‘గోదావరి’పై రంగంలోకి దిగండి

21 Dec, 2015 01:48 IST|Sakshi
‘గోదావరి’పై రంగంలోకి దిగండి

♦ ప్రాజెక్టుల పనులను జనవరిలో ప్రారంభించండి
♦ నీటిపారుదల ప్రాజెక్టులపై సమీక్షలో సీఎం కేసీఆర్ ఆదేశం
♦ మహారాష్ట్ర సీఎంకు ఫోన్
♦ కాళేశ్వరం, తుమ్మిడిహెట్టిల వద్ద బ్యారేజీలతో ముంపు ఉండదని స్పష్టీకరణ
♦ పూర్తి వివరాలు సమర్పించాక ఒప్పందానికి ప్రతిపాదన
 
 సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసేందుకు తలపెట్టిన నీటిపారుదల ప్రాజెక్టుల రీ డిజైనింగ్ పని కొలిక్కి వచ్చినందున ఇక కార్యరంగంలోకి దిగాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నీటిపారుదల శాఖకు సూచించారు. గోదావరి నదిపై నిర్మించ తలపెట్టిన ప్రాజెక్టుల పనులను జనవరిలో ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రైతులు సాగునీటి కోసం ఎదురు చూస్తున్నారని...ప్రాజెక్టుల ద్వారా బీడు భూములకు నీరు అందుతుందనే ఆశతో ఉన్నారని, వారి ఆకాంక్షలకు తగ్గట్లు వేగంగా ప్రాజెక్టులు పూర్తిచేసి సాగునీరు అందించాలన్నారు.

ఆదిలాబాద్ జిల్లా తుమ్మిడిహెట్టి వద్ద, కరీంనగర్ జిల్లాలో కాళేశ్వరం ప్రాజెక్టు (ప్రాణహిత-చేవెళ్ల) పనులను ఏకకాలంలో ప్రారంభించి వేగంగా పూర్తి చేయాలన్నారు. ఆదివారం క్యాంపు కార్యాలయంలో నీటిపారుదల ప్రాజెక్టులపై సీఎం సమీక్షించారు. సమీక్షకు నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు, ప్రభుత్వ సలహాదారు విద్యాసాగర్‌రావు, శాఖ కార్యదర్శి ఎస్‌కే జోషి, ఈఎన్‌సీ మురళీధర్, సీఈలు హరిరామ్, వెంకటేశ్వర్లు, వ్యాప్కోస్ ఎండీ శంభూ ఆజాద్‌లు పాల్గొన్నారు.

 కనిష్ట ముంపు.. గరిష్ట నీటి వినియోగం..
 ప్రాజెక్టులను కనిష్ట ముంపు-గరిష్ట నీటి వినియోగం పద్ధతిన నిర్మించాలని సీఎం కేసీఆర్ సూచించారు. దీనివల్ల అంతర్రాష్ట్ర వివాదాలు, భూసేకరణ సమస్యలు ఎక్కువగా ఉండవన్నారు. తుమ్మిడిహెట్టి వద్ద 148 మీటర్ల ఎత్తులోనే బ్యారేజీని నిర్మించాలని, ఆదిలాబాద్ జిల్లాకు నీరు పారించడానికి అనువుగా రెండు, మూడు రిజర్వాయర్లకు ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. కాళేశ్వరం బ్యారేజీని కూడా వీలైనంత తక్కువ ముంపు ఉండేట్లు డిజైన్ చేసినందున వీటికి సంబంధించిన తుది ముసాయిదాలు సిద్ధం చేసి పనులను ప్రారంభించాలన్నారు. ఈ నెలాఖరు వరకు అన్ని ప్రణాళికలు సిద్ధం చేసి కార్యచరణ రూపొందించాలని, జనవరిలో పనులు ప్రారంభించాలని సూచించారు. వచ్చే ఏడాది వర్షాలు కురిసేలోగా చాలా పని జరగాలని ఆదేశించారు.
 
మహారాష్ట్ర ముఖ్యమంత్రికి ఫోన్..
 కాళేశ్వరం ప్రాజెక్టు (ప్రాణహిత-చేవెళ్ల)లో భాగంగా బ్యారేజీల నిర్మాణ విషయమై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌తో సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా ఫోన్‌లో మాట్లాడారు. తుమ్మిడిహెట్టి, కాళేశ్వరం వద్ద నిర్మించే బ్యారేజీలు, ప్రాజెక్టు రీ డిజైన్ గురించి ఆయనకు వివరించారు. ఈ బ్యారేజీల నిర్మాణం వల్ల మహారాష్ట్రలో ముంపు ఉండదని సీఎం స్పష్టం చేశారు. మంత్రి హరీశ్‌రావు నేతృత్వంలోని బృందం త్వరలోనే మహారాష్ట్రలో పర్యటించి ప్రాజెక్టులకు సంబంధించిన పూర్తి వివరాలు అందిస్తారన్నారు. ఆ తర్వాత ముఖ్యమంత్రుల స్థాయిలో ఒప్పందం కుదుర్చుకుందామని ప్రతిపాదించారు. దీనికి ఫడ్నవిస్ సానుకూలంగా స్పందించారు. తెలంగాణ బృందాన్ని తమ వద్దకు పంపాలని, తాము సైతం తమ నీటిపారుదలశాఖ మంత్రి, అధికారులను సిద్ధం చేస్తామన్నారు.

మరిన్ని వార్తలు