కొత్తగా జిల్లా అభివృద్ధి కార్డులు

3 Jan, 2016 03:52 IST|Sakshi

- నూతన పంథాలో బడ్జెట్ తయారీ: సీఎం
 
సాక్షి, హైదరాబాద్:
బడ్జెట్ తయారీలో కొత్త పంథాను అనుసరించాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. జిల్లాల వారీగా బడ్జెట్ అంచనాలు, కేటాయింపులతో ‘జిల్లా అభివృద్ధి కార్డులు’ రూపొందించాలని తీర్మానించింది. ఆర్థికశాఖ చుట్టూ ఇతర శాఖలు తిరగకుండా ఏ విభాగానికి ఎంత డబ్బు వస్తుందో, నెలనెలా ఎంత కేటాయింపులు ఉంటాయో ముందుగానే వెల్లడించనుంది.  కేసీఆర్ అధ్యక్షతన కేబినెట్ సమావేశంలో 3 గంటల పాటు ఇదే అంశంపై చర్చ జరిగింది. పన్నులు, పన్నేతర ఆదాయం వల్ల రాష్ట్రానికి వచ్చే ఆదాయం ఈ ఏడాది 15% పెరిగిందని సీఎం ప్రకటించారు.

ఈ పెరిగిన ఆదాయం మేరకు ప్రణాళికా వ్యయాన్ని పెంచాలని.. అంతమేరకు ప్రాధాన్యతలను ఖరారు చేసుకోవాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఏ శాఖకు ఎంత కేటాయింపులుంటాయి, ఏ జిల్లాలో ఏమేం పనులు చేపడతారనే అయోమయానికి తావు లేకుండా కొత్తగా బడ్జెట్ కసరత్తు చేస్తున్నామని తెలిపారు. ఒకట్రెండు రోజుల్లోనే ఏ శాఖకు ఎన్ని నిధులు వస్తాయో ఆర్థిక శాఖ సమాచారం అందిస్తుందని... దాని ఆధారంగా ఏ జిల్లాలో ఎంత ఖర్చు చేయాలి, ఏమేం పనులు చేపట్టాలనేదానిపై శాఖలు ప్రతిపాదనలు సిద్ధం చేస్తాయని వెల్లడించారు. అన్ని శాఖల ప్రతిపాదనలతో ‘జిల్లా అభివృద్ధి కార్డులు’ తయారు చేస్తామన్నారు.

‘‘40 ఏళ్లుగా ప్రజా జీవితంలో ఉన్నాను. ఈ కొత్త బడ్జెట్ విధానం రాష్ట్ర అభివృద్ధికి సహకరిస్తుందిలక్ష్యాలు నెరవేరేందుకు దోహదపడుతుంది..’’ అని   పేర్కొన్నారు. నీటి పారుదల శాఖకు రూ.25 వేల కోట్లు కేటాయిస్తే... ప్రతి నెలా ఇచ్చే 2,083 కోట్లను ఆర్థిక శాఖ కచ్చితంగా విడుదల చేస్తుందన్నారు. మిగతా అన్ని శాఖలకు ఇదే తీరుగా నిర్ణీత కోటా ఇస్తామన్నారు. రైతులకు ఒకేసారి రుణమాఫీ చేయడం సాధ్యం కాదన్నారు. ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితి పెరగకపోవడం, భూముల అమ్మ కం ద్వారా ఆదాయం రాకపోవడంతో సాధ్యం కాలేదన్నారు.

గులాబీ జెండా ఎగరేస్తాం: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేయడం ఖాయమని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు.  గుజరాతీ, మరాఠీ, రాజస్థానీ, పంజాబీలతో పాటు ఏపీకి చెందిన వారు కూడా హైదరాబాద్‌లో స్వేచ్ఛగా జీవించే వాతావరణం కల్పించామన్నారు. ‘‘టీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో వేరే రాష్ట్రం వారిపై ఒక్క సంఘటనైనా జరిగిందా? కొందరు అభూత కల్పనలు, అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారు. ఇక్కడ నివసించే వారంతా హైదరాబాదీలే, తెలంగాణ బిడ్డలే. అందరినీ రక్షించే బాధ్యత మాదే. ఓటు ఎవరికి వేయాలనేది ప్రజల విజ్ఞతకే వదిలేస్తున్నా..’’ అని  పేర్కొన్నారు.  

రియల్ బూమ్‌కు రాయితీలు
రియల్ ఎస్టేట్ వ్యాపార అభివృద్ధికి సంబంధించి తెలంగాణ రియల్ ఎస్టేట్ డెవలప్‌మెంట్ అసోసియేషన్  80 విజ్ఞప్తులు చేసిందని, పరిశీలించిన కేబినెట్ 23 అంశాలకు ఆమోదం తెలిపిందని సీఎం చెప్పారు. వీటిని ఆదివారం (నేడు) వెల్లడిస్తామన్నారు. నాలా పన్ను తగ్గింపు, స్టాంపు డ్యూటీ రాయితీ, డెవలప్‌మెంట్ అగ్రిమెంట్ల చార్జీల సీలింగ్ తదితర అంశాలు అందులో ఉన్నట్లు తెలిసింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో ‘విద్యుత్ బకాయిల మాఫీ’  నిర్ణయాన్ని ఆదివారం ప్రకటిస్తామని   తెలిపారు.

మరిన్ని వార్తలు