వాణిజ్యానికి పేరు.. పెద్దబొంకూరు!

31 Jan, 2018 01:20 IST|Sakshi
తవ్వకాలు జరిపే ప్రాంతాన్ని పరిశీలిస్తున్న హెరిటేజ్‌ తెలంగాణ సంచాలకులు విశాలాచ్చి. నిపుణులు రంగాచార్యులు, పద్మనాభ, భానుమూర్తి తదితరులు

      2 వేల ఏళ్ల కిందటే విదేశాలతో వ్యాపార సంబంధాలు

     తొలి శాతవాహన కాలం నాటి అద్భుత ఆవాస ప్రాంతం

     పెద్దపల్లి జిల్లా పెద్దబొంకూరులో తవ్వకాలకు కేంద్రం అనుమతి

     త్వరలో పనులు ప్రారంభించనున్న హెరిటేజ్‌ తెలంగాణ

సాక్షి, హైదరాబాద్‌: మట్టిని ముట్టుకుంటే నాణేలు తగులుతున్నాయి. ఇప్పటివరకు 30 వేలకు పైచిలుకు లభించాయి. ఏంటా అని తవ్వి చూస్తే 20 మీటర్ల పొడవున్న ఓ భారీ భవంతి ఆనవాళ్లు తేలాయి.. మరికాస్త శోధిస్తే కొన్ని గదుల రూపురేఖలూ కనిపించాయి. ఆ పక్కన మంచినీటి బావులు.. వాటికి నాణ్యమైన ఇటుకల అమరిక.. అక్కడి నుంచి నీటిని తరలించే కాలువలు, భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ.. వెరసి అదో పట్టణమే. నాణేలు, నిర్మాణాల సరళిని పరిశీలిస్తే అది క్రీ.పూ. 2వ శతాబ్దం నుంచి క్రీ.శ. 2వ శతాబ్దం మధ్య కాలానివని తేలింది. తొలి శాతవాహన కాలానికి చెందినదని ప్రాథమికంగా రూఢీ అయింది.

శాతవాహనుల జాడలు
పెద్దపల్లి జిల్లా కేంద్రానికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న చారిత్రక ప్రాంతం పెద్దబొంకూరు. శాతవాహన చరిత్రకు కీలక ఆధారాలు చెప్పే నేల. శాతవాహన కాలంలో అతిపెద్ద వాణిజ్య కేంద్రంగా వెలుగొందింది. అందుకే అక్కడ రోమ్‌ వంటి విదేశీ ప్రాంతాల నాణేలు లభించాయి. రోమన్‌ ప్రాంతాలతో శాతవాహనులు పెద్ద ఎత్తున వాణిజ్యాన్ని నిర్వహించినట్టు చరిత్ర చెబుతోంది. ఆ వాణిజ్యానికి ప్రధాన కేంద్రమే ఇదని కొందరు చరిత్రకారుల అభిప్రాయం. శాతవాహన సామ్రాజ్యంలో మింట్‌ (నాణేల తయారీ కర్మాగారం)లు ఉండేవి. పూర్వపు మెదక్‌ జిల్లా కొండాపూర్‌ ప్రధాన మింట్‌ కాగా, అనుబంధంగా మరికొన్ని ఉండేవి. అందులో ఇది కూడా ఓ మింట్‌ అయి ఉండొచ్చని కొందరు నిపుణులు అంటున్నారు. 1950– 1965 మధ్య కాలంలో ఇక్కడ తొలిసారి తవ్వకాలు జరిపారు. అప్పుడు ప్రాథమికంగా కొన్నిచోట్ల పురావస్తు శాఖ తవ్వకాలు జరిపి గొప్ప చారిత్రక ఆనవాళ్లను గుర్తించింది. కానీ అది ముందుకు సాగలేదు. 50 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఆ ప్రాంతం చారిత్రక నేపథ్యమేంటో తేల్చబోతున్నారు. 

అప్పట్లోనే భూగర్భ డ్రైనేజీ
2 వేల ఏళ్ల క్రితమే అక్కడ భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ ఉన్నట్టు తేలింది. ఆవాసాల ముందు నుంచి భూగర్భం గుండా మురుగు నీటి పారుదల వ్యవస్థ ఏర్పాటై ఉంది. ప్రాకృత భాష, బ్రాహ్మి లిపి వాడుకలో ఉన్నట్టు తేలింది. ఇనుము, వెండి, రాగి లోహాలను వస్తువుల తయారీకి వినియోగించారు. విరివిగా సీసం వస్తువులు వాడారు. రోమ్‌ వంటి ప్రాంతాల నుంచి సీసం దిగుమతి చేసుకున్నారు. భారీ మట్టి పాత్రల్లో ముడి సీసం చుట్టలు లభించాయి.

శాతవాహన చరిత్రకు ఇదో మలుపు
‘తెలంగాణ చరిత్రలో శాతవాహన పాలన కీలకం. అంతకు పూర్వం వివరాలు అస్పష్టం. వాటికి సమాధానం చెప్పేవి పెద్దబొంకూరు వంటి ప్రాంతాలే. గతంలో జరిపిన తవ్వకాల్లో వెలుగుచూసిన కట్టడాల పరిరక్షణకు చర్యలు తీసుకుంటాం. తర్వాత కొత్త ప్రాంతాల్లో తవ్వకాలు జరిపి భూమి పొరల్లో దాగున్న చరిత్రను వెలుగులోకి తెస్తాం’     
–విశాలాచ్చి, హెరిటేజ్‌ తెలంగాణ సంచాలకులు

వెలుగు చూసిన కొన్ని నాణేలు 
వెలుగు చూసిన కొన్ని నాణేలు

మరిన్ని వార్తలు