస్కర్‌రెడ్డి తెలిపారు. దీంతో తెలంగాణ అంతటా సుమారు 2.5 లక్షల వాహనాలు, గ్రేటర్‌ హైదరాబాద్‌లో 70 వేల వాహనాలు నిలిచిపోనున్నాయి.

ప్రతి రోజు బియ్యం, పప్పులు, అల్లం, వెల్లుల్లి, ఉల్లి, పసుపు, సిమెంట్, ఐరన్, బొగ్గు వంటి వివిధ రకాల వస్తువులను హైదరాబాద్‌కు తరలించే సుమారు 5 వేల లారీల రాకపోకలు నిలిచిపోనున్నాయి. అత్యవసర వస్తువులైన పాలు, కూరగాయలు, మంచినీరు, మందులు, పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్‌ సరఫరాను మాత్రం ప్రస్తుతం సమ్మె నుంచి మినహాయించారు. వారం రోజుల్లో ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందనా కనిపించకపోతే అత్యవసర సరుకుల రవాణాను సైతం నిలిపివేయనున్నట్లు లారీ సంఘాలు పేర్కొన్నాయి. డీసీఎంలు వంటి వాహనాలు కూడా సమ్మెకు మద్దతిస్తున్న దృష్ట్యా దక్షిణాది రాష్ట్రాల నుంచే కాక రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల మధ్య సరుకు రవాణాపైనా ప్రభావం కనిపించే అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రాలకు వర్తించేలా సింగిల్‌ పర్మిట్‌ విధానాన్ని అమలు చేయాలని, టోల్‌ ట్యాక్స్‌ను తగ్గించాలని, త్రైమాసిక పన్నును హేతుబద్ధీకరించాలని స్థానిక లారీ సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి.

ప్రత్యామ్నాయంపై దృష్టి సారించని సర్కార్‌
లారీల సమ్మె నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోలేదు. రవాణా మంత్రి మహేందర్‌ రెడ్డితో జరిపిన చర్చలు అసంపూర్తిగా ముగిసి సమ్మె అనివార్యమైన దశలో ప్రత్యామ్నాయంపై దృష్టి సారించకపోవడం గమనార్హం. నగరానికి ప్రతిరోజూ సరఫరా అయ్యే సుమారు 500 లారీల బియ్యం, 200 లారీల ఉల్లి, అల్లం వెల్లుల్లి తదితర వస్తువులు నిలిచిపోనున్నాయి. కర్నూలు, నాందేడ్, మధ్యప్రదేశ్‌ తదితర ప్రాంతాల నుంచి నగరానికి ఉల్లి సరఫరా.. ఏపీ నుంచి బియ్యం రవాణా నిలిచిపోనుంది. నగర శివార్ల లోని కెమికల్‌ ఫ్యాక్టరీలకు అవసరమయ్యే 200 లారీల బొగ్గు రవాణాకూ బ్రేక్‌ పడనుంది.

మరిన్ని వార్తలు