హెచ్సీయూ చాన్సలర్గా రంగరాజన్

8 Apr, 2015 17:03 IST|Sakshi
హెచ్సీయూ చాన్సలర్గా రంగరాజన్

ప్రముఖ ఆర్థికవేత్త, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ గవర్నర్ డాక్టర్ సీ రంగరాజన్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ (సెంట్రల్) చాన్సలర్గా నియమితులయ్యారు. విజటర్ హోదాలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ.. హెచ్సీయూ 11వ చాన్సలర్గా రంగరాజన్ పేరును ఖరారుచేసి ఆ మేరకు ఉత్తర్వులు జారీచేశారు. మూడేళ్లపాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు.

గతంలో రిజర్వు బ్యాంకు గవర్నర్, పార్లమెంటు సభ్యుడుగానూ పనిచేసిన రంగరాజన్ తమిళనాడుకు చెందినవారు. తిరుచిరాపల్లి నేషనల్ కాలేజీలో చదువుకున్న ఆయన లయోలా కాలేజ్ (మద్రాస్ యూనివర్సిటీ) నుంచి కామర్స్లో గ్రాడ్యుయేషన్ పూర్తిచేశారు. యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా నుంచి ఎకనామిక్స్లో పీహెచ్డీ పట్టాపుచ్చుకున్నారు. అనంతరం చాలా ఏళ్లపాటు అధ్యాపక వృత్తిలో కొనసాగారు. యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియాతోపాటు ఐఐఎం- అహ్మదాబాద్లో పాఠాలు చెప్పారు. మైక్రో ఎకనామిక్స్పై ఆయన రాసిన పుస్తకాలే.. ప్రస్తుతం పలు బిజినెస్ మేనేజ్ మెంట్ స్కూళ్లు పాఠ్యాంశాలయ్యాయి.

ఆర్థిక శాస్త్రంలో రంగరాజన్ ప్రతిభను గుర్తించిన కేంద్ర ప్రభుత్వాలు అనేక ఉన్నత పదవులు ఆయనకు కట్టబెట్టాయి. ప్రధాన మంత్రి ఆర్థిక సలహామండలికి చైర్మన్గా, ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్కు అధ్యక్షుడిగా, సీఆర్ రావు అడ్వాన్స్డ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మ్యాథమెటిక్స్ చైర్మన్గా పనిచేసిన ఆయన.. 1992 నుంచి 1997 వరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ గా.. 1997 నుంచి నుంచి 2003 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గవర్నర్గా వ్యవహరించారు. అదే సమయంలో ఒడిశా, తమిళనాడు రాష్ట్రాల గవర్నర్ గా అదనపు బాధ్యతలు చేపట్టారు. 2002 సంవత్సరంలో భారత ప్రభుత్వం రెండో అత్యున్నత పౌర పురస్కారం 'పద్మ విభూషన్'తో ఆయనను సత్కరించింది.

మరిన్ని వార్తలు