పప్పు...నిప్పు!

13 Oct, 2015 00:00 IST|Sakshi
పప్పు...నిప్పు!

భగ్గుమంటున్న పప్పుల ధరలు
మండుతున్న వంటనూనెలు
పండుగ గిరాకీపై వ్యాపారుల కన్ను
కృత్రిమ కొరతకు పక్కాగా ఎత్తులు


సిటీబ్యూరో: మహా నగరంలో నిత్యావసరాల ధరలు నింగినంటుతున్నాయి. దసరా పండుగ గిరాకీని సొమ్ము చేసుకొనేందుకు వ్యాపారులు పక్కాగా పావులు కదిపారు. కొన్ని రకాల నిత్యావసర వస్తువులను గోదాముల్లో దాచేసి... మార్కెట్లో కృత్రిమ కొరతను సృష్టించడం ద్వారా ధరలు పెంచేందుకు ఎత్తులు వేశారు. దీనికి రిటైల్ వ్యాపారుల అత్యాశ తోడవ్వడంతో ధరలు అదుపు తప్పాయి. దీంతో సామాన్య, మధ్య తరగతి కుటుంబాల బతుకులు భారంగా మారాయి.

ఏం తినాలో...
దసరా పండుగకు పిండివంటలు కాదు కదా... కనీసం పప్పన్నం తినే అదృష్టం కూడా లేద ంటూ నిరుపేదలు పెదవి  విరుస్తున్నారు. గడచిన 10 రోజులుగా మినపపప్పు, కందిపప్పు ధరలు పోటీపడి పెరుగుతుండడం ప్రజలను కలవర పెడుతోంది. సోమవారం ఉదయం కేజీ రూ.180 ఉన్న కందిపప్పు ధర సాయంత్రానికి రూ.185కు ఎగబాకింది. నగర మార్కెట్లో కందిపప్పుకు కొరత ఎదురైందని చెబుతూ రిటైల్ వ్యాపారులు ఇష్టారీతిన ధరలు పెంచేస్తున్నారు. కేవలం 15 రోజుల వ్యవధిలోనే వివిధ రకాల పప్పులు, వంట నూనెలు, పంచదార, బెల్లం, బియ్యం ధరలు కేజీకి రూ.8-30 వరకు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం మార్కెట్లో రూ.46 వెచ్చించనిదే కిలో ఫైన్ రకం బియ్యం లభించట్లేదు. గత నెలలో సోనా మసూరి బియ్యం క్వింటాల్ ధర రూ.3,800 ఉండగా... ఇప్పుడు రూ.4,500కు చేరింది. కొందరు రిటైల్ వ్యాపారులు బెస్ట్ క్వాలిటీ పేరుతో ఇదే బియ్యాన్ని క్వింటాల్‌కు రూ.4,600 వసూలు చేస్తున్నారు.

 నూనెలూ అంతే...
 ఇక వంట నూనెల ధరలైతే మంట పుట్టిస్తున్నాయి. అన్ని రకాల నూనెల ధరలు రూ.5-8 వరకు పెరిగాయి. హోల్‌సేల్ మార్కెట్లో పల్లీ నూనె ధర లీటర్ రూ.100కు చేరింది. అదే రిటైల్ మార్కెట్లో లీటర్‌కు రూ.105-107 వసూలు చేస్తున్నారు. పామాయిల్ ధర కూడా అందుబాటులో లేకపోవడంతో సామాన్యులు విలవిల్లాడిపోతున్నారు. రాష్ట్రంలో ఆయిల్ పంట, పప్పుధాన్యాల సాగు విస్తీర్ణం క్రమంగా తగ్గిపోతుండటం కూడా ఈ పరిస్థితి కారణంగా కనిపిపిస్తోంది. కొన్నిరకాల సరుకులను ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకొంటుండటంతో వ్యాపారులు ధరలు పెంచి సొమ్ము చేసుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో నెల బడ్జెట్‌లో అధికభాగం బియ్యం, వంటనూనె, పప్పులకే కేటాయించాల్సి వస్తోందని చిరుద్యోగులు గగ్గోలు పెడుతున్నారు.  
 
గోదాముల్లో సరుకు

పండుగ గిరాకీని సొమ్ము చేసుకునేందుకు కొందరు వ్యాపారులు వేసిన ఎత్తులు వినియోగదారుల జేబుకు కన్నం పెడుతున్నాయి. వంట నూనె, వివిధ రకాల పప్పుల దిగుమతికి రవాణా ఖర్చులు విపరీతంగా పెరిగాయని చెబుతూ ధరలకు పురిపెట్టారు. పప్పులు, వంటనూనె, కొబ్బరి, మసాలాలు వంటివాటిని గోదాములకు తరలించి మార్కెట్లో కృత్రిమ కొరత సృష్టించడం ద్వారా ధర పెరుగుదలకు బాటలు వేశారు. నగరంలోని మెహబూబ్ మేన్షన్, సిద్ధిఅంబర్ బజార్, బేగం బజార్, ముక్తియార్‌గంజి వంటి హోల్‌సేల్ మార్కెట్లలో వ్యాపారులు నిత్యావసర వస్తువులను గోదాములలో దాచి పెట్టినట్లు సోమవారం గుప్పుమంది. వీటిని పండుగకు మూడు నాలుగు రోజుల ముందు మార్కెట్లోకి విడుదల చేసి లాభాలు ఆర్జించేందుకు ఎత్తులు వేశారని తెలుస్తోంది. అక్రమ వ్యాపారులను కట్టడి చేయడంలో ప్రభుత్వ వైఫల్యం వల్ల సామాన్య, మధ్యతరగతి ప్రజలు నిలువు దోపిడీకి గురవుతున్నారు.
 

మరిన్ని వార్తలు