కాల్షియం డ్రాప్స్ వికటించి.. చిన్నారులకు అస్వస్థత

22 Sep, 2013 03:36 IST|Sakshi

 బోయిన్‌పల్లి/కంటోన్మెంట్, న్యూస్‌లైన్: కాల్షియం డ్రాప్స్ వికటించి దాదాపు 30 మంది చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. డోసులు తీసుకున్న వెంటనే చిన్నారులు నురగలు కక్కుతూ పడిపోయారు. దీంతో తల్లిదండ్రులు ఆర్తనాదాలతో ఆస్పత్రులకు పరుగులు తీశారు. బోయిన్‌పల్లి పరిధి అన్నానగర్‌లో శనివారం చోటుచేసుకున్న ఈ ఘటన కలకలం రేపింది. ఘటనకు కారకుడైన వైద్యునిపై చర్యలు తీసుకోవాలంటూ స్థానికులు ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. వివరాల్లోకి వెళ్తే..

గురు, శుక్రవారాల్లో కొందరు వాలంటీర్లు అన్నానగర్, రసూల్‌పురా, ఇందిరమ్మ నగర్, సీబీఎన్ నగర్, శ్రీలంకబస్తీ ప్రాంతాల్లో పిల్లలకు కాల్షియం డ్రాప్స్ వేస్తున్నామంటూ కార్డులు పంచారు. వాటిని తీసుకుని శనివారం కవిత హాస్పిటల్‌కు రావాలని చెప్పారు. రిజిస్ట్రేషన్ ఫీజు రూ.12, ఒక్కో డోసుకు రూ.20 చొప్పున చెల్లించాలన్నారు. ప్రభుత్వం ఆధ్వర్యంలోనే ఈ కార్యక్రమం చేపట్టినట్టు ప్రచారం చేశారు. దీంతో మొదటి డోసు కోసం శనివారం సాయంత్రం పెద్దసంఖ్యలో చిన్నారులను తీసుకుని తల్లిదండ్రులు కవిత హాస్పిటల్‌కు చేరుకుని పిల్లలకు డ్రాప్స్ వేయించారు.

ఇది జరిగిన రెండు గంటల తర్వాత దాదాపు 30 మంది పిల్లలు నురగలు కక్కుకుంటూ పడిపోయారు. కొందరు అస్వస్థతకు గురయ్యారు. దీంతో తల్లిదండ్రులు వెంటనే కవిత హాస్పిటల్‌కు వెళ్లగా నిర్వాహకులు జాడలేరు. హాస్పిటల్ యాజమాన్యం తమకేమీ తెలియదనడంతో మోసపోయినట్లు గ్రహించారు. వెంటనే చిన్నారులను తల్లిదండ్రులు సమీపంలోని పలు ప్రైవేటు ఆసుపతుల్లో చేర్పించారు.

తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్నప్పటికీ ఎవరికీ ప్రమాదం లేదని వైద్యులు వెల్లడించారు. 108 వాహనాలు పెద్దసంఖ్యలో అన్నానగర్ చౌరస్తాకు చేరుకోవడం, తల్లిదండ్రుల ఆందోళనతో అంతటా ఉద్విగ్నత నెలకొంది. ఘటన దరిమిలా స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. కాగా, వాలంటీర్లు పంచిన కరపత్రాలు, కార్డుల్లో డాక్టర్ పేరు సయ్యద్ అబ్బాస్, బీయూఎంఎస్ అని ఉందని స్థానికులు చెప్పారు.
 

మరిన్ని వార్తలు