ప్రాణాలు తీసిన కారు..

12 May, 2016 04:53 IST|Sakshi
ప్రాణాలు తీసిన కారు..

♦ హ్యాండ్‌బ్రేక్ సరిగా వేయకపోవడంతో వెనక్కి దూసుకెళ్లిన కారు
♦ రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్న యువతిని ఢీ కొట్టిన వైనం
♦ ఎదురుగా మరో కారు పార్క్ చేసి ఉండటంతో రెండు కార్ల మధ్య నలిగి మృత్యువాత
♦ నగరంలోని శ్రీనగర్ కాలనీలో దుర్ఘటన
 
 హైదరాబాద్: రోడ్డు పక్కన నిలిపి ఉంచిన కారు ఆ యువతి పాలిట మృత్యు శకటంగా మారింది. పార్క్ చేసిన కారు డ్రైవర్ లేకుండానే ప్రమాదవశాత్తూ వెనక్కి దూసుకురావడంతో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న యువతి దుర్మరణం పాలైంది. ఈ హృదయవిదారక ఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీనగర్ కాలనీలోని గణపతి కాంప్లెక్స్ సమీపంలో ఓ సెకండ్ హ్యాండ్ కార్ల విక్రయ కేంద్రం ఉంది. అక్కడ ఏపీ 09 సీజీ 2464 అనే చవర్లెట్ బ్లాక్ కలర్ కారును అమ్మకానికి ఉంచారు.

బుధవారం ఉదయం 10 గంటల సమయంలో మరో కారు అమ్మకానికి రావడంతో విక్రయ కేంద్రం డ్రైవర్ చవర్లెట్ కారును బయటకు తీసుకొచ్చి ఫుట్‌పాత్‌పై పార్క్ చేశాడు. అయితే హ్యాండ్‌బ్రేక్ సరిగా వేయకపోవడంతో అక్కడ పార్క్ చేసిన నాలుగైదు నిమిషాల్లోనే రోడ్డు పల్లంగా ఉండటంతో కారు వెనక్కి వేగంగా దూసుకె ళ్లింది. చుట్టుపక్కల వారు గమనించి కేకలు వేయడంతో డ్రైవర్ గమనించి కారును ఆపేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఇదే సమయంలో పక్కనే ఉన్న సిసిరో ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సాఫ్ట్‌వేర్ సంస్థలో హెచ్‌ఆర్ మేనేజర్‌గా పనిచేస్తున్న దేవలె అంబికాభాయి(25) ఇయర్‌ఫోన్స్‌తో మొబైల్ మాట్లాడుకుంటూ రోడ్డుపక్క నుంచి నడుచుకుంటూ వెళ్తోంది. వెనక నుంచి కారు వస్తున్న విషయాన్ని ఆలస్యంగా గమనించి పక్కకు జరుగుదామని ఆమె అనుకున్నంతలోనే ఎదురుగా ఓ మారుతి కారు పార్క్ చేసి ఉంది.

వెనకాల నుంచి దూసుకొస్తున్న కారు నుంచి తప్పించుకునే క్రమంలో రెండు కార్ల మధ్య ఇరుక్కుపోయింది. దీంతో ఆమె తలపగిలి తీవ్ర రక్తస్రావం కావడంతో రక్తపుమడుగులో విలవిల్లాడింది. స్థానికులు వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ప్రకటించారు. కర్నూలు జిల్లా శ్రీశైలం సమీపంలోని సున్నిపెంట గ్రామానికి చెందిన అంబిక గత నెల 23న ఈ సంస్థలో చేరింది. తండ్రి నాగేశ్వర్‌రావు బీఎస్‌ఎన్‌ఎల్ ఉద్యోగి కాగా, తల్లి ల క్ష్మీభాయి గృహణి. మృతురాలు అంబిక వివాహం ఇటీవలే నిశ్చయం కాగా వచ్చే నెలలో నిశ్చితార్థం జరపాలని తల్లిదండ్రులు తలపెట్టిన సమయంలోనే ఈ ప్రమాదం జరగడంతో వారు కన్నీరుమున్నీరవుతున్నారు. మరోవైపు బంజారాహిల్స్ ఏసీపీ ఉదయ్‌కుమార్‌రెడ్డి, ఇన్‌స్పెక్టర్ కె.శ్రీనివాస్ ఘటనాస్థలంలో విచారణ చేపట్టారు. నిర్లక్ష్యంగా కారు పార్క్ చేసిన ప్రవీణ్ అనే డ్రైవర్‌పై ఐపీసీ 304(ఏ) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు