ఎల్బీ నగర్ టు పనామా.. బస్సులే బస్సులు!

12 Jan, 2016 14:45 IST|Sakshi
ఎల్బీ నగర్ టు పనామా.. బస్సులే బస్సులు!

సంక్రాంతి సీజన్ మొదలైపోయింది. ఊళ్లకు వెళ్లేవాళ్లతో సిటీ చౌరస్తాలు కిటకిటలాడుతున్నాయి. ప్రధానంగా ఎల్బీనగర్ చౌరస్తా రాత్రిపూట చూస్తుంటే అక్కడేదో భారీ జాతర జరుగుతున్నట్లు కనిపిస్తోంది. అక్కడి నుంచి పనామా గోడౌన్స్ వరకు ఉన్న దారి మొత్తం బస్సులు, వాటి కోసం వేచి చూసే ప్రయాణికులతో నిండిపోతోంది. మంగళవారం నుంచి పలు కాలేజీలకు సెలవులు ఇవ్వడంతో అనుకోకుండా ప్రయాణాలు చేసేవాళ్లు సోమవారం రాత్రి మూట ముల్లె సర్దుకుని బస్సుల కోసం బయల్దేరారు. నిజానికి కార్పొరేట్ కాలేజీల యాజమాన్యాలు సెలవులు ఎప్పటినుంచి ఇస్తామన్న విషయాన్ని ముందు ప్రకటించకుండా.. చివరి నిమిషంలో విద్యార్థులకు చెప్పడంతో.. వాళ్ల తల్లిదండ్రులు ముందు నుంచి పండగకు ఊళ్లు వెళ్లడానికి ప్లాన్ చేసుకునే వీలు లేకుండా పోయింది.

దాంతో.. అప్పటికప్పుడు అన్నీ సర్దుకుని ఊళ్లు వెళ్లేందుకు వచ్చినవాళ్లతో ఎల్బీనగర్ పరిసరాలు కిక్కిరిసిపోయాయి. ఆర్టీసీ, ప్రైవేటు బస్సులు అక్కడి నుంచి దాదాపు రెండు కిలోమీటర్ల దూరం ఉన్న పనామా గోడౌన్స్ వరకు నిలిచి ఉంటున్నాయి. అటువైపు వెళ్లాల్సిన సిటీబస్సులు మిగిలిన కొద్దిపాటి రోడ్డులోనే వెళ్లాల్సి రావడంతో.. అక్కడంతా ట్రాఫిక్ జాం అవుతోంది. ఆర్టీసీ కంట్రోలర్లు ఒకవైపు వెళ్లాల్సిన బస్సులన్నింటినీ ఒకో ప్రాంతంలో పార్కింగ్ చేయిస్తూ, ప్రయాణికులకు కూడా వాటి వివరాలు చెబుతూ హడావుడిగా కనిపిస్తున్నారు.

ప్రయాణికులు మాత్రం సరిపడగా బస్సులు లేవని, ఉన్నవి కూడా అన్నీ స్పెషల్ బస్సులే కావడంతో చార్జీలు ఒకటిన్నర రెట్లు ఎక్కువగా ఉంటున్నాయని వాపోతున్నారు. ప్రైవేటు బస్సుల్లో అయితే ఇక చెప్పనక్కర్లేదు. సాధారణంగా హైదరాబాద్ నుంచి ఏలూరుకు 500-600 వరకు మామూలు బస్సు చార్జి ఉండేది. అలాంటిది ఇప్పుడు కనీసం వెయ్యి రూపాయల నుంచి టికెట్లు మొదలవుతున్నాయి. అయినా సరే, పెద్దపండగ వస్తోంది కాబట్టి సొంతూళ్లకు వెళ్లాలని అంటున్నారు.

మరిన్ని వార్తలు