1 నుంచి కంటోన్మెంట్ రోడ్లు బంద్

19 May, 2016 03:43 IST|Sakshi
1 నుంచి కంటోన్మెంట్ రోడ్లు బంద్

-స్థానిక సైనికాధికారుల నిర్ణయం
-ఏడాది వాయిదాకు కేటీఆర్ విజ్ఞప్తి
 
 సాక్షి, హైదరాబాద్: జూన్ 1 నుంచి హైదరాబాద్ కంటోన్మెంట్ రోడ్లను మూసివేయాలని సైనికాధికారులు నిర్ణయించారు. ఈ నిర్ణయంతో నిత్యం పదిలక్షల మంది ప్రయాణికుల రాకపోకలపై ప్రత్యక్ష ప్రభావం పడబోతుంది. ఆర్మీ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ కొన్ని రోజులుగా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తక్ష ణమే ఆర్మీ అధికారులతో సమావేశమై ప్రత్యామ్నాయ రోడ్లు ఏర్పాటు చేసుకునే వరకు కంటోన్మెంట్ రోడ్ల మూసివేతను వాయిదా వేసుకోవాలని, ప్రత్యమ్నాయ రోడ్లకు కావల్సిన ఆర్మీ భూముల సేకరణకు సహకరించే విధంగా ఒప్పించాలని జీహెచ్‌ఎంసీ అధికారులను ఆదేశించారు.

పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంజీ గోపాల్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ బి.జనార్దన్‌రెడ్డితో బుధవారం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ స్థాయిలో స్వయం గా తనే రక్షణ మంత్రి మనోహర్ పారికర్‌తో మాట్లాడుతానన్నారు. గవర్నర్ నరసింహన్ కూడా ఈ అంశంపై ఢిల్లీలోని సైనికాధికారులతో చర్చించారని, సానుకూల నిర్ణయం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రత్యమ్నాయ రోడ్లు ఏర్పాటు చేసుకునే వరకు ఏడాది సమయం పడుతుందని, అప్పటి వరకు కంటోన్మెంట్ రోడ్ల మూసివేతపై పునరాలోచించాలని ఆర్మీ అధికారులకు కోరాలన్నారు.

రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, సైనికాధికారుల మధ్య జరిగే సాధారణ సమావేశాన్ని తక్షణమే ఏర్పాటు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మను ఆదేశించారు. రోడ్ల మూసివేతపై ఎలాంటి నిర్ణ యం తీసుకున్నా హైదరాబాద్‌లోని ఆర్మీతో రాష్ట్ర ప్రభుత్వ సంబంధాల్లో ఎలాంటి మార్పు ఉండబోదన్నారు. కంటోన్మెంట్ బోర్డు, జీహెచ్‌ఎంసీల మధ్య ప్రజల సౌకర్యార్థం పరస్పర సమన్వయం అవసరమన్నారు. నిత్యం లక్షలాది మందిపై తీవ్ర ప్రభావం చూపే ఈ సమస్యను ఆర్మీ అధికారులు అషామాషీగా తీసుకోవద్దని విజ్ఞప్తి చేశారు.

>
మరిన్ని వార్తలు