‘ఓలా’ మోసాల నుంచి రక్షించండి

28 Jan, 2018 03:50 IST|Sakshi

పోలీసులకు ఫిర్యాదు చేసిన కార్ల యజమానులు  

హైదరాబాద్‌: ఓలా క్యాబ్స్‌ మోసాల నుంచి రక్షించాలని కార్ల యజమానులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కార్ల యజమానులతో సంస్థ ఒప్పందం కుదుర్చుకున్న సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా తుంగలో తొక్కుతూ తీవ్ర అన్యాయం చేస్తోందని బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు. శనివారం కేపీహెచ్‌బీ కాలనీలోని ఓలా క్యాబ్స్‌ కార్యాలయం వద్దకు చేరుకున్న కార్ల యజమానులు, బాధితులు సంస్థ ప్రతినిధులతో మాట్లాడేందుకు యత్నించగా అక్కడి బౌన్సర్లు వారిని అనుమతించలేదు. దీంతో వారు ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం తమకు న్యాయం చేయాలని కేపీహెచ్‌బీ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఓలా సంస్థ కిలోమీటరుకు రూ.17 ఇస్తామని, కస్టమర్‌ కారెక్కి దిగితే రూ.వంద ఇన్సెంటివ్‌ ఇస్తామని చెప్పి మూడు నెలలు మాత్రమే ఇచ్చిందని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. తరువాత ఒక్కొక్కటిగా హామీలన్నింటినీ తుంగలో తొక్కి ప్రస్తుతం కిలోమీటరుకు రూ.ఐదు చెల్లిస్తూ తీవ్ర అన్యాయం చేస్తోందన్నారు. దీంతో 14 గంటల పాటు డ్యూటీ చేసినా తిరిగి జేబులోంచి డబ్బులు చెల్లించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని బాధితులు విచారం వ్యక్తం చేశారు. కారు రుణాలు చెల్లించలేక, కుటుంబాలను పోషించలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న తమకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. ఇప్పటికే 30కి పైగా కేసులు పెట్టినా పోలీసులు ఓలా క్యాబ్స్‌పై ఎలాంటి చర్యలూ తీసుకోలేదని బాధితుడు షేక్‌ సాజిద్‌ ఆవేదన వ్యక్తం చేశారు. 

>
మరిన్ని వార్తలు