సర్కారీ ఇంటర్ ఉచితం

25 Jun, 2015 08:09 IST|Sakshi
సర్కారీ ఇంటర్ ఉచితం

* ఫీజుల రద్దు, పుస్తకాలతో బోర్డుపై ఏటా రూ. 16 కోట్ల భారం
* ఉప ముఖ్యమంత్రి కడియం వెల్లడి

సాక్షి, హైదరాబాద్: ఇకపై ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఇంటర్ విద్య పూర్తిగా ఉచితం కానుంది. ప్రభుత్వ కళాశాలలో చేరే విద్యార్థుల నుంచి రిజిస్ట్రేషన్, ట్యూషన్ ఫీజుల పేరుతో ఏటా వసూలు చేస్తున్న (ఒక్కొక్కరి నుంచి రూ. 533 నుంచి 893) కనీస మొత్తాన్ని కూడా తీసుకోవద్దని ప్రభుత్వం నిర్ణయించింది.

విద్యార్థులు ఒక్క పైసా కూడా చెల్లించాల్సిన అవసరం లేకుండా పూర్తిగా ఉచిత విద్యను అందించాలని ఇంటర్మీడియెట్ బోర్డు పాలక మండలి సమావేశంలో నిర్ణయం తీసుకుంది. దీంతోపాటు ప్రతి విద్యార్థికీ ఉచితంగా పాఠ్యపుస్తకాలను అందించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇవన్నీ ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచే అమలు చేయనున్నట్లు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ప్రకటించారు. బుధవారం ఇంటర్మీడియెట్ బోర్డు కార్యాలయంలో సమావేశం అనంతరం కడియం శ్రీహరి విలేకరులతో మాట్లాడారు.

గ్రామీణ ప్రాంతాల్లో పాఠ్యపుస్తకాలు కూడా కొనుక్కోలేని విద్యార్థులు ఉన్నందున, ప్రిన్సిపాళ్ల ద్వారా జూలై నెలాఖరులోగా ఉచితంగా అందించాలని నిర్ణయించామన్నారు. విద్యార్థి తన ఐడీ కార్డు ద్వారా పుస్తకాలను పొందవచ్చన్నారు. రాష్ట్రంలోని ప్రైవేటు జూనియర్ కాలేజీలు ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేస్తున్నాయని విలేకరులు కడియం దృష్టికి తీసుకెళ్లగా.. ‘ముందుగా నా ఇంటిని పటిష్టం చేస్తా. ప్రభుత్వ జూనియర్ కాలేజీలను అభివృద్ధి చేస్తా. నాణ్యతతో కూడిన విద్యను అందించేందుకు చర్యలు చేపడతాం. అసలు ప్రైవేటు కాలేజీలకు వెళ్లకుండా చేయాలన్నదే నా మొదటి ప్రాధాన్యం.

వాటి నియంత్రణ తరువాత అంశం’ అని వివరించారు. ‘ప్రస్తుతం రాష్ట్రంలోని 402 ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో 1.15 లక్షల మంది విద్యార్థులున్నారు. ఈసారి ఈ సంఖ్య 1.30 లక్షలకు చేరుకునే అవకాశం ఉంది. వారంతా ఈసారి ఫీజులు చెల్లించాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం సైన్స్ విద్యార్థుల నుంచి ఏటా రూ. 893, ఆర్ట్స్ విద్యార్థుల నుంచి రూ.533 వరకు వసూలు చేస్తున్నారు. ఇప్పటికే చెల్లించిన వారికి తిరిగిచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నాం. ఇలా 1.30 లక్షల మంది విద్యార్థులు చెల్లించాల్సిన దాదాపు రూ. 9 కోట్లు ఇంటర్ బోర్డే ఇకపై భరిస్తుంది. అలాగే పాఠ్యపుస్తకాలకు అయ్యే రూ.7 కోట్లను కూడా బోర్డే భరించనుంది.  అని కడియం వివరించారు. అన్ని కాలేజీలకు పక్కా భవనాలు, మౌలిక సదుపాలు కల్పిస్తామని చెప్పారు.
 
క్రమబద్ధీకరణ తరువాత పోస్టుల భర్తీ
జూనియర్ కాలేజీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు లెక్చరర్ల క్రమబద్ధీకరణ తరువాత మిగిలిన పోస్టులను భర్తీ చేసేందుకు చర్యలు చేపడతామని కడియం శ్రీహరి తెలిపారు. ప్రభుత్వం భర్తీ చేయనున్న 25 వేల పోస్టుల్లో లెక్చరర్ పోస్టులు ఉండేలా చూస్తున్నామన్నారు. కాలేజీల్లో నాణ్యత ప్రమాణాలకు పెద్దపీట వేస్తున్నామని చెప్పారు. వచ్చే ఏడాది నుంచి ఎంసెట్‌కు శిక్షణ ఇస్తామని ఆయన వివరించారు.
 
2 రోజుల్లో ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు
ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను ఒకటి రెండు రోజుల్లో వెల్లడించనున్నట్లు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి పేర్కొన్నారు. ఫలితాల వెల్లడికి సంబంధించిన పనులను పూర్తి కావ చ్చాయని వెల్లడించారు.  కాగా అఫిలియేషన్లపై ఇంజనీరింగ్ కాలేజీల యాజమాన్యాలు ఆందోళన చెందుతున్నాయని విలేకరులు ప్రస్తావించగా.. తప్పు చేసిన వారు భయపడతారని, తప్పు చేయనపుడు ఎందుకు భయమని పేర్కొన్నారు. దీనిపై తామేమీ చేసేది లేదని చెప్పారు.

Read latest Hyderabad News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు