రోహిత్ ఘటనపై బస్సుయాత్ర ప్రారంభం

12 Feb, 2016 02:19 IST|Sakshi

హైదరాబాద్: రోహిత్ ఆత్మహత్య ఘటనపై కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా హెచ్‌సీయూ జేఏసీ ఆధ్వర్యంలో తెలంగాణ విశ్వవిద్యాలయాల బస్సుయాత్ర ప్రారంభమైంది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలోని షాపింగ్ కాంప్లెక్స్‌లో ఈ యాత్రను ప్రముఖ సామాజికవేత్త ప్రొఫెసర్ కంచె ఐలయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కులవివక్షకు వ్యతిరేకంగా పార్లమెంట్‌లో రోహిత్ చట్టం తీసుకువచ్చేందుకు విద్యార్థులు పోరాడాలన్నారు. ఈ నెల 16 వరకు కొనసాగే ఈ బస్సు యాత్రలో హెచ్‌సీయూ, ఓయూ, పలు తెలంగాణ వర్సిటీల విద్యార్థులు భాగస్వాములవుతారని చెప్పారు. అనంతరం హెచ్‌సీయూ నుంచి బస్సుయాత్ర నేరుగా ఉర్దూ  వర్సిటీకి చేరుకుంది.
 
 అటు ఏపీలో శుక్రవారం నుంచి జేఏసీ బస్సుయాత్ర ప్రారంభమవనుంది. కాగా, మొదటిరోజు హెచ్‌సీయూ నుంచి మొదలైన బస్సుయాత్ర ఉర్దూ వర్సిటీ, వికారాబాద్‌మీదుగా పాలమూరు వర్సిటీ వరకు కొనసాగింది. శుక్రవారం మహబూబ్‌నగర్, వనపర్తి, నాగర్‌కర్నూల్, కల్వకుర్తి మీదుగా నల్లగొండలోని మహాత్మాగాంధీ వర్సిటీ వరకు యాత్ర కొనసాగుతుంది. 13న కాకతీయ వర్సిటీకి, 14న ఆదిలాబాద్‌కు, 15న నిజామాబాద్‌లోని తెలంగాణ యూనివర్సిటీ, హైదరాబాద్‌లోని జేఎన్‌టీయూకు బస్సుయాత్ర చేరుకుంటుంది. 16న జేఎన్‌టీయూతోపాటు ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ వర్సిటీ, పొట్టి శ్రీరాములు, నిజాం కాలేజి, కోఠి ఉమెన్స్ కాలేజి, ఇఫ్లూ మీదుగా ఓయూకి చేరుకుంటుంది. అదేరోజు సాయంత్రం 5 గంటలకు ఓయూలో బస్సుయాత్ర ముగింపు సభ నిర్వహిస్తారు.

మరిన్ని వార్తలు