సిలికానాంధ్ర వర్సిటీకి కాలిఫోర్నియా అనుమతి

12 Apr, 2016 04:31 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: తెలుగు భాష, తెలుగు కళల విద్యాభ్యాసం, ఈ రంగాల్లో పరిశోధనల ప్రాతిపదికగా ఏర్పాటుచేసిన యూనివర్సిటీ ఆఫ్ సిలికానాంధ్రకు అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని వర్సిటీ ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈఓ) కూచిబొట్ల ఆనంద్ తెలిపారు. త్వరలో కూచిపూడి నాట్యం, కర్ణాటక సంగీతంలో సర్టిఫికెట్, డిప్లమో, పోస్టు గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాలు జరుగుతాయని వెల్లడించారు. రెండో దశలో తెలుగు భాషా శాస్త్రాల్లో మాస్టర్ డిగ్రీ కోర్సులు ప్రవేశపెడతామని చెప్పారు.

2007లో 150 మంది విద్యార్థులతో ప్రారంభమైన మనబడి, ఈ ఏడాది 6,200 మందికి చేరుకుందని ప్రధాన బోధనాధికారి రాజు చమర్తి తెలిపారు. కేజీ నుంచి పీజీ వరకు విద్యనందించాలనే లక్ష్యంతో సిలికాన్ వ్యాలీలో ఏర్పాటైన సిలికానాంధ్ర విశ్వవిద్యాలయాన్ని మరింతగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నట్టు ప్రధాన ఆర్థిక వ్యవహారాల అధికారి దీనబాబు కొండుభట్ల చెప్పారు. వివిధ కోర్సుల్లో చేరేందుకు చాలామంది తెలుగువారు తమను సంప్రదిస్తున్నారని వ్యవస్థాపక సభ్యులు గంటి అజయ్, కొండిపర్తి దిలీప్ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు