సత్యానికి సంకెళ్లా..!

13 Jun, 2016 01:03 IST|Sakshi
సత్యానికి సంకెళ్లా..!

- సాక్షి ప్రసారాలను నిలిపేయడం దారుణం..
- పాత్రికేయ, విద్యార్థి, ప్రజా, కుల సంఘాలు, రాజకీయపార్టీల ధ్వజం
 
 సాక్షి, నెట్‌వర్క్: రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూ.. ప్రజల పక్షాన పోరాడుతూ.. వాస్తవాలను ప్రజలకు చూపిస్తున్న సాక్షి చానల్ ప్రసారాలను నిలిపేయడంపై వరుసగా నాలుగోరోజు ఆదివారం కూడా రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. తాను చెప్పిందే శాసనం అనేలా నిరంకుశ ధోరణితో వ్యవహరిస్తూ మీడియాకు సంకెళ్లు వేయాలని ప్రయత్నిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు తీరుపై ప్రజాగ్రహం పెల్లుబికింది. సంకెళ్లు తెగే వరకూ పోరాటం కొనసాగిస్తామని నినదించారు. అధికార టీడీపీ మినహా అన్ని రాజకీయ పార్టీలు, కుల, ప్రజా, విద్యార్థి, పాత్రికేయ సంఘాలు ఈ నిరసన కార్యక్రమాల్లో పాల్గొని ప్రభుత్వ చర్యలను ముక్తకంఠంతో ఖండించాయి.

సాక్షి టీవీ ప్రసారాలను ఆపేయడం అమానుషమని ధ్వజమెత్తాయి. వెంటనే ప్రసారాలను పునరుద్ధరించాలని, లేకుంటే ప్రభుత్వ పతనం తప్పదని హెచ్చరించాయి. వైఎస్సార్ జిల్లా పులివెందులలో ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా జర్నలిస్ట్‌లు నల్లబ్యాడ్జీలు ధరించి ర్యాలీ నిర్వహించారు. తిరుపతి ప్రెస్‌క్లబ్ ఆధ్వర్యంలో సుమారు 100 మంది జర్నలిస్టులు నగర వీధుల్లో నిరసన ర్యాలీ నిర్వహించి బస్టాండ్ సెంటర్‌లోని బాపూజీ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. తిరుపతి ఎస్వీయూ విద్యార్థులు కూడా జర్నలిస్టులకు సంఘీభావంగా నిరసన ప్రదర్శన నిర్వహించారు. చిత్తూరులో పార్టీల నేతలు మానవహారం చేపట్టారు. కర్నూలు నగరంలో అన్ని జర్నలిస్టు సంఘాలు సంయుక్తంగా కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించి ప్రభుత్వ తీరును ఎండగట్టాయి. సీఎం చంద్రబాబుకు మంచి బుద్ధిని ప్రసాదించాలని మంత్రాలయంలో శ్రీరాఘవేంద్ర స్వామి విగ్రహానికి నేతలు వినతిపత్రం అందించారు.

 సంకెళ్లు తెగేవరకూ పోరాటం
 సాక్షి మీడియాపై సర్కారు కుట్ర పూరితంగా వ్యవహరిస్తోందని, మీడియాకు సంకెళ్లు తెగే వరకు పోరాటం చేస్తామని విశాఖ జిల్లా గిరిజన ఉద్యోగ, ఉపాధ్యాయ, వర్తక సంఘాలు, ప్రజా సంఘాలు స్పష్టం చేశాయి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడంపై పాడేరులోని గిరిజన్ భవన్‌లో ఆదివారం రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి మాట్లాడుతూ.. ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయకుండా తమ వైఫల్యాలను కప్పి పుచ్చుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందన్నారు.

 సాలూరు ఎమ్మెల్యే అరెస్టు.. విడుదల
 సాక్షి టీవీ ప్రసారాల నిలుపుదలను నిరసిస్తూ ప్రదర్శన చేపడుతున్న విజయనగరం జిల్లా సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్నదొరతో మరో 30 మందిని ఆదివారం అరెస్టు చేసి సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. ఈ సందర్బంగా పట్టణ పోలీసుస్టేషను ఆవరణలో ఎమ్మెల్యే రాజన్నదొర విలేకర్లతో మాట్లాడుతూ నిజాలను నిర్భయంగా ప్రసారం చేస్తూ ప్రజల సమస్యలను, వారి మనోభావాలను, వ్యవస్థలో జరుగుతున్న అవకత వకలను వెలుగులోకి తీసుకువస్తున్న సాక్షి ప్రసారాలను నిలిపివేయడం దారుణమని వ్యాఖ్యానించారు.

 సెట్‌టాప్ బాక్సులు వెనక్కు
 సాక్షి టీవీ ప్రసారాలను ఆపినందుకు నిరసనగా సెట్‌టాప్ బాక్సులను కేబుల్ ఆపరేటర్లకు  ఇచ్చేయాలంటూ వైఎస్సార్‌సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి పిలుపునిచ్చారు. దీంతో జిల్లాలోని తోటపల్లి గూడూరు మండలంలో పలువురు సాక్షి టీవీ అభిమానులు కేబుల్ ఆపరేటర్లు అమర్చిన సెట్‌టాప్ బాక్సులను ఆదివారం  వెనక్కు ఇచ్చేశారు.
 
 ‘మీడియా స్వేచ్ఛను అడ్డుకుంటే ఉద్యమిస్తాం’
 గుంటూరు లీగల్: వాక్, పత్రికా స్వాతంత్య్రాలకు భంగం కలిగిస్తే ఉద్యమిస్తామని ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్(ఐఏఎల్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చలసాని అజయ్‌కుమార్ హెచ్చరించారు. గుంటూరు బ్రాడీపేటలోని సహకార కార్యాలయంలో ఆదివారం ఐఏఎల్ జిల్లా కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సాక్షి చానల్‌పై రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న అప్రజాస్వామిక, అనైతిక చర్యలను ఖండించారు. మీడియా స్వేచ్ఛను హరిస్తే ఊరుకోమన్నారు.

 ‘పునరుద్ధరించకపోతే తెలంగాణలోనూ నిరసనలు’
 ఇబ్రహీంపట్నం రూరల్: ఆంధ్రప్రదేశ్‌లో సాక్షి చానల్ ప్రసారాలను పునరుద్ధరించాలని, లేకుంటే తెలంగాణలో ఆందోళనలు ఉధృతం చేస్తామని వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షురాలు కె.అమృత్‌సాగర్ హెచ్చరించారు. ఆదివారం రంగారెడ్డి జిల్లా బొంగ్లూరు గేట్ వద్ద ఆమె విలేకరులతో మాట్లాడారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని రాజకీయంగా ఎదుర్కోలేకనే చంద్రబాబు ఇలాంటి పనులకు ఒడిగడుతున్నారని ఆరోపించారు. ముద్రగడ పద్మనాభం కాపుల హక్కుల కోసం ఆందోళన చేస్తుంటే అతని కుటుంబ సభ్యులతో పాటు కాపులను అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు.

>
మరిన్ని వార్తలు