శాఖల వారీగా కేటాయింపులు (రూ.కోట్లలో)

16 Mar, 2018 03:33 IST|Sakshi

ఆర్టీసీకి మళ్లీ నిరాశే!

బస్సుపాసుల నిధులు, రుణాలకే నిధులు

గ్రాంట్లేమీ ఇవ్వని సర్కారు

మొత్తం కేటాయింపులు రూ.975 కోట్లు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీకి మొండి చేయి చూపించింది. ఆర్టీసీ ఉద్యోగులకు భారీగా ఫిట్‌మెంట్‌ ప్రకటించిన ప్రభుత్వం.. ఆ రూపంలో ఆర్టీసీపై పడే భారాన్ని తగ్గిస్తామని, ప్రభుత్వపరంగా సాయం చేస్తామని అప్పట్లో ప్రకటించింది. కానీ బడ్జెట్‌ కేటాయింపులకు వచ్చేసరికి మాత్రం నామమాత్రంగా ఇస్తూ చేయి దులుపుకుంటోంది. గత బడ్జెట్‌లో ఆర్టీసీకి రూ.వెయ్యి కోట్లు కేటాయించిన సర్కారు.. ఈసారి రూ.975 కోట్లతో సరిపెట్టింది. అసలు గతేడాదికి సంబంధించిన నిధులే ఇంకా రూ.600 కోట్ల వరకు విడుదల కావాల్సి ఉండటం గమనార్హం.

పాస్‌ల సొమ్మూ పద్దులోనే..
వివిధ కేటగిరీ బస్సు పాస్‌లకు సంబంధించిన నిధులను ప్రభుత్వం ఆర్టీసీకి రీయింబర్స్‌ చేయాల్సి ఉంటుంది. ఇది సంవత్సరానికి రూ.520 కోట్ల వరకు ఉంటుంది. ప్రభుత్వం ఈ మేరకు నిధులను పద్దులో చూపింది. ఇక కొత్త బస్సుల కొనుగోలుకు రుణంగా రూ.140 కోట్లు, ప్రభుత్వ పూచీకత్తు అప్పులు తీర్చేందుకు రుణంగా మరో రూ.315 కోట్లు కేటాయించింది. ఈ రెండూ కూడా రుణాలే కాబట్టి.. ఆర్టీసీ వాటిని తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. ప్రభుత్వం గ్రాంటు కింద నిధులిస్తుందని భావించినా.. ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఆర్టీసీ నిరుత్సాహానికి గురైంది.

ఆలయానికి  కొత్త రూపు
♦ యాదాద్రికి రూ.250 కోట్లు కేటాయింపు
♦ భద్రాచలం, వేములవాడకు 100 కోట్ల చొప్పున
♦ బాసర, ధర్మపురికి 50 కోట్ల చొప్పున నిధులు

సాక్షి, హైదరాబాద్‌: యాదగిరిగుట్ట, రాష్ట్రంలోని మిగతా ప్రధాన ఆలయాలనూ అభివృద్ధి చేయనున్నట్టు ప్రభుత్వం బడ్జెట్‌లో ప్రకటించింది. భద్రాచలం, వేములవాడ, బాసర, ధర్మపురి ఆలయాలకు నిధులు కేటాయించింది. భద్రాచలం అభివృద్ధికి రూ.100 కోట్లను కేటాయించారు. వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి రూ.100 కోట్లు, బాసర, ధర్మపురి దేవాలయాలకు రూ.50 కోట్ల చొప్పున కేటాయించారు. యాదాద్రికి బడ్జెట్‌లో రూ.250 కోట్లు ప్రతిపాదించారు.

దేవాదాయశాఖపై కినుక!
దేవాదాయ శాఖకు మరోసారి ప్రభుత్వం మొండి చెయ్యి చూపింది. ధూపదీప నైవేద్యాలు, పురాతన దేవాలయాల జీర్ణోద్ధరణ, దళిత వాడల్లో రామాలయాల నిర్మాణం తదితరాలకు సంబంధించి దేవాదాయశాఖ సర్వశ్రేయోనిధికి గతేడాది తరహాలోనే రూ.50 కోట్లతో సరిపెట్టింది. ఇక బ్రాహ్మణ కార్పొరేషన్‌కు గతేడాది లాగానే రూ.100 కోట్లు ఇచ్చారు. దేవాలయ ఉద్యోగులు, అర్చకుల వేతన సవరణ నేపథ్యంలో జీతాలు పెరిగినందున.. దేవాలయాల నుంచి చెల్లించగా మిగతా మొత్తాన్ని ప్రభుత్వం గ్రాంటుగా ఇవ్వాల్సి ఉంది. దీనికి గత బడ్జెట్‌లో రూ.50 కోట్లు ఇవ్వగా.. ఈసారి దాన్ని రూ.72 కోట్లకు పెంచారు.

>
మరిన్ని వార్తలు