కొనే వారేరీ..!

12 Jan, 2015 04:28 IST|Sakshi
కొనే వారేరీ..!

సాక్షి, సిటీబ్యూరో : సంక్రాంతి అందరిలో ఆనందం నింపుతుండగా... రాజధానిలోని కూరగాయల రైతులు, వ్యాపారులకు మాత్రం తీవ్ర నిరాశను మిగిల్చింది. సంక్రాంతి సంబరాలు సొంత ఊళ్లలో జరుపుకొనేందుకు జనం తరలి వెళ్లడంతో నగరం సగం ఖాళీ అయింది. ఆ ప్రభావం తొలుత కూరగాయల వ్యాపారంపై పడింది. గ్రేటర్‌లో 50 శాతం మేర కూరగాయల కొనుగోళ్లు పడిపోవడంతో మార్కెట్లో సరుకు గుట్టలు గుట్టలుగా పేరుకుపోయింది. ప్రస్తుతం టమాటా స్థానికంగా ఇబ్బడి ముబ్బడిగా దిగుబడి వస్తోంది.

దీన్ని ఏరోజుకారోజు అమ్ముకోవాల్సి రావడంతో మార్కెట్‌కు వచ్చిన రైతులు ధర తగ్గించి మరీ తెగనమ్ముకొని వెనుదిరుగుతున్నారు. గత వారం హోల్‌సేల్ మార్కెట్లో కేజీ రూ.15 ధర పలికిన టమాటా  ఆదివారం రూ.6లకు, రూ.35 ఉన్న పచ్చిమిర్చి రూ.20లకు దిగివచ్చింది. ఇదే సరుకు రైతుబజార్‌లో టమాటా రూ.9, రిటైల్‌గా రూ.10లకు, అలాగే మిర్చి రూ.25 ప్రకారం విక్రయించారు. హోల్‌సేల్ మార్కెట్లో సరుకు కొనుగోలు చేసిన వ్యాపారులు వాటిని అమ్ముకోలేక  కళ్లెదుటే వాడిపోతుండటంతో బావురుమంటున్నారు.  

గడచిన 4రోజుల నుంచి వ్యాపారం సగానికి సగం తగ్గడాన్ని గమనించిన పలువురు రిటైల్ వ్యాపారులు పెట్టిన పెట్టుబడిని రాబట్టుకొనేందుకు ధర తగ్గించి అమ్మేందుకు సిద్ధమయ్యారు. అయితే.. కొనేవారే లేకపోవడంతో పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే అవకాశం లేదంటున్నారు. ఇక మిర్చి, వంకాయ, బెండ, దొండ, కాకర, బీర,  చిక్కుడు, గోకర, దోస వంటివి 3-4 రోజులు నిల్వ ఉండే అవకాశం ఉన్నా... కొనేనాథుడు లేక మార్కెట్లలో గుట్టలు గుట్టలుగా దర్శనమిస్తున్నాయి. నగరంలో విద్యా, ఉద్యోగ, వ్యాపార వర్గాల వారు అధికంగా ఊళ్లకు వెళ్లడంతో హోటళ్లు, మెస్‌ల నిర్వాహకులు కూడా కూరగాయల కొనుగోళ్లు తగ్గించినట్లు వ్యాపారులు పేర్కొంటున్నారు.

మరిన్ని వార్తలు