150 ఎంబీబీఎస్ సీట్లు భర్తీ చేసుకోవచ్చు

28 Sep, 2016 02:22 IST|Sakshi

- మల్లారెడ్డి మహిళా కాలేజీకి కేంద్రం అనుమతి
 సాక్షి, హైదరాబాద్: మల్లారెడ్డి మహిళా మెడికల్ కాలేజీకి ఎట్టకేలకు ఈసారి 150 ఎంబీబీఎస్ సీట్లు భర్తీ చేసుకునేందుకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ అనుమతించింది. 2016-17 వైద్య విద్యా సంవత్సరానికి అడ్మిషన్ల గడువు ఈ నెలాఖరుకు ముగుస్తున్న నేపథ్యంలో కౌన్సెలింగ్ నిర్వహించేందుకు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం ఏర్పాట్లు చేసింది. ఆ కాలేజీలోని సగం కన్వీనర్ కోటా (75) సీట్లకు ఈనెల 29న వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. వాటితోపాటు రెండో విడత కౌన్సెలింగ్‌లో మిగిలే సీట్లకు, స్పోర్ట్స్ కోటాకు చెందిన 10 సీట్లకు కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. స్పోర్ట్స్ కోటా సీట్లకు సంబంధించి ఇంకా స్పోర్ట్స్ అథారిటీ నుంచి మెరిట్ లిస్టు రాలేదు.
 
 లిస్టు 28వ తేదీ సాయంత్రానికి వస్తేనే ఆ సీట్ల భర్తీ జరుగుతుందని వర్సిటీ వీసీ డాక్టర్ కరుణాకర్‌రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. జాబితా పంపాలని అథారిటీకి లేఖ రాసినట్లు వెల్లడించారు. మల్లారెడ్డి కాలేజీలో 29న ప్రభుత్వం వెబ్ కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నందున, బి కేటగిరీ మొదటి కౌన్సెలింగ్‌లో మిగిలిన సీట్లతోపాటు మల్లారెడ్డి కాలేజీకి వచ్చిన సీట్లలో బి కేటగిరీకి చెందిన 35 సీట్లకు ఈనెల 30న కౌన్సెలింగ్ నిర్వహించుకునేందుకు ప్రైవేటు మెడికల్ కాలేజీ యాజమాన్య సంఘానికి అనుమతి ఇచ్చినట్లు కరుణాకర్‌రెడ్డి తెలిపారు.

మరిన్ని వార్తలు