చినబాబు ఓ చిటికేస్తేసింగిల్ టెండర్ ఓకే

6 May, 2016 06:29 IST|Sakshi
చినబాబు ఓ చిటికేస్తేసింగిల్ టెండర్ ఓకే

రాజధానిలో రూ.101 కోట్ల పనులు అడ్డదారిలో అప్పగింత
* ఆర్‌అండ్‌బీ ఆరంతస్తుల భవన టెండర్లలో గోల్‌మాల్
* ప్రి కాస్ట్ విధానంలో భవన నిర్మాణానికి సాధారణ టెండరు
* నాలుగు శాతం కంటే ఎక్సెస్‌కు దాఖలైన టెండరు ఆమోదం
* దాఖలైన రెండు టెండర్లలో ఓ టెండర్‌ను డిస్ క్వాలిఫై చేసిన కమిటీ
* చినబాబు జోక్యం వల్లే సింగిల్ టెండరు ఆమోదం
* కోర్టును ఆశ్రయించిన అనర్హత వేటు పడిన పోటీదారు

 
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతంలో ప్రభుత్వ విభాగాలకు నిర్మిస్తున్న భవనాలు అధికార పార్టీ నేతలకు కల్పతరువుగా మారాయి. ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్న చినబాబు అండతో రూ.కోట్ల విలువైన పనుల్ని అడ్డదారిలో చేజిక్కించుకుంటూ చెలరేగిపోతున్నారు. దీనికి ఉన్నతాధికారులు తలూపుతుండటంతో యథేచ్ఛగా దోపిడీ కొనసాగుతోంది. అందులో భాగంగా ఏకంగా రూ.101 కోట్ల విలువైన భవన నిర్మాణ పనుల్ని అస్మదీయుడైన ఓ కాంట్రాక్టరుకు అప్పనంగా అప్పగించేశారు. అదీ 4.6 శాతం ఎక్సెస్‌తో దాఖలైన టెండరుకు కట్టబెట్టారు.

దాఖలైన రెండు టెండర్లలో ఓ టెండరును ప్రైస్ బిడ్ తెరవకుండానే అనర్హత వేటు వేశారు. టెక్నికల్ బిడ్‌లో అర్హత సాధించలేదని పోటీదారుడి టెండరును తిరస్కరించారు. అత్యంత గోప్యంగా సింగిల్ టెండరు దారుడితో ఏప్రిల్ నెలాఖరున అగ్రిమెంట్ కుదుర్చుకుని పనులు అప్పగించారు. దీంతో రెండో టెండరు దాఖలు చేసిన పోటీదారుడు కోర్టును ఆశ్రయించారు.
 
రూ.101 కోట్ల టెండర్లలో గోల్‌మాల్ ఇదీ...
రవాణా, ఆర్‌అండ్‌బీ శాఖల కోసం ఏపీ రాజధాని ప్రాంతం విజయవాడలోని బందరు రోడ్డులో ఆరంతస్తుల భవనం నిర్మాణానికి గతేడాది ఆర్థిక శాఖ అనుమతినిచ్చింది. రూ.101 కోట్లతో ప్రీ ఫ్యాబ్రికేటెడ్ భవంతిని ఆర్‌అండ్‌బీకి చెందిన రెండెకరాల స్థలంలో నిర్మించేందుకు నిర్ణయించారు. దీనికి ఆర్థిక శాఖ ఆమోదం తెలిపిన వెంటనే టెండర్లు పిలిచి భవన నిర్మాణ పనులు మొదలుపెట్టాలి. అంచనా రూ.వంద కోట్లు దాటిందంటే గ్లోబల్ టెండర్లు పిలవాల్సి ఉంది. అయితే ప్రభుత్వం సాధారణంగా ఈపీసీ విధానంలో టెండర్లు పిలిచింది.

కేఎంవీ ప్రాజెక్ట్సు, ఛాబ్రాస్ అసోసియేట్స్ టెండర్లు దాఖలు చేశాయి. దాఖలైన టెండర్లలో ప్రైస్ బిడ్ తెరిచే ముందు టెక్నికల్ బిడ్‌లో అర్హత సాధించాలి, టెండర్లలో కేఎంవీ ప్రాజెక్ట్సు 4.6 శాతం ఎక్సెస్‌తో టెండరు దాఖలు చేసినట్లు ప్రైస్‌బిడ్ తెరిచిన తర్వాత ఆర్‌అండ్‌బీ అధికారులు పొందుపరిచారు. ఛాబ్రాస్ అసోసియేట్స్ మాత్రం టెక్నికల్ బిడ్‌లో అర్హత సాధించలేదని అనర్హత వేటు వేశారు. సింగిల్ టెండరు వేసిన కేఎంవీ సంస్థకు రూ.101 కోట్ల విలువైన పనుల్ని కట్టబెట్టారు. సింగిల్ టెండరు ఒక్కటే టెక్నికల్ బిడ్‌లో అర్హత సాధిస్తే మరోసారి టెండర్లు పిలవాలి. అయితే ఏకంగా సింగిల్ టెండరుకు పనుల్ని కట్టబెట్టడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చినబాబు జోక్యం తోనే ఆర్‌అండ్‌బీలో ముఖ్య ఇంజనీరు టెండరు ఆమోదంలో చక్రం తిప్పినట్లు ఆరోపణలున్నాయి.
 
నిబంధనలు తోసిరాజని..
రూ.వంద కోట్లకు పైగా పనులకు టెండర్లు పిలవాలంటే కనీసం జాతీయ స్థాయి పత్రికల్లో టెండరు నోటిఫికేషన్ జారీ చేయాలి. ఆర్‌అండ్‌బీ అధికారులు ఏ ప్రకటన జారీ చేయలేదు. అయితే ముందుగానే ఎంపిక చేసుకున్న సంస్థకు టెండరు కట్టబెట్టేందుకు ప్రభుత్వ పెద్దల జోక్యంతో ఆర్‌అండ్‌బీ అధికారులు నిబంధనలన్నీ పక్కన పెట్టారు. ఆరు అంతస్తుల భవన నిర్మాణం, విద్యుత్తు పనులు, ఫర్నీచర్ ఏర్పాటు లాంటి పనుల్ని ప్యాకేజీల కింద విడగొట్టారు.

ఉద్దేశ్యపూర్వకంగానే దాఖలైన రెండు టెండర్లలో ఛాబ్రాస్ అసోసియేట్స్ దాఖలు చేసిన టెండరును ప్రాథమిక దశలోనే సాంకేతిక అర్హతలు లేవని పక్కన పెట్టేశారు. విద్యుత్తు పనులు చేయడంలో వైఫల్యం చెందారన్న సాకుతో అసలు ప్రైస్ బిడ్ తెరవకుండా, ప్రీ కాస్ట్ విధానంలో అసలు అర్హత లేదన్న కారణంతో డిస్‌క్వాలిఫై చేశారు. ఇంత పెద్ద ప్రాజెక్టుకు కనీసం ఒకే ఒక టెండరు దాఖలైతే మళ్లీ రెండోసారి టెండరు పిలవాలి. ఈ నిబంధనలేవీ పట్టించుకోకుండా ఏకపక్షంగా టెండరు కట్టబెట్టడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ టెండరు ఖరారులో ఆర్‌అండ్‌బీ అధికారుల నడుమ విభేదాలు పొడచూపినట్లు సమాచారం.
 
కేఎంవీ సంస్థ ఎవరిది?
ప్రీ కాస్ట్ విధానంలో భవంతులు నిర్మాణంలో అనుభవం ఉందని పేర్కొంటున్న కేఎంవీ ప్రాజెక్ట్సు నిర్వాహకులకు ప్రభుత్వంలో కీలక వ్యక్తులతో నేరుగా సంబంధాలున్నాయి. చినబాబు జోక్యంతోనే నిబంధనలన్నీ పక్కనపెట్టి టెండరు కేఎంవీ ప్రాజెక్ట్సుకు అప్పగించారు. ఎన్నికల సమయంలో టీడీపీకి ఆర్థిక సాయం అందించారనే కారణంతోనే రాజధాని ప్రాంతంలో చేపడుతున్న ప్రాజెక్టును కట్టబెట్టినట్లు ఆరోపణలున్నాయి. హైదరాబాద్‌లో నిజాం క్లబ్ రెన్యువేషన్స్‌లో భాగంగా ప్రీ కాస్ట్ విధానంలో అద్భుతంగా నిర్మిస్తున్నారని ఆర్‌అండ్‌బీ అధికారులు పేర్కొంటున్నారు.
 
కమిటీ ఆమోదంతోనే ఖరారు చేశాం
కమిషనర్ ఆఫ్ టెండర్స్ (సీఓటీ) ఆమోదం తర్వాత సింగిల్ టెండరును ఖరారు చేశామని ఆర్‌అండ్‌బీ ఈఎన్‌సీ గంగాధరం ‘సాక్షి’ ప్రతినిధికి తెలిపారు. తనతో పాటు ఏపీఆర్‌డీసీ ఎండీ, క్వాలిటీ కంట్రోల్ సీఈ తదితరులతో ఓ కమిటీ ఉంటుందని, ఈ కమిటీ ఆమోదంతోనే సింగిల్ టెండరును ఆమోదించి కేఎంవీ సంస్థకు పనుల్ని కట్టబెట్టామని చెప్పారు. ఛాబ్రాస్ అసోసియేట్స్‌కు విద్యుత్తు పనుల్లో అనుభవం లేదని, ఈ సంస్థకు ఏపీలో కాంట్రాక్టు రిజిస్ట్రేషన్ లేదని తెలిపారు. ప్రీ కాస్ట్ పనుల్లో కేఎంవీ కాంట్రాక్టు సంస్థకు అనుభవం ఉందని, ఆర్నెల్లలో పూర్తి చేసి ఆరు అంతస్తుల భవనం ఆర్‌అండ్‌బీకి అప్పగించనున్నారని వివరించారు.     
- గంగాధరం, ఇంజనీర్ ఇన్ ఛీఫ్

>
మరిన్ని వార్తలు