స్నానం చేస్తుండగా రహస్య చిత్రీకరణ

3 Dec, 2013 05:26 IST|Sakshi

 = కేబుల్ ఆపరేటర్‌ను పట్టుకున్న స్థానికులు
 = నిందితుడిపై నిర్భయ చట్టం కింద కేసు

 
బంజారాహిల్స్, న్యూస్‌లైన్: బాత్‌రూమ్‌లో వెబ్‌కెమెరా బిగించి మహిళలు స్నానం చేయడాన్ని దొంగచాటుగా చూస్తూ.. తన కంప్యూటర్లో బంధిస్తున్న ఓ నీచుడిని బస్తీవాసులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అతడ్ని చితకబాది పోలీసులకు అప్పగించారు. బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. ఎస్సై ఎ.అన్వేష్‌రెడ్డి కథనం ప్రకారం...చిత్తూరు జిల్లా తిరుపతి పట్టణానికి చెందిన తిరునగరి రవిశంకర్ ప్రసాద్ (40) రెండేళ్లుగా బంజారాహిల్స్ రోడ్డునెం.10లోని సింగాడికుంట బస్తీతో పాటు పరిసర ప్రాంతాల్లో కేబుల్ ఆపరేటర్ పనిచేస్తున్నాడు.  

పది రోజుల క్రితం సింగాడిబస్తీలో ఓ గదిని అద్దెకు తీసుకొని అందులో కేబుల్‌కు సంబంధించిన కార్యాలయాన్ని తెరిచి.. అక్కడ ఓ కంప్యూటర్‌ను ఏర్పాటు చేశాడు. ఇదే ఇంట్లో ఉన్న మరో రెండు గదుల్లో తల్లీకూతురుతో పాటు ఇంకో జంట అద్దెకుంటున్నారు.  ఈ మూ డు గదులకు కలిపి ఒకే బాత్‌రూం ఉంది. మూడు రోజుల క్రితం రవిశంకర్ బాత్‌రూంలో ఓ మూలకు కెమెరా బిగించాడు. వైర్ ద్వారా తన గదిలో ఉన్న కంప్యూటర్‌కు కనెక్షన్ ఇచ్చి మహిళలు స్నానం చేస్తుండగా కెమెరాలో బంధించడమే కాకుండా కంప్యూటర్‌లో చూస్తున్నాడు.

పక్కగదిలో ఉండే యువతి (18) సాయంత్రం విధులు ముగించుకొని ఇంటికి వచ్చి.. ఆదివారం రాత్రి ఏడు గంటలకు స్నానం చేసేందుకు బాత్‌రూంకు వెళ్లింది. గది మూలన లైట్లు వెలుగుతూ ఆరుతూ ఓ పరికరం కనిపించడంతో ఆమె కంగారుపడింది.  ఆ పరికరాన్ని బయటకు లాగి చూడగా కెమెరా అని తేలింది. మరింత లోతుగా పరిశీలించగా  కెమెరాకు అమర్చిన వైర్ తమ పక్కనే అద్దెకుంటున్న కేబుల్ ఆపరేటర్ రవిశంకర్ ఇంట్లోకి అనుసంధానమై ఉంది.

ఈ విషయాన్ని తన తల్లితో పాటు చుట్టుపక్కల వారికి తెలియజేసింది. వెంటనే వారంతా రవిశంకర్ గది తలుపులు తెరిచి చూడగా కంప్యూటర్‌లో యువతి నగ్న దృశ్యాలను చూస్తూ దొరికిపోయాడు. స్థానికులు అతడ్ని చితకబాది పోలీసులకు అప్పగించారు. పోలీసులు విచారణలో నిందితుడు నేరాన్ని అంగీకరించాడు. అతడిపై ఐపీసీ సెక్షన్ 354(సీ) నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసి సోమవారం రిమాండ్‌కు తరలించారు. బంజారాహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తుచేస్తున్నారు.

Read latest Hyderabad News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా