గుంజిళ్లు తీయించి.. కాళ్లు మొక్కించుకున్నారు

24 Apr, 2016 04:13 IST|Sakshi
సీసీ టీవీ పుటేజీలో గుంజిళ్లు తీస్తున్న డ్రైవర్ కుమార్ (వృత్తంలో)

కారును ఢీకొట్టాడనే కోపంతో క్యాబ్ డ్రైవర్‌పై కాంట్రాక్టర్ పైశాచికం
మరమ్మతుకు డబ్బు లేదన్నందుకు కాగితాలు లాక్కుని అవమానం
సీసీ టీవీ ఫుటేజీలో గుర్తించిన పోలీసులు
క్యాబ్ డ్రైవర్ కుమార్ అనుమానాస్పద మృతి కేసులో కీలక ఆధారాలు
కిరణ్‌కుమార్ అనే కాంట్రాక్టర్ అరెస్ట్

 హైదరాబాద్: కారును ఢీకొట్టాడనే కోపంతో ఓ క్యాబ్ డ్రైవర్‌తో గుంజిళ్లు తీయించారు. కాళ్లు మొక్కించుకుని అవమానపరిచారు. కారు రిపేర్ చేయించేందుకు డబ్బులు లేవన్నందుకు కారుకు సంబంధించిన కాగితాలు లాక్కుని నరకయాతన పెట్టారు. హైదరాబాద్‌లోని బోయిన్‌పల్లిలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన క్యాబ్ డ్రైవర్ నేరేడు కుమార్ (40) కేసుకు సంబంధించి పలు కీలక విషయాలను సీసీ కెమెరాలు వెల్లడించాయి. దీంతో ఈ ఘటనలో ప్రధాన నిందితుడిగా ఉన్న కిరణ్‌కుమార్‌ను పోలీసులు శనివారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటనతో సంబంధం ఉన్న కిరణ్ స్నేహితుడు సాయి పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

 చిన్న పొరపాటుతో..
ఈ నెల 21న హైదరాబాద్‌లోని కుషాయిగూడకు చెందిన కిరణ్‌కుమార్ కారును అమీర్‌పేట సమీపంలోని మల్లాపూర్‌కు చెందిన క్యాబ్‌డ్రైవర్ కుమార్ కారు ఢీకొట్టింది. దీంతో ఇద్దరి మధ్య గొడవ మొదలైంది. ఈ గొడవ పెద్దది కావడంతో వెంటనే అమీర్‌పేటలో ఉండే తన స్నేహితుడు సాయికి కిరణ్ ఫోన్ చేసి పిలిపించాడు. వారిద్దరు కలసి డ్రైవర్‌ను తీసుకుని బేగంపేటలోని ఎస్పీరోడ్‌లో ఉన్న కార్ల షోరూమ్‌కు తీసుకెళ్లారు. అక్కడ కారును రిపేర్ చేయించేందుకు రూ.5 వేలవుతుందని, ఆ డబ్బు ఇవ్వాలని కుమార్‌ను అడిగారు. తన వద్ద అంత మొత్తం లేదని చెప్పినా.. అతడి ఏటీఎం కార్డును లాక్కుని డబ్బు తీసుకునేందుకు ప్రయత్నించారు. అయితే ఖాతాలో డబ్బులు లేకపోవడంతో క్యాబ్‌కు సంబంధించిన కాగితాలు, డ్రైవింగ్ లెసైన్స్‌ను లాక్కున్నారు. అంతటితో ఆగకుండా అందరూ చూస్తుండగానే కుమార్‌తో గుంజిళ్లు తీయిం చారు, కాళ్లు మొక్కించుకున్నారు.

ఈ సంఘటన మొత్తాన్ని డ్రైవర్ నేరేడు కుమార్ క్యాబ్ యజమాని అనిల్‌కుమార్‌రెడ్డికి వివరించాడు. దీంతో వారిద్దరు  శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో రాంగోపాల్‌పేట్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు హనుమాన్ జయంతి ర్యాలీ విధుల్లో ఉండడంతో కేసు నమోదు చేసుకుని పంపించారు. ఆ తర్వాత తాడ్‌బండ్‌కు వెళ్లిన కుమార్ అనుమానాస్పద స్థితిలో మరణించాడు. అయితే బాధితుల ఫిర్యాదు ప్రకారం ఆయా ప్రాంతాల్లో సేకరించిన సీసీటీవీ ఫుటేజీలను పోలీసులు పరిశీలిం చి.. గుంజిళ్లు తీయించిన దృశ్యాలను గుర్తించారు. మేరకు శనివారం మధ్యాహ్నం నిందితుడు కిరణ్‌కుమార్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. మంచిర్యాలకు చెం దిన సాయి పరారీలో ఉన్నాడు. పోస్టుమార్టం అనంతరం నేరేడు కుమార్ మృతదేహన్ని  కుటుంబసభ్యులకు అప్పగించారు. వారు అంత్యక్రియల నిమిత్తం కుమార్ స్వగ్రామం మహబూబ్‌నగర్ జిల్లా నాగర్‌కర్నూలు సమీపంలోని అనంతపూర్‌కు తీసుకెళ్లారు.

మరిన్ని వార్తలు