గుంతలు.. గతుకులే

2 Sep, 2016 02:35 IST|Sakshi
గుంతలు.. గతుకులే

సాక్షి, హైదరాబాద్: నీటమునిగిన బస్తీలు.. బురదమయంగా కాలనీలు.. గతుకులు పడి రాళ్లు తేలిన రహదారులు.. దెబ్బతిన్న మ్యాన్‌హోళ్లు.. బుధవారం నాటి కుంభవృష్టి నుంచి నగరం ఇంకా తేరుకోలేదని చెప్పడానికి సాక్ష్యాలివన్నీ. గురువారం సైతం కొన్ని ప్రాంతాల్లో వర్షం కురవడంతో బుధవారం నాటి పరిస్థితే కనిపించింది. దీంతో నగరవాసులు బిక్కుబిక్కుమంటూ గడిపారు. అనేక ప్రాంతాల్లో రహదారులు, మ్యాన్‌హోళ్లు దెబ్బతిన్నాయి. బీటీ రహదారులు బాగా దెబ్బతినగా..

ఇటీవలే వేసిన తారు రోడ్లు సైతం వర్షం దెబ్బకు నామరూపాలు లేకుండాపోయాయి. అసలే అధ్వానంగా ఉన్న రహదారులు కాస్తా.. వర్షానికి దారుణంగా దెబ్బతినడంతో నగరవాసులు నరకయాతన అనుభవిస్తున్నారు. నగరంలో బుధ, గురువారాల్లో కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న రహదారుల నష్టం దాదాపు రూ.10 కోట్లు ఉంటుందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. వర్ష బీభత్సానికి అనేక ప్రాంతాల్లో ప్రజలు ఇంకా కోలుకోలేదు. ఇళ్లలోకి నీరుచేరి బియ్యం, ఆహార పదార్థాలు తడిసిపోయి పనికిరాకుండా పోయాయి. కొన్ని ఇళ్లల్లో ఇప్పటికీ నాలుగు అడుగుల మేర వర్షపు నీరు నిలిచిపోయింది.
 
పలు ప్రాంతాల్లో పరిస్థితులు దుర్భరం..
* మూసీ పరీవాహక ప్రాంతంలోని సంజయ్‌నగర్‌లో ఆరు ఇళ్లు నేలమట్టం కావడంతో అందరూ రోడ్డునపడ్డారు.
* నల్లకుంట సత్యానగర్ బస్తీలో ఇళ్లలోకి నీరుచేరి నిత్యావసరాలు పనికిరాకుండా పోయాయి. రెండు రోజులుగా తాగు నీరందక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.
* లోతట్టు ప్రాంతమైన బతుకమ్మ కుంట, గోల్నాక, ప్రేమనగర్‌తో పాటు మూసీ పరీవాహక ప్రాంతాల్లోని చిరు వ్యాపారుల దుకాణాల్లోకి నీరు చేరింది.
* కంటోన్మెంట్ ఐదో వార్డు ఏఓసీ గేటు మహేంద్రహిల్స్ చెక్ పోస్టు సమీపంలోని ప్రధాన రోడ్డు, జూబ్లీ బస్టాండ్ సమీపంలో రోడ్డు కోతకు గురైంది. పెద్ద గుంతలు ఏర్పడటంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.
* బండ్లగూడ ప్రధాన రహదారిపై నిర్మాణంలో ని కల్వర్ట్ వద్ద వర్షపు నీరు పొంగి పొర్లుతోంది. పల్లె చెరువు నుంచి వరద ఉధృతి తీవ్రంగా ఉండటమే దీనికి కారణం. వరద తాకిడికి రోడ్డు గోతులమయమైంది.
* కేపీహెచ్‌బీ కాలనీలోని రోడ్లు గుంతలమయమయ్యాయి. మోకాలు లోతు నీరు నిల్వ ఉండటంతో వాహనదారులు, పాదచారులు గుంతల్లో పడి ప్రమాదాలకు గురవుతున్నారు.
* గండిపేట కట్ట రెండు రోజులుగా చీకట్లో మగ్గుతోంది. దానిపై ఉన్న ట్రాన్స్‌ఫార్మర్ బుధవారం వర్షానికి కాలిపోవటంతో చెరువు కట్ట, లేక్ పోలీస్‌స్టేషన్ అంధకారంలో మునిగాయి.
 
తగ్గని హుస్సేన్ సాగర్ ఉధృతి
హుస్సేన్‌సాగర్‌లో నీటిమట్టం తగ్గకపోవడంతో తూము ద్వారా నీటిని దిగువ ప్రాంతాలకు వదులుతూనే ఉన్నారు. పూర్తిస్థాయి నీటిమట్టం 513.41 మీటర్లు కాగా.. గురువారం 513.42 మీటర్ల మేర నీరు ఉంది. దీంతో 1,500 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు జీహెచ్‌ఎంసీ లేక్స్ డివిజన్ ఎస్‌ఈ శేఖర్‌రెడ్డి తెలిపారు.

మరిన్ని వార్తలు