పరిశ్రమలకు బంపర్ ఆఫర్

10 Jul, 2016 06:51 IST|Sakshi
పరిశ్రమలకు బంపర్ ఆఫర్

- కొత్తగా ఉద్యోగులను చేర్చుకుంటే పీఎఫ్ తామే చెల్లిస్తామన్న కేంద్ర కార్మిక శాఖ
- రూ.15 వేల లోపు వేతనం వారికి యజమాని వాటా చెల్లించేందుకు సంసిద్ధత
- 8.33 శాతం కేంద్రం, 3.67 శాతం యజమాని చెల్లించేలా మార్గదర్శకాలు వెల్లడి
- సంఘటిత రంగంలోని సంస్థలకే అవకాశం.. మూడేళ్ల పాటు అమలులో కొత్త విధానం
- ఈ ఏడాది పీఎఫ్ చెల్లింపులకు రూ.1,000 కోట్లు విడుదల చేసిన ఈపీఎఫ్‌వో

 
 సాక్షి, హైదరాబాద్: ఇప్పటి వరకూ పరిశ్రమలు నెలకొల్పడానికి అనేక రాయితీలు ప్రకటిస్తున్న కేంద్ర ప్రభుత్వం తాజాగా ఉద్యోగావకాశాలు కల్పించడానికి కొత్త ప్రయత్నం చేస్తోంది. ఇందుకోసం పరిశ్రమలకు ఓ బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. ప్రస్తుతం మనుగడలో ఉన్న కంపెనీలు లేదా కొత్తగా ఏర్పాటు చేసే కంపెనీలు ఎంత మందికి కొత్తగా ఉద్యోగావకాశాలు కల్పిస్తే వారందరి భవిష్యనిధి(పీఎఫ్) చెల్లించేందుకు కేంద్ర కార్మిక శాఖ ముందుకొచ్చింది. ఈ మేరకు కొత్తగా కొలువులోకి తీసుకున్న కార్మికునికి రూ.15 వేల లోపు వేతనం ఉన్నట్లయితే వారందరికీ సంస్థ తరఫున చెల్లించే 12 శాతం పీఎఫ్‌లో కేంద్రం 8.33 శాతం చెల్లించేందుకు సంసిద్ధత వ్యక్తం చేస్తూ మార్గదర్శకాలు విడుదల చేసింది.
 
 మిగతా 3.67 శాతం వాటాను యజమాని చెల్లించేలా కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. అయితే సంఘటిత రంగంలో ఉద్యోగావకాశాలు కల్పించే సంస్థలకు మాత్రమే ఈ కొత్త అవకాశం కల్పిస్తున్నట్లు పేర్కొంది. ఈ విధానాన్ని మూడేళ్ల పాటు కొనసాగించనున్నట్లు కార్మిక శాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు మొదటి ఏడాదికిగానూ ఈపీఎఫ్‌వో నుంచి దాదాపు రూ.1,000 కోట్లు విడుదల చేసింది.
 
 ఉపాధి అవకాశాలే లక్ష్యంగా..
 దేశవ్యాప్తంగా యువతకు సరైన ఉద్యోగావకాశాలు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నట్లు కేంద్రం నిర్వహించిన ప్రత్యేక సర్వేలో వెల్లడైంది. ఏటా వ్యవసాయ రంగంలో అవకాశాలు తగ్గిపోతుండటంతో అదే స్థాయిలో పరిశ్రమల్లో అవకాశాలు లభించడం లేదని గుర్తించింది. ఈ మేరకు పరిశ్రమల స్థాపనకు ఎన్నో రాయితీలు ప్రకటిస్తున్నా ఆశించిన స్థాయిలో ఉద్యోగావకాశాలు లభించడంలేదని భావించింది. నిరుద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించడానికి ‘ప్రధానమంత్రి ప్రోత్సాహ రోజ్‌గార్ యోజన’ ద్వారా సంస్థలో కార్మికులకు యాజమాన్యం వాటాగా చెల్లించే పీఎఫ్‌ను చెల్లించాలని కేంద్రం నిర్ణయించింది.
 
 తద్వారా పరిశ్రమల యాజమాన్యాలు పెద్ద సంఖ్యలో ఉద్యోగావకాశాలు కల్పించే అవకాశం ఉందని యోచిస్తోంది. ఎంత మందిని కొత్తగా చేర్చుకున్నా వారందరికీ మూడేళ్ల పాటు పీఎఫ్‌ను భరించనున్నట్లు ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది. రూ.15 వేల వేతనం పొందే వారికి ఈఎస్‌ఐ అందజేయాల్సి ఉంటుంది. ప్రధానమంత్రి ప్రోత్సాహ రోజ్‌గార్ యోజన వల్ల కొత్తగా ఉద్యోగంలో చేరే వారికి పీఎఫ్‌తో పాటు ఈఎస్‌ఐ సౌకర్యం కూడా లభించనుంది.
 
 కొత్త పథకంపై విస్తృత ప్రచారం
 ఈ కొత్త పథకాన్ని విస్తృతంగా ప్రచారం చేయాలని కార్మిక శాఖ యోచిస్తోంది.  కొత్తగా ఉద్యోగావకాశాలు కల్పించే కంపెనీలకు అవసరమైతే బ్యాంకుల ద్వారా రుణాలు కూడా ఇప్పించాలని భావిస్తోంది.  ఉద్యోగాలు పొందిన వారికి మొదట్లోనే యూనివర్సల్ అకౌంట్ నంబర్  కేటాయించాలని కార్మిక శాఖ నిర్ణయించింది. కార్మికులు వేరే సంస్థకు మారినా పీఎఫ్ ఖాతా అదే కొనసాగేలా చర్యలు చేపట్టింది.

Read latest Hyderabad News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా