బాబువన్నీ ‘బాటా’ లెక్కలు: బుగ్గన

31 Jan, 2017 02:36 IST|Sakshi
బాబువన్నీ ‘బాటా’ లెక్కలు: బుగ్గన

సాక్షి, హైదరాబాద్‌: ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పేవి పెట్టుబడి లెక్కలా? లేక ‘బాటా’ కంపెనీ లెక్కలా? అని పీఏసీ చైర్మన్‌ బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ధ్వజమెత్తారు. పరిపాలనలో అట్టర్‌ ఫ్లాప్‌ అయిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టేందుకు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయని దొంగ లెక్కలు చెబుతున్నారని మండిపడ్డారు. రెండేళ్లలో రూ.15 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయని చెబుతున్నారని, అవి ఎక్కడెక్కడి నుంచి వచ్చాయో బయట పెట్టాలని డిమాండ్‌ చేశారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

గతేడాది రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులపై ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు వెల్లడించినవన్నీ అసత్యాలేనని బుగ్గన చెప్పారు. ఇక గణతంత్ర దినోత్సవం రోజు రాత్రి చంద్రబాబు మాట్లాడుతూ.. 2015–16లో భాగస్వామ్య సదస్సు ద్వారా 328 సంస్థలతో 4.62 లక్షల కోట్ల విలువైన ఎంవోయూలు చేసుకున్నామని, తద్వారా 8.72 లక్షల మందికి ఉపాధి వస్తున్నట్లుగా తెలిపారన్నారు. వాటిల్లో రూ 1.93 లక్షల కోట్ల పెట్టుబడి ఏపీకి వచ్చేసినట్లు 2.27 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చేసినట్లు చంద్రబాబు ప్రకటించారని బుగ్గన గుర్తు చేశారు. ఇక భాగస్వామ్య సదస్సుకు ముందు చంద్రబాబు మాట్లాడుతూ.. 2016 ఏప్రిల్‌ నుంచి డిసెంబర్‌ 31 వరకూ రూ. 5.3 లక్షల కోట్ల మేరకు ఎంవోయూలు వచ్చేసినట్లు 10 లక్షల మందికి ఉపాధి వస్తున్నట్లు, 629 సంస్థలు యూనిట్ల స్థాపనకు సిద్ధమైపోయినట్లు, 2.6 లక్షల కోట్ల పెట్టుబడితో పరిశ్రమలు స్థాపించినట్లు 3.61 లక్షల మందికి ఉపాధి లభించినట్లు  చెప్పడం ఆశ్చర్యంగా ఉందని బుగ్గన అన్నారు.

13 సార్లు దావోస్‌ వెళ్లానని చెప్పుకున్న చంద్రబాబు ఎన్ని పరిశ్రమలు తేగలిగారని ప్రశ్నించారు. తమిళనాడు మాజీ సీఎంలు జయలలిత, కరుణానిధి దావోస్‌కు వెళ్లకుండానే పరిశ్రమలు భారీగా తేగలిగారన్నారు. పరిశ్రమలకు స్వర్ణయుగం అంటే వైఎస్‌ రాజశేఖరరెడ్డి పాలనేనని.. ఆయన హయాంలో 2004–09 మధ్య పరిశ్రమల అభివృద్ధి 11 శాతంగా ఉందన్నారు. ఆయన ఏనాడూ దావోస్‌కు వెళ్లలేదన్నారు.

మరిన్ని వార్తలు