‘వాణిజ్య పన్నుల’పై కాగ్‌ విచారణ

8 Jun, 2017 03:43 IST|Sakshi
‘వాణిజ్య పన్నుల’పై కాగ్‌ విచారణ
- రాష్ట్రంలోని సీటీవోలలో ఆడిట్‌ చేయించాలని సర్కారు నిర్ణయం
పక్కాగా ప్రతి చలానా, రసీదుల పరిశీలన
పన్ను చెల్లింపుల్లో అక్రమాల గుర్తింపునకు చర్యలు
నల్లగొండ లేదా సూర్యాపేట జిల్లాతో మొదలు 
తర్వాత రాష్ట్రవ్యాప్తంగా ఆడిట్‌
‘బోధన్‌’లో రూ.350 కోట్లకు చేరిన దుర్వినియోగం 
 
సాక్షి, హైదరాబాద్‌: వాణిజ్య పన్నుల శాఖ బోధన్‌ సర్కిల్‌లో వెలుగు చూసిన నకిలీ చలానాలు, పన్ను ఎగవేత కుంభకోణం నేపథ్యంలో.. రాష్ట్రవ్యాప్తంగా సీటీవో కార్యాలయా ల్లో తనిఖీలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులోభాగంగా నేరుగా కంప్ట్రో లర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌)తో చలానా లను, రసీదులను ఆడిట్‌ చేయించనుంది. దీంతో ఈ కుంభకోణం మూలాలు బోధన్‌కే పరిమితమా.. మిగతా జిల్లాల్లోనూ జరిగాయా అన్నది వెల్లడికానుంది.
 
సీరియస్‌గా ఉన్న సర్కారు
వాణిజ్య పన్నుల శాఖ కుంభకోణాన్ని రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఇప్పటికే ఈ కేసును సీఐడీకి అప్పగించి, లోతైన దర్యాప్తునకు ఆదేశించింది. బోధన్‌ సీటీవో పరిధిలో ఇప్పటివరకు దాదాపు రూ.350 కోట్ల మేర అక్రమాలు జరిగినట్లు ప్రాథమికంగా అంచనా. ఈ వ్యవహారంలో శాఖ అధికారులతో పాటు ప్రైవేటు ట్యాక్స్‌ కన్సల్టెంట్లకు ప్రమేయముందని సీఐడీ విచారణలో తేలింది. మొత్తం 15 మంది బాధ్యులను గుర్తించగా.. 12 మందిని అరెస్టు చేసింది. పన్ను చెల్లించేందుకు నకిలీ చలానాలు వినియోగించడం, ఒకరి పేరిట మాత్రమే ట్యాక్స్‌ చెల్లించి నలుగురి పేరిట చూపి ఎగవేయటం, కట్టాల్సిన పన్నులో సగమే చెల్లించి మిగతా డబ్బును జేబులో వేసుకోవడం.. వంటి మూడు మార్గాల్లో నిధులు దుర్వినియోగమైనట్లు గుర్తించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ ఇలాంటి అవినీతి చోటు చేసుకుందా.., కోట్ల రూపాయల దుర్వినియోగం వెనుక వ్యవస్థాగతమైన లోపాలేమైనా ఉన్నాయా.., పన్ను చెల్లించే విధానంలో మార్పులేమైనా అవసరమా.. అన్న అంశాలపై సీఎం కేసీఆర్‌ సంబంధిత శాఖ అధికారులను ఆరా తీశారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో సమగ్ర విచారణ చేపట్టాలని నిర్ణయించారు.
 
చలానాలు, రసీదులపై పక్కాగా ఆడిట్‌
అన్ని ట్రెజరీల్లో జమ చేసిన చలానాలను, పన్ను చెల్లించిన వ్యాపారుల వద్ద ఉన్న రసీదులను పరిశీలించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ రసీదులు, చలానాలు ఒకటేనా, నకిలీ చలానాలు ఉన్నాయా, చెల్లించిన పన్ను మొత్తంలో తేడాలున్నాయా.. అన్న దానిపై పక్కాగా ఆడిట్‌ చేయనుంది. ఆర్థిక శాఖ ఆధ్వర్యంలో ఈ తనిఖీలు నిర్వహించాలని తొలుత నిర్ణయించినా.. సమగ్ర తనిఖీ అవసరమైన నేపథ్యంలో ప్రత్యేక ఆడిట్‌ బృందాలు లేదా ప్రైవేటు ఏజెన్సీలను రంగంలోకి దింపాలని యోచించింది. అయితే నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డ కన్సల్టెంట్లు ఆడిట్‌ జనరల్‌ కార్యాలయం అధికారులకు సైతం ముడుపులు ముట్టజెప్పినట్లు సీఐడీ విచారణలో వెల్లడించారు. దీంతో ఆడిట్‌ బాధ్యతలను కాగ్‌కు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తొలుత నల్లగొండ జిల్లా లేదా సూర్యాపేట జిల్లాలో కాగ్‌ బృందంతో ఆడిట్‌ చేయించనున్నారు. తర్వాత అన్ని సీటీవో కార్యాలయాల పరిధిలో ప్రతి చలానాను పరిశీలించనున్నారు.  
మరిన్ని వార్తలు