వలసదారులు అనడానికి వీల్లేదు

21 Aug, 2016 01:24 IST|Sakshi
వలసదారులు అనడానికి వీల్లేదు

- ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నవారు ‘వలసదారులు’ కారు
- ఏపీలో స్థానికత ఉండి.. తిరిగొచ్చినవారు వలసదారులు కారు
- ఆ పేరుతో వారి కుల ధ్రువీకరణలను తిరస్కరించరాదు: హైకోర్టు
 
 సాక్షి, హైదరాబాద్ : ఉమ్మడి రాష్ట్రంలో స్థానికత ఉన్న వారు రాష్ట్ర విభజన తరువాత ఏదో ఒక రాష్ట్రంలో స్థానికుడిగా ఉండేందుకు నిర్ణయించుకోవచ్చునని, అలాంటి వారిని స్థానికులుగానే పరిగణించి, వారికి సామాజిక రిజర్వేషన్లను సైతం వర్తింపచేయాలని ఎన్టీఆర్ వైద్య వర్సిటీని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఉమ్మడి రాష్ట్రంలో కలిసున్న వారు రాష్ట్ర విభజన తరువాత ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి వెళితే దానిని ‘వలస’ అని, అలా వెళ్లిన వారిని ‘వలసదారులు’ అని అనడానికి వీల్లేదని స్పష్టంచేసింది. ఒక రాష్ట్రం ఒక వ్యక్తిని ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీగా గుర్తించినంత మాత్రాన మరో రాష్ట్రం కూడా ఆ వ్యక్తిని అదే వర్గానికి చెందిన వ్యక్తిగా గుర్తించాల్సిన అవసరం లేదంది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ వి.రామసుబ్రమణియన్, జస్టిస్ అనిస్‌లతో కూడిన ధర్మాసనం ఇటీవల తీర్పు వెలువరించింది.

 నేను స్థానికేతరురాలినా?
 ఏపీకి చెందిన తన తండ్రి ఉద్యోగరీత్యా తెలంగాణకు వచ్చారని, తరువాత బదిలీపై తిరిగి ఏపీకి వెళ్లారని, ఈ నేపథ్యంలో ఎంసెట్ ప్రవేశాల సందర్భంగా తనను స్థానికేతరురాలిగా పరిగణిస్తూ, బీసీ-ఏ కింద రిజర్వేషన్లు కల్పించేందుకు నిరాకరిస్తున్నారంటూ శ్రీకాకుళం జిల్లాకు చెందిన బొడ్డేపల్లి జోత్స్న హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇదే అభ్యర్థనలతో మిరియాల ప్రియదర్శిని, మరికొంత మందీ వేర్వేరుగా పిటిషన్లు  చేశారు. ఎన్‌టీఆర్ వైద్య విశ్వవిద్యాలయం తరఫు న్యాయవాది తడ్డి నాగేశ్వరరావు  తన వాదనలు వినిపించారు.

 వలసదారుడు అనడానికి వీల్లేదు
 ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం ఇటీవల తీర్పు వెలువరిస్తూ... ఏపీ, తెలం గాణలు  రెండుగా విడిపోయిన సందర్భంలో ఉమ్మడి రాష్ట్రంలో స్థానికుడిగా ఉన్న వ్యక్తి ఈ రెండు రాష్ట్రాల్లో ఒక రాష్ట్రాన్ని స్థానికుడిగా ఉండేందుకు ఎంచుకోవచ్చనీ,  ఆ వ్యక్తిని ఒక రాష్ట్రం నుంచి ‘వలస’ వచ్చారని గానీ, ‘వలసదారుడు’ అని గానీ చెప్పడానికి ఎంత మాత్రం వీల్లేదంది. ఇక రెండో క్లిష్టమైన అంశానికి వస్తే... ఈ వ్యాజ్యాల్లో కొందరు పిటిషనర్లు ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో జన్మించారు. వారికి అక్కడి అధికారులే కుల ధ్రువీకరణ పత్రాలు జారీ చేశారు. వారు ఇప్పుడు తిరిగి వారి సొంత ప్రాంతాలకే వెళుతున్నారు. ఇలా ఒక ప్రాంతంలో స్థానికత ఉండి.. మరో ప్రాంతంలో పెరిగి.. తిరిగి స్థానికత ఉన్న ప్రాంతానికి వెళుతుంటే అటువంటి వారిని వలసదారులుగా పేర్కొంటూ వారికి గతంలో ఇచ్చిన కుల ధ్రువీకరణ పత్రాలను తిరస్కరించడానికి వీల్లేదని ధర్మాసనం తన తీర్పులో పేర్కొంది. పిటిషనర్లను స్థానికులుగానే పరిగణిస్తూ వారికి ఆ మేర రిజర్వేషన్లు కల్పించాలని ఆదేశించింది.

Read latest Hyderabad News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా